టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల గృహనిర్బంధం

ABN , First Publish Date - 2021-07-31T09:06:21+05:30 IST

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాల పరిశీలనకు శనివారం వెళ్లనున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల గృహనిర్బంధం

కొండపల్లి వెళ్లకుండా బొండా,వర్ల రామయ్య, కొల్లు హౌస్‌ అరెస్టు

గుంటూరులో ఆనందబాబు ఇంటి తలుపులు మూసివేత


విజయవాడ/గుంటూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాల పరిశీలనకు శనివారం వెళ్లనున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని వారికి నోటీసులు జారీ చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ వర్గీయులు భౌతిక దాడికి పాల్పడితే.. పోలీసులు తిరిగి ఆయనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు పంపడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పది మంది పార్టీ సీనియర్‌ నాయకులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శనివారం అక్కడకు వెళ్లనుంది. ఇందులో కృష్ణా జిల్లాకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. ఈ ముగ్గురినీ శుక్రవారం సాయంత్రం పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. వారి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును కూడా హౌస్‌ అరెస్టు చేశారు.


ఆయన బయటకు రాకుండా ఇంటి తలుపులు మూసివేశారు. దీనిపై ఆయన మండిపడ్డారు. తన ఇంటికి వచ్చి తలుపులు వేసే హక్కు ఎవరిచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు బయటపడతాయనే తమను కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లకుండా ఆపాలనుకుంటున్నారని, ఎన్ని అవరోధాలు కలిగించినా.. పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకుని శనివారం కొండపల్లి ప్రాంతాన్ని పరిశీలించి తీరతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.

Updated Date - 2021-07-31T09:06:21+05:30 IST