పంద్రాగస్టున పట్టా అందేనా ?

ABN , First Publish Date - 2020-08-12T10:45:42+05:30 IST

ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు మరోసారి నిరాశ తప్పదా ? ఇళ్ల పట్టాలు అందుకునేందుకు మరికొంతకాలం ..

పంద్రాగస్టున పట్టా అందేనా ?

ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న పేదలు

ఇప్పటికే మూడు సార్లు వాయిదా

సుప్రీంకోర్టు నుంచి రాని అనుమతి

ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారుల నిరీక్షణ

జిల్లాలో పూర్తిస్థాయిలో సిద్ధం కాని ప్లాట్లు

నెమ్మదిగా ముద్రణ ప్రక్రియ


నెల్లూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు మరోసారి నిరాశ తప్పదా ? ఇళ్ల పట్టాలు అందుకునేందుకు మరికొంతకాలం ఎదురుచూడాల్సిందేనా..? నాలుగో ‘సారీ’ కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడనుందా..? అంటే అధికార వర్గాల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే పంపిణీ ఆలస్యానికి కారణంగా ఉంది.


చట్టబద్ధత కల్పిస్తేనే..

 సాధారణంగా పేదలకు ఇచ్చే భూమిని డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం అందిస్తుంటుంది. దానికి చట్టబద్ధత ఉంది. అయితే ఇప్పుడు పంపిణీ చేయాలనుకున్న పట్టాలను కన్వేయన్స్‌ డీడ్‌ల రూపంలో ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కన్వేయన్స్‌ డీడ్‌లకు చట్టబద్ధత లేదు. ఏ ప్రాతిపదినక, ఏ చట్ట నిబంధనలకు లోబడి పేదలకు కన్వేయన్స్‌ డీడ్‌లు ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.


ఏ చట్ట ప్రకారం కన్వేయన్స్‌ డీడ్‌లు ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఇంత వరకు దీనిపై అక్కడ విచారణ జరగలేదు. ప్రభుత్వం ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూల తీర్పు వస్తుందా..? పట్టాల పంపిణీ జరుగుతుందా..? అంటే ఎవరూ అవునని చెప్పలేకపోతున్నా రు. 


మూడు సార్లు వాయిదా

 మొదటగా ఈ ఏడాదిలో మార్చిలో ఉగాది రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ  తేదీ వాయిదా పడి ఏప్రిల్‌ 14కు చేరుకుంది. మళ్లీ మూడోసారి జూలై 8కు వాయిదా పడింది. ఆ తర్వాత ఆగస్టు 15న పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి నాలుగో సారైనా పట్టాల పంపిణీ జరుగుతుందా.. లేక మరోసారి వాయిదా పడుతుందా.. అన్నది మరో మూడు రోజుల్లో తేలుతుంది. 


పూర్తిస్థాయిలో సిద్ధం కాని ప్లాట్లు

జిల్లాలో 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం 3,455 ఎకరాల భూమి అవసరమైంది. 2,420 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా 1035 ఎకరాల ప్రైవేటు భూములను కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ భూ కొనుగోలులో ఇంకా అనేక వివాదాలు ఉన్నాయి. మొత్తం 1407 లేఅవుట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాని లేఅవుట్లు చాలానే ఉన్నాయి. ఒకవేళ ఆగస్టు 15న పట్టాల పంపిణీ చేసినా, ఆ రోజున చాలా మంది పేదలు పట్టాలు అందుకోలేరు.


పలుచోట్ల వివాదాస్పదం

 కొన్ని గ్రామాల్లో తమ భూములు లాక్కున్నారని అక్కడి పేదలు నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల వేసిన లేఅవుట్లు ఊరికి దూరంగా ఉన్నాయంటూ పేదలు ఆక్షేపణ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అర్హులను పక్కనపెట్టి అనర్హులను లబ్ధిదారుల జాబితాల్లో చేర్చారంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇన్ని సమస్యల నడుమ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సతమతమవుతూ వస్తున్నారు. భూమితో కూడుకున్న పనులను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని, హడావిడిగా చేస్తే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, దీనివల్ల పేదలకు స్థలాలు ఇచ్చినప్పటి కీ ఉపయోగం లేకుండా పోతుందని మొదటి నుంచి విశ్రాంత రెవెన్యూ అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం డెడ్‌లైన్‌ పెడుతుండడంతో అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారు.


కాగా పట్టాల పంపిణీకి మరో మూడు రోజులు మాత్రమే సమయముండడం, ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఇళ్ల పట్టాల పంపిణీ హడావిడి అధికార యంత్రాంగంలో కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు సిద్ధంగా కాకుండా ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో సిద్ధమైనప్పటికీ లాటరీ తీయలేదు. ఇదే సమయంలో లాటరీ తీసిన చోట పట్టాల ముద్రణ మొదలుపెట్టారు. అది కూడా వేగంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. 

Updated Date - 2020-08-12T10:45:42+05:30 IST