జగనన్న పట్టా లోగుట్టు ఎవరికి ఎరుక

ABN , First Publish Date - 2021-06-10T05:46:54+05:30 IST

జగనన్న నవరత్నాల పథకాలు పక్కదారి పడుతున్నాయి.

జగనన్న పట్టా లోగుట్టు ఎవరికి ఎరుక

4 వేలమంది అనర్హులకు పట్టాలు

తొలిగించేందుకు కసరత్తు


తిరుపతి-ఆంధ్రజ్యోతి

జగనన్న నవరత్నాల పథకాలు పక్కదారి పడుతున్నాయి.మా డివిజన్‌కు చెందిన తిమ్మినాయుడు పాళెంలో నలుగురు కోటీశ్వరుల కుటుంబాలకు  ఇంటిపట్టాలు ఇచ్చారు. వాళ్లందరికీ సొంతిళ్లున్నాయి. విలువగల భూములూ ఉన్నాయి. శ్మశాన స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు.పరిశీలించి చర్యలు తీసుకోగలరు

--- అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌ ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో చేసిన విజ్ఞప్తి ఇది. 


వైసీపీ కార్పొరేటర్‌ చెప్పినట్టు ఆ ఒక్క డివిజన్లోనే కాదు తిరుపతిలోని అన్ని డివిజన్లలో అనర్హులున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇళ్లు మంజూరైపోయాయి.కార్పొరేషన్లోని కొందరు సిబ్బంది, సచివాలయ, వలంటీర్ల చేతివాటంతోనే ఇదంతా జరిగినట్టు విమర్శలున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో 24వేల మందికి ‘జగనన్న పట్టా’లను మంజూరు చేశారు. అందులో కొంతమంది భార్యాభర్తల నుంచి వేర్వేరుగా దరఖాస్తులను స్వీకరించి రెండింటినీ ఓకే చేశారు.  దరఖాస్తు సమయంలో ఇద్దరూ ఒకే డివిజన్‌లో కాకుండా వేర్వేరు డివిజన్లలో దరఖాస్తులందించి పట్టాలు పొందారు.  ఇంటిపట్టాకు సంబంధించి ఆన్‌లైన్లో నమోదుచేసే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆధార్‌తో సంబంధం లేకుండా రేషన్‌ కార్డు ఆధారంగా ఇంటిపట్టాలను నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రజాసాధికార సర్వేని పరిగణలోకి తీసుకోకపోయినట్టు తెలుస్తోంది. సచివాలయ వ్యవస్థ రాకముందు నియమితులైన వలంటీర్లు అర్హుల పేరుతో ఎక్కువమంది నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో ఇంటి పట్టాకోసం దాదాపు 90 వేల అప్లికేషన్లు వచ్చాయి. పెద్దమొత్తంలో దరఖాస్తులు రావడంతో వాటిని నిశితంగా పరిశీలించలేకపోయారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. 


ఓట్ల కోసమో తొలగించలేదా?

 ఇంటి పట్టాల కోసం 24 వేల మందిని ఎంపికచేసినట్టు ప్రకటించాక వీరిలో దాదాపు 4వేల మంది అనర్హులున్నారని గత ఏడాది చివరిలోనే కార్పొరేషన్‌ అధికారులు గుర్తించారు. అయితే తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అనర్హులను తొలగిస్తే ఓట్లు తగ్గిపోతాయని అధికారపార్టీ నేతలు అడ్డుకున్నట్టు సమాచారం.తాజాగా తొలగింపు ప్రక్రియకు కార్పొరేషన్‌ సిద్ధమైంది. జియోట్యాగింగ్‌, పీఎంఈవై మ్యాపింగ్‌లో ఇప్పటికే 3వేల మంది అనర్హుల జాబితాను గుర్తించినట్టు తెలుస్తోంది. మరో వెయ్యిమంది కూడా ఉన్నారని, పట్టాలు చేతికి ఇచ్చినతర్వాత కూడా వాటిని రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. హౌసింగ్‌ వెబ్‌సైట్‌ సర్వర్‌ ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటుందని, అయితే ఆధార్‌ ప్రకారమే అర్హులైన లబ్ధిదారులకు పట్టా కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-06-10T05:46:54+05:30 IST