నగరంలో ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-05-09T06:00:09+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో కరీంనగర్‌లో ఇంటింటి సర్వేకు శనివారం శ్రీకారం చుట్టారు.

నగరంలో ఇంటింటి సర్వే
ఇంటింటి సర్వేలో పాల్గొన్న కమిషనర్‌ క్రాంతి

- లక్షణాలున్నవారికి మెడిసిన్‌ కిట్స్‌ పంపిణీ 

- రోజుకు ప్రతి డివిజన్‌లో 100 ఇళ్ల సర్వే

- పలు డివిజన్లలో సర్వేలో పాల్గొన్న కమిషనర్‌ క్రాంతి 

కరీంనగర్‌ టౌన్‌, మే 8: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో కరీంనగర్‌లో ఇంటింటి సర్వేకు శనివారం శ్రీకారం చుట్టారు. మున్సిపల్‌, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సంయుక్తంగా ప్రతి రోజు ప్రతి డివిజన్‌లో వంద ఇళ్లకు వెళ్ళి సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్వే కార్యక్రమాన్ని శనివారం వివిధ డివిజన్లలో ప్రారంభించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి పలు డివిజన్లలో పర్యటించి సర్వేలో పాల్గొని ప్రజలకు, సిబ్బందికి కొవిడ్‌-19పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలోని 60 డివిజన్లలో డోర్‌ టు డోర్‌ సర్వే చేపడతామని, ఒక్కో డివిజన్‌లో రోజుకు 100 ఇళ్ల వివరాలను సేకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. 14, 35, 38, 45 డివిజన్లలో పర్యటించిన ఆమె సప్తగిరికాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి రోజు 100కు తగ్గకుండా వ్యాక్సిన్‌ వేయాలని, అంతకంటే ఎక్కువ మంది వస్తే మరుసటి రోజు వారికి టీకాలు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి లాంటి ఫ్లూ లక్షణాలు ఉన్నాయా... అనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. కొవిడ్‌ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని, మంచి ఆహారం తీసుకోవాలని, ధైర్యంగా ఉండాలని, భయపడకుండా డాక్టర్‌ సూచనలను పాటిస్తే తప్పకుండా వ్యాధి నుండి త్వరగా కోలుకోవచ్చని ప్రజలకు సూచించారు. పరిస్థితి తీవ్రమైతే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సర్వేలో పాల్గొన్న సానిటేషన్‌ సిబ్బంది యూజీడీ జియోటాగింగ్‌ చేయాలని ఆదేశించారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున ప్రజలు మరికొన్ని రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వచ్చినా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లోనూ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్‌, గుగ్గిళ్ళ జయశ్రీ, పిట్టల వినోద శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-09T06:00:09+05:30 IST