ఇంటి నెంబర్లలో గందరగోళం

ABN , First Publish Date - 2020-08-13T10:05:04+05:30 IST

వైరా పూర్వపంచాయతీగా ఉన్న సమయంలో అప్పటి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇళ్లనెంబర్లను ఆన్‌లైన్‌ చేయని ఫలితంగా ప్రస్తుతం

ఇంటి నెంబర్లలో గందరగోళం

ఆన్‌లైన్‌లో నమోదు కాని వందలాది ఇళ్లు

ఒకే నెంబరు ఇద్దరికి..

వైరా మునిసిపాలిటీలో గందరగోళం


వైరా, ఆగస్టు 12: వైరా పూర్వపంచాయతీగా ఉన్న సమయంలో అప్పటి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇళ్లనెంబర్లను ఆన్‌లైన్‌ చేయని ఫలితంగా ప్రస్తుతం మునిసిపాలిటీలో గందరగోళం నెలకొంది. ఇళ్ల నిర్మాణ సమయంలో అనుమతులు తీసుకొని అందుకు అవసరమైన సొమ్మును పంచాయతీకి చెల్లించినప్పటికీ వందలాదిమంది ఇళ్లు ఆన్‌లైన్‌లో నమోదుకాలేదు. 


ఆన్‌లైన్‌లో మారుతున్న నెంబర్లు

2018 ఆగస్టు నుంచి వైరా మునిసిపాలిటీగా ఏర్పడింది. దాదాపు 700కుపైగా ఇళ్లు ఆన్‌లైన్‌లో నమోదుకాలేదు. ఆరేడునెలలుగా మునిసిపాలిటీలో ఆన్‌లైన్‌ ఇళ్ల నమోదు జరుగుతోంది. పంచాయతీగా ఉన్న సమయంలో ఇళ్లనిర్మాణానికి అనుమతులు ఇచ్చినప్పుడు కేటాయించిన ఇళ్లనెంబర్లు ఇప్పుడు మునిసిపాలిటీ ఆన్‌లైన్‌ సందర్భంగా పూర్తిగా మారిపోతున్నాయి. పంచాయతీ ఉన్నప్పుడు ఇంటి నిర్మాణానికి అనుమతిఇచ్చిన సమయంలో పక్కనున్న ఇంటినెంబర్లను పరిగణలోకి తీసుకొని బైనెంబర్లు కేటాయించారు. ప్రస్తుతం మునిసిపాలిటీలో ఆ ఇళ్లను ఆన్‌లైన్‌ చేయించుకొనే సమయంలో తమ ఇళ్లకు కొత్తనెంబర్లు కేటాయిస్తుండటంతో ఇళ్లయజమానులు గందరగోళానికి గురవుతున్నారు. 


నమోదు కాని వందల ఇళ్లు

వైరా మునిసిపాలిటీలో మొత్తం 6,150 ఇళ్లు ఉన్నాయి. వాటిలో  ఆరేడువందల ఇళ్లు పంచాయతీగా ఉన్న సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. గత కొద్దికాలంవరకు వైరా మునిసిపల్‌ పాలకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు నివాసముంటున్న ఒక అపార్టుమెంట్‌ లోని ఫ్లాట్లు కూడా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. గత ఒకట్రెండునెలల క్రితమే ఆఫ్లాట్లు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. పంచాయతీగా ఉన్నప్పుడు రివిజన్‌ సమయంలో కొత్త ఇళ్లనెంబర్లను రికార్డులో నమోదుచేసి ఆతర్వాత ఆన్‌లైన్‌ చేయలేదు. ఫలితంగా ఇప్పుడు అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 


ఒకే నెంబరు ఇద్దరికి ..

వైరాలోని న్యూలిటిల్‌ఫ్లవర్‌ స్కూల్‌ యాజమాన్యం స్థలం కొనుగోలు చేసి భవనాలు నిర్మించే సమయంలో దాదాపు రూ.7నుంచి రూ.10లక్షలు చెల్లించి అనుమతులు తీసుకుంది. ఆఇంటి నిర్మాణానికి 7-427/సీ నెంబర్‌ను కేటాయించారు. అయితే ఇప్పుడు అదే ఇంటినెంబర్‌ మరో మహిళ పేరుతో ఉంది. అంటే ఒకేనెంబర్‌ ఒక మహిళ పేరుతో ఉన్న ఇంటికి, ఈ పాఠశాల భవనాలకు కేటాయించారు. తమకు అదే ఇంటినెంబర్‌ కావాలని పాఠశాల యాజమాన్యం రెండేళ్ల నుంచి  అధికారులను కోరుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లో తమకు ఇదే ఇంటినెంబర్‌ ఉన్నందున ఇప్పుడు ఆన్‌లైన్‌లో నెంబర్‌ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలోని నెంబర్‌కు  ప్పుడిచ్చే నెంబర్‌కు పొంతన లేకపోతే అనేక న్యాయపరమైన సమస్యలు  తలెత్తే ప్రమాదముందని ఆస్కూల్‌ యాజమాన్యం పేర్కొంటుంది. 


తీవ్ర గందరగోళం

మునిసిపాలిటీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆరు అంకెలతో ఇంటినెంబర్‌ కేటాయిస్తున్నారు. గతంలో ఇళ్ల అనుమతుల కోసం డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్‌లో నమోదు కోసం సంబంధిత ఇంటి యజమాని తమ ఇంటిముందున్న ఫొటోతో డాక్యుమెంట్స్‌, ఇంటి కొలతలతో తన అంగీకారాన్ని తెలియజేస్తూ సొంత డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంది. దీనివలన అనేక సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇదే మునిసిపాలిటీలోని పదోవార్డులో వాసిరెడ్డి రమేష్‌కు చెందిన ఇంటినెంబర్‌ విషయంలో కూడా వివాదం నడుస్తోంది. ఆరేడువందల ఇళ్లనెంబర్లలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇంకా రెండు,మూడువందల ఇళ్లనెంబర్లను ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. ఈవిధంగా వైరా మునిసిపాలిటీలో ఇళ్లనెంబర్ల మార్పులో తీవ్ర గందరగోళం నెలకొనడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.


ఉన్నతాధికారులకు నివేదించాం..

ఈ విషయమై మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ను వివరణ కోరగా ఈ సమస్య తమ దృష్టికి కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఈ సమస్యను మునిసిపల్‌ ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. మునిసిపల్‌ నిబంధనలకు లోబడి ఇళ్లనెంబర్ల ఆన్‌లైన్‌ ప్రక్రియను ఎవరికీ ఇబ్బంది లేకుండా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


నేడు వైరా మునిసిపల్‌ సమావేశం

వైరా మునిసిపాలిటీ సాధారణ సమావేశం గురువారం నిర్వహిస్తున్నామని కమిషనర్‌ వి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11గంటలకు మునిసిపల్‌ కార్యాలయంలో పాలకవర్గ ప్రత్యేక సమావేశం చైర్మన్‌ సూతకాని జైపాల్‌ అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఆతర్వాత సాధారణ సమావేశం జరుగుతుందని వివరించారు.

Updated Date - 2020-08-13T10:05:04+05:30 IST