సినీఫక్కీలో ఇంటిని ఖాళీ చేయించేందుకు దాదాగిరీ

ABN , First Publish Date - 2021-06-25T13:56:06+05:30 IST

సినీఫక్కీలో కిరాయి రౌడీలతో దాదాగిరీ చేసి ఇంటిని ఖాళీ చేయించిన

సినీఫక్కీలో ఇంటిని ఖాళీ చేయించేందుకు దాదాగిరీ

  • కిరాయిరౌడీలతో ఇంట్లోని తట్టా.. బుట్టా రోడ్డు పాలు
  • కుటుంబ సభ్యులపై దాడి
  • కుత్బుల్లాపూర్‌లో వివాదాస్పద ఇంటి విషయంలో రసాభాస

హైదరాబాద్ సిటీ/కుత్బుల్లాపూర్‌ : సినీఫక్కీలో కిరాయి రౌడీలతో దాదాగిరీ చేసి ఇంటిని ఖాళీ చేయించిన ఘటన కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో గురువారం జరిగింది. సాయిబాబానగర్‌ రోడ్డు నెంబర్‌-05లోని ఓ ఇంటి క్రయవిక్రయం విషయంలో కొన్ని మాసాల క్రితం వివాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఇదే విషయంపై ఇంటి యజమాని, కొనుగోలుదారులకు మధ్య క్రమంగా గొడవలు, కొట్లాటలు, పోలీసు కేసులు, కోర్డును ఆశ్రయించడం వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే విషయంపై ఇల్లు అమ్మిన ఇద్దరు వ్యక్తులు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి హరీ్‌షరావు కారు ముందు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.


దౌర్జన్యంగా ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం..

ఇంటి కొనుగోలుదారుడు సుమారు 25 నుంచి 30 మందితో ఒక డీసీఎంలో గురువారం సదరు ఇంటి వద్దకు వచ్చి నానా రభస చేశాడు. ఇంటిని ఖాళీ చేయమంటే చేయకపోవడంతో ఇంట్లో ఉన్న తట్టా, బుట్టా, ఇతర వస్తువులను దౌర్జన్యంగా రోడ్డుపై విసిరేశారు. ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేశారు. వెంట తీసుకొచ్చిన డీసీఎంలో సోఫాలు, మంచాలు వంటివి ఎక్కించి ఇంటిని ఖాళీ చేయిం చే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే కిరాయి రౌడీలు పరారయ్యారు. సదరు ఘటనపై బాధితులను పోలీసులు కేసు పెట్టమని అడిగితే గతంలో నాలుగు కేసులు పెట్టామని, అన్ని ఆధారాలతో పోలీసు స్టేషన్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత సంఘటనపై కేసు పెట్టేందుకు వారు ససేమిరా అనడం గమనార్హం.


బాధితుల మాటల్లో..

ఇంటి విషయం వివాదంలో ఉంది. సదరు విషయంపై పోలీసు కేసులు నడుస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా దాడికి దిగితే ఆధారాలతో సహా స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసులతోపాటు జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కూ డా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాం. దీంతో ఇకపై ఎటువంటి దాడులు జరగవని పోలీసులు హామీ ఇచ్చారు. కానీ గురువారం అకస్మాత్తుగా ఆడ, మగ రౌడీల సమూహంతో ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులతో పాటు కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మహిళలపై దాడి చేశారు. గతంలో నాలుగు సార్లు అన్ని ఆధారాలతో కేసులు పెట్టామని అయినప్పుటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులపై నమ్మకం లేదని బాధితులు తెలిపారు. బాధితులు కేసు పెడితే బాధ్యులపై తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుని రిమాండ్‌కు తరలిస్తామని, వస్తువులు తరలించేందుకు వచ్చిన వాహనాన్ని కూడా జప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-25T13:56:06+05:30 IST