వసూలు.. 46.25 శాతమే

ABN , First Publish Date - 2021-10-18T05:20:45+05:30 IST

మున్సిపాల్టీల్లో ఉద్యోగుల జీతాలు, పట్టణాల్లో ప్రగతి పనుల నిర్వాహణకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నులే.

వసూలు.. 46.25 శాతమే

 ఆస్తి పన్ను వసూళ్లు అంతంతే

మున్సిపాలిటీల్లో కొరవడిన పర్యవేక్షణ 

రూ.200.50 కోట్లకు రూ.92.75 కోట్లు వసూలు

రాష్ట్రంలో ప్రథమ స్థానంలో వినుకొండ, 107వ స్థానంలో నరసరావుపేట  


జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లు అంతంతగానే ఉన్నాయి. ఈ ఆర్థిక సంఘం పన్ను, పాత బకాయిలు కలిపి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ.200.50 కోట్ల బకాయిలకు ఇప్పటికి వసూలు చేసింది రూ.92.75 కోట్లే. అంటే పన్నుల్లో సగం కూడా అధికారులు వసూలు చేయలేక పోయారు. ఏటికేడు ఆస్తి పన్నుల బకాయిలు పేరుకుపోతున్నా.. మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తూ.. లక్ష్యాలు నిర్దేశిస్తున్నా ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు.  పన్ను వసూళ్లలో జిల్లాలోని వినుకొండ పురపాలక సంఘం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే జిల్లాలోని నరసరావుపేట పురపాలక సంఘం 107వ స్థానంలో  ఉంది. ఇక నీటి పన్ను వసూళ్లు కూడా అంతంగానే ఉన్నాయి. డిసెంబరు కల్లా నూరు శాతం పన్ను వసూలు చేయాలని మునిసిపాల్టీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. లక్ష్యాలు సాధించడంలో గుంటూరు కార్పొరేషన్‌తో పాటు నరసరావుపేట, మంగళగిరి పురపాలక సంఘాలు వెనుకంజలో ఉన్నాయి.


నరసరావుపేట, అక్టోబరు 17: మున్సిపాల్టీల్లో ఉద్యోగుల జీతాలు,  పట్టణాల్లో ప్రగతి పనుల నిర్వాహణకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నులే. ఇలాంటి పన్ను వసూళ్లలో మునిసిపాలిటీలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆస్తి, నీటి పన్ను వసూలు నత్తనడకన సాగుతున్నాయి. మునిసిపాలిటీలకు ఇచ్చిన లక్ష్యాల మేర పన్ను వసూలు జరగటం లేదు. పన్ను వసూళ్లపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో ఆ విభాగ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని మునిసిపాలిటీలు చతికిల పడుతున్నాయి. 92.75 శాతం పన్ను వసూలు సాధించి రాష్ట్రంలోనే  వినుకొండ పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలవగా నరసరావుపేట 107వ స్థానంలో నిలిచింది. గుంటూరు కార్పొరేషన్‌ సహా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో రూ.200.50 కోట్లు పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.92.75 కోట్లు పన్ను వసూలైనట్టు డీఎంఏ కార్యాలయ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పన్ను వసూలు శాతం 46.25గా నమోదైంది. నీటి పన్ను రూ.42.77 కోట్లు వసూలు లక్ష్యం కాగా ఇప్పటికి రూ.15.14 కోట్లు మాత్రమే వసూలైంది. తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట మునిసిపాల్టీలు నీటి పన్ను వసూలులో వెనకబడి ఉన్నాయి. ఈ మునిసిపాల్టీలలో నామమాత్రంగా కూడా నీటి పన్ను వసూలు చేయకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు పన్ను వసూళ్లపై సమీక్షిస్తున్నా మునిసిపాలిటీలలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడటం లేదు.


బిల్లులు, జీతాల చెల్లింపుల్లో జాప్యం

మున్సిపాలిటీల్లో ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లు పడకేశాయి. దీంతో అభివృద్ధి పనుల నిర్వహణ, కాంట్రాక్ట్‌ కార్మికుల, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది. సకాలంలో పన్ను వసూలు కాక పోవటం వల్ల కొన్ని పురపాలక సంఘాలలో ఈ పరిస్థితి నెలకొంది. సాధారణ నిధుల నుంచి చేపట్టే పనులు బిల్లులు చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతుంది. దీంతో ఆయా అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖాళీ స్థలాలు, ప్రకటనల పన్ను వసూళ్లలో కూడా నిర్లక్ష్యం తాండవిస్తోంది. పట్టణాలలో ఏర్పాటు చేస్తున్న ప్రకటనల బోర్డులకు, పన్ను వసూళ్లకు పొంతనే ఉండటం లేదు. తాత్కాలిక ఆక్రమణలు, ప్రకటనలకు సంబంధించిన పన్ను పక్క దారి పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక ఆక్రమణలు, ప్రకటనల పన్నుల రూపంలో ఏటా ఒక్కొక్క మునిసిపాలిటీ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోతున్నది. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రణాళికా విభాగం పర్యవేక్షణ లేక పోవటం వల్లే ఈ ఆదాయాన్ని మునిసిపాలిటీలు రాబట్టుకోలేకపోతున్నాయి. పన్ను వసూలు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా వారి మొర మునిసిపల్‌ అధికారులు ఆలకించే పరిస్థితి లేదు.  



Updated Date - 2021-10-18T05:20:45+05:30 IST