ఇల్లే.. ఓ క్లినిక్‌!

ABN , First Publish Date - 2020-08-02T08:52:27+05:30 IST

ఇది ఒక రోగికి డాక్టర్‌ చెబుతున్న విషయం కాదు! కొత్తగా కొనుకొచ్చిన పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఇంట్లో నాన్నకు ఇస్తూ...

ఇల్లే.. ఓ క్లినిక్‌!

  • అందరూ కరోనా నిపుణులే!
  • భారీగా పల్స్‌ ఆక్సీమీటర్ల కొనుగోలు
  • రోజూ ఆక్సిజన్‌, పల్స్‌ తనిఖీ
  • ఇళ్లలోనే ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్లు
  • ఆవిరి యంత్రాలకు ఫుల్‌ డిమాండ్‌
  • థర్మామీటర్‌, గ్లూకోమీటర్లకూ గిరాకీ
  • మాస్కులు, గ్లౌజులకు లెక్కే లేదు
  • ఇంటింటా పారాసెటమాల్‌, విటమిన్‌ బిళ్లలు.. వైరస్‌ తెచ్చిన మార్పు

‘‘ఆక్సిజన్‌ రీడింగ్‌ 94కు పైన ఉంటే పర్‌ఫెక్ట్‌. 90కంటే తక్కువగా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ తక్కువకు పడిపోతే ఐరన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. ఇక... పల్స్‌ 60కి పైన ఉండాలి. పల్స్‌ 60కంటే తక్కువగా ఉంటే జాగ్రత్త పడాలి’’.... 


ఇది ఒక రోగికి డాక్టర్‌ చెబుతున్న విషయం కాదు! కొత్తగా కొనుకొచ్చిన పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఇంట్లో నాన్నకు ఇస్తూ... కుమారుడు చెబుతున్న వివరాలు! అవును... కరోనా దెబ్బకు సామాన్యులు సైతం వైద్యం గురించి తెలుసుకోవాల్సి వస్తోంది. కొన్ని ఇళ్లు ఓ మోస్తరు క్లినిక్‌ను తలపిస్తున్నాయి! జాగ్రత్త కావొచ్చు, అతి జాగ్రత్త కావొచ్చు... ఏదైనా తప్పడం లేదు మరి!


ఓ ఆరు నెలలు వెనక్కి వెళ్లండి! హోం క్వారంటైన్‌ అంటే ఏమిటో ఎందరికి తెలుసు? ‘ఐసొలేషన్‌’ అంటే ఏమిటో! కర్ఫ్యూలు తెలుసు కానీ... లాక్‌డౌన్‌ ఎరుగని దేశంమనది! కరోనా వచ్చింది... ఇలాంటి పరిభాషను సామాన్యులకు సైతం పరిచయం చేసింది.   షుగర్‌ టెస్టులు మాత్రమే తెలిసిన సామాన్యులు సైతం ఇప్పుడు యాంటీజెన్‌ టెస్టు, ఆర్టీ పీసీఆర్‌, స్వాబ్‌ల గురించి మాట్లాడుతున్నారు. అప్పట్లో ఎవరైనా మాస్కు పెట్టుకుని తిరిగితే... ‘వీడు బాగా ఓవర్‌ చేస్తున్నాడు’ అని మనసులో అనుకునే వాళ్లు. ఇప్పుడు మాస్క్‌లేకుండా బయటికి వస్తే... ‘వీడికి ప్రాణాలంటే లెక్కలేకుండా ఉంది’ అని తిట్టేస్తున్నారు. గతంలో ఎవరైనా మాటిమాటికీ చేతులు కడిగితే... ‘మరీ అన్ని సార్లు కడగొద్దు. దుమ్ములో తిరిగితేనే ఇమ్యునిటీ పెరుగుతుంది’ అని మందలించేవాళ్లు. ఇప్పుడు... ‘శానిటైజేషన్‌’ జీవితంలో ఒక భాగమైంది. అంతెందుకు... సర్జికల్‌ మాస్క్‌, గ్లౌజ్‌లు డాక్టర్ల ముఖాలకు, చేతులకు మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు... అందరి మూతులూ ఏదోఒక మాస్కుతో బంద్‌! 


ఇవన్నీ తప్పదట...

ఒకప్పుడు మామూలు మార్కెట్లలోనే కనిపించని పలురకాల వైద్య పరికరాలు ఇప్పుడు రోడ్లమీద పెట్టి అమ్మేస్తున్నారు. సినిమాల్లో, ఒక స్థాయి ఆస్పత్రుల్లో మాత్రమే చూసిన పల్స్‌ ఆక్సీమీటర్‌... ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది. రోజూ కనీసం పది పల్స్‌ ఆక్సీమీటర్లు విక్రయిస్తున్నామని విజయవాడలోని ఒక సర్జికల్‌ షాప్‌ నిర్వాహకుడు తెలిపారు. అదే విధంగా ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్ల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. కరోనా బాధితుల్లో ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మూడు గంటలపాటు కాన్‌సెన్‌ట్రేటర్ల ఆక్సిజన్‌ అందిస్తే మంచిదని చెబుతున్నారు. ఇందులో సింగిల్‌ ట్యూబ్‌, డబుల్‌ ట్యూబ్‌ రెండు రకాలు అందుబాటులో ఉంటాయి. సెల్‌ఫోన్‌లాగా చార్జి చేసుకుంటే... గదిలో ఉన్న వాయువును తీసుకుని, అందులోని ఆక్సిజన్‌ను మాత్రం నిల్వ ఉంచుకుంటుంది. వీటి ధర రూ.18వేల నుంచి మొదలవుతుంది. సింగిల్‌ ట్యూబ్‌ కాన్‌సెన్‌ట్రేటర్‌ ద్వారా ఒకరికి,  డబుల్‌ ట్యూబ్‌ ద్వారా ఇద్దరికి సుమారు 3 గంటలపాటు ఆక్సిజన్‌ను అందించవచ్చు. విజయవాడలో రోజూ 5 ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్‌ అమ్ముడవుతున్నాయి. ఆన్‌లైన్‌లో అదే స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆవిరి పడితే కరోనా వైరస్‌ పరార్‌ అనే ప్రచారం బాగా ఊపందుకుంటోంది. దీంతో ఆవిరి పట్టే పరికరాలను విపరీతంగా కొనేస్తున్నారు. కరోనాకు తొలి సంకేతం... జ్వరం. టెంపరేచర్‌ కొలవాలంటే థర్మామీటర్‌ ఉండాల్సిందే. టెంపరేచర్‌ ఉన్నట్లు అనుమానమొస్తే... చెక్‌ చేయించుకోవడానికి బయటికి వెళ్లే పరిస్థితిలేదు. అందుకే, థర్మామీటర్లూ ఎక్కువగా కొనేస్తున్నారు. రక్తపోటు కొలిచే బీపీ ఆపరేటర్ల కొనుగోళ్లూ పెరిగాయి. ఇక... పారాసెటమాల్‌, విటమిన్‌ ట్యాబ్లెట్లు, అజిత్రోమైసిన్‌ వంటి మందులు తప్పనిసరిగా ‘అందుబాటులో’ ఉంచుకుంటున్నారు. 


మాస్క్‌ మహరాజులే... 

కరోనా ప్రారంభం నుంచే మాస్కులు, గ్లౌజులు, రకరకాల శానిటైజర్ల విక్రయాలు పెరిగాయి. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. ఓ మోస్తరు ప్రైవేటు ఆసుపత్రిలోనే రోజుకు 40 పీపీఈ కిట్లు వాడుతున్నారు. పెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 100 నుంచి 200 వరకు వినియోగిస్తున్నారు.  కరోనా వచ్చిన తొలినాళ్లలో ఒక్కో పీపీఈ కిట్‌ రూ.2వేల నుంచి 3 వేలు పలికింది. ఇప్పుడు ఐదారొందలకు దొరుకుతోంది. విజయవాడ నగరంలో 30 చిన్న, పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల్లో  3 వేల నుంచి 5వేల పీపీఈ కిట్లను వినియోగిస్తున్నారు. మాస్కులు, గ్లౌజుల వినియోగానికి లెక్కేలేదు!


హలో... టెలీ మెడిసిన్‌

టెలీమెడిసిన్‌ కొత్తేమీ కాదు. అయితే... నేరుగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లడానికే అత్యధికులు మొగ్గు చూపేవారు. కరోనా పుణ్యమా అని టెలీ మెడిసిన్‌ విభాగం బాగా పుంజుకుంది. వైరస్‌ భయంతో సాధారణ జ్వరాలకు, రోగాలకు చికిత్స అందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఫోన్‌ ద్వారా వీడియో కాల్స్‌ నుంచి వైద్యుల సలహా తీసుకోవడం ఎక్కువైంది. కన్సల్టేషన్‌ ఫీజుగా జనరల్‌ మెడిసిన్‌కు అయితే రూ.500, స్పెషలిస్టులకు రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే కరోనా తెచ్చిన మార్పులివి!. - విజయవాడ - ఆంధ్రజ్యోతి


Updated Date - 2020-08-02T08:52:27+05:30 IST