ఇళ్ల బకాయిదారులు.. ఎవరు?

ABN , First Publish Date - 2021-10-13T05:30:00+05:30 IST

ఎన్నికలకు ముందు ఇంటి బాకీలను రద్దు చేస్తామన్నారు.. తీరా అధికారం చేపట్టిన తర్వాత దీనిని ఓ ఆదాయమార్గంగా ఎంచుకున్నారు.

ఇళ్ల బకాయిదారులు.. ఎవరు?

గృహ రుణ లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు 

మొండి బకాయిదారుల వివరాల సేకరణలో అధికారులు

వారందరితో ఓటీఎస్‌కు దరఖాస్తు చేయించాలని ఆదేశాలు

గుంటూరులో రూ.40 కోట్ల వసూలే లక్ష్యంగా కార్యాచరణ


గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఇంటి బాకీలను రద్దు చేస్తామన్నారు.. తీరా అధికారం చేపట్టిన తర్వాత దీనిని ఓ ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి మరీ గృహనిర్మాణ పథకాల ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించలేకపోయిన మొండి బకాయిదారులందరినీ గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. 1983 -2011 సంవత్సరాల మధ్యన వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించలేకపోయిన మొండి బకాయిదారులందరిని గుర్తించాలని గ్రామ/వార్డు సచివాలయాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. క్లస్టర్ల వారీగా బకాయిదారులను గుర్తించి వారందరితో ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) స్కీమ్‌కి దరఖాస్తు చేయించాలని అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు ఓటీఎస్‌ కింద చెల్లించుకుని ఆయా బకాయిదారులకు హక్కులు కల్పించేందుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్క గుంటూరు నగరంలోనే ఈ విధమైన బకాయిదారులు ఇప్పటివరకు 21,416 మంది తేలారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, మునిసిపాలిటీల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉండొచ్చని భావిస్తున్నారు.


ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం

ఏదో ఒక రూపంలో ప్రజల ముక్కు పిండి ఆదాయాన్ని సమకూర్చుకునే నిర్ణయాలను ప్రభుత్వం వేగవంతం చేస్తూ వాటికి కార్యరూపం ఇస్తోన్నది. ఈ క్రమంలోనే హౌసింగ్‌ మొండి బకాయిదారులకు ఓటీఎస్‌ని తీసుకొచ్చింది. ఎన్నికలకు ముందు రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు పేద ప్రజల వద్ద ఒక్కో ఇంటికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసే ప్రణాళికని రూపొందించారు. గుంటూరు నగరంలో ఎట్టలేదన్నా రూ.40 కోట్లు ఈ స్కీం కింద వసూలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి మొండి బకాయిదారులను గుర్తించే ప్రక్రియలో సచివాలయాల సిబ్బంది తలమునకలౌతున్నారు. అయితే 21 వేల పైచిలుకు బకాయిదారుల్లో ఇప్పటి వరకు కేవలం 4 వేల మందిని మాత్రమే గుర్తించగలిగారు. చాలామంది చిరునామాలు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఓటీఎస్‌ ద్వారా కొంత ఆదాయాన్ని మూటగట్టుకోవాలన్న ప్రభుత్వ ఆకాంక్షకి అదిలోనే నిరాశ ఎదురౌతున్నది.


ఇప్పటికే ఎన్నో చేతులు మారిపోయాయి

1983 నుంచి ఇళ్లు కావడంతో ఇప్పటికే వాటిల్లో చాలావరకు చేతులు మారిపోయాయి. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల్లో లబ్ధిదారు పేరు ఒకటి ఉంటే క్షేత్రస్థాయిలో వేరొకరు ఉన్నారు. వాటికి ఎలా ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీంని అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయా ఇళ్లలో నివాసం ఉంటోన్న వారిలో కొందరు తమకు రిజిస్ట్రేషన్‌ చేస్తారా అని వాకబు చేస్తున్నారు. 


 

Updated Date - 2021-10-13T05:30:00+05:30 IST