పక్కా ఇళ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-24T04:15:25+05:30 IST

ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్ల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని బుధవారం హౌసింగ్‌ జేసీ విదేహ్‌ఖరే ఆదేశించారు.

పక్కా ఇళ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేయాలి
భూములను పరిశీలిస్తున్న జేసీ విదేహ్‌ ఖరే

హౌసింగ్‌ జేసీ విదేహ్‌ ఖరే


ముత్తుకూరు, జూన్‌ 23: ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్ల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని బుధవారం హౌసింగ్‌ జేసీ విదేహ్‌ఖరే ఆదేశించారు. ముత్తుకూరు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలోని పక్కాఇళ్ల లేఅవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ పక్కాఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందన్నారు. లేఅవుట్లలో లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించినా, ఇంకా ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ముత్తుకూరు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలోని లేఅవుట్‌లో రహదారి, డ్రైన్‌ సౌకర్యాలపై సంతృప్తి వ్యకం చేశారు. ఇప్పటికే కొందరే ఇళ్ల నిర్మాణం చేపట్టడంపై స్థానికులతో మాట్లాడారు. ఈ లేఅవుట్‌లో విద్యుత్‌ సౌకర్యం, నిర్మాణానికి నీటి లభ్యత లేకపోవడాన్ని జేసీ దృష్టికి లబ్ధిదారులు తీసుకువచ్చారు. ఈ విషయంపై జేసీ స్పందిస్తూ, రెండు రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో పాటు, నీటి అవసరాల కోసం బోరు వేయాలని మండల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గండవరపు సురేష్‌బాబు, హౌసింగ్‌ శాఖ ఈఈ శేషయ్య, డీఈఈ సత్యనారాయణ, ఏఈ సుబ్రహ్మణ్యం, తహసీల్దారు సోమ్లానాయక్‌, ఎంపీడీవో ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. 


ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌ హౌసింగ్‌ పథకం

తోటపల్లిగూడూరు : పేదలకు గృహ వసతి కల్పించే వైఎస్సార్‌  హౌసింగ్‌ పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ ఖరే  పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని వరిగొండలో గృహ నిర్మాణ పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నిరుపేదలకు నిర్మించే ఇళ్ల నిర్మాణాల నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల ఎంపికపై అడ్డంకులు తొలగిపోయిన వెంటనే పట్టాలను లబ్ధిదారులకు   అందజేయాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు రమాదేవి, ఎంపీడీవో కన్నం హేమలత, ఆర్‌ఐ శ్యాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-24T04:15:25+05:30 IST