ఇంటింటికీ వ్యాక్సిన్‌ చెన్నైలో ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-07T13:12:53+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ వ్యాక్సిన్‌’ పథకం శనివారం రాజధాని నగరం చెన్నైలో ప్రారంభమైంది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక తేనాంపేట జోన్‌ నొచ్చికుప్పం వద్ద టీకాలు వేసే కార్యక్రమాలను

ఇంటింటికీ వ్యాక్సిన్‌ చెన్నైలో ప్రారంభం

చెన్నై(Tamilnadu): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ వ్యాక్సిన్‌’ పథకం శనివారం రాజధాని నగరం చెన్నైలో ప్రారంభమైంది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక తేనాంపేట జోన్‌ నొచ్చికుప్పం వద్ద టీకాలు వేసే కార్యక్రమాలను ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలో అధికారులు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 2వ తేదీన మధురాంతకం సమీపం సిత్తామూరుపాక్కం గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే కార్యక్రమాలను ప్రారంభించినట్టు తెలిపారు. విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ఆరోగ్య సిబ్బంది వాహనాలలో వెళ్ళి ఇళ్ల వద్దే ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. వందశాతం వ్యాక్సినేషన్‌ను సాధించటానికిగాను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశం మేరకు ఇళ్ళ వద్దకే వెళ్ళి అందరికీ టీకాలు వేస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీ్‌ప సింగ్‌ బేదీ నగరంలో సెకెండ్‌ డోసు టీకాలు వేసుకోవాల్సినవారు, ఫస్ట్‌డోసు వేసుకోనివారి జాబితాలను సిద్ధం చేశారు. ఆ జాబితాలను పరిశీలించి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇళ్లవద్దే టీకాలు వేయనున్నారని ఆయన వివరించారు. నొచ్చికుప్పంలో 771 మందికి ఫస్ట్‌డోసు టీకాలు, 557 మందికి సెకెండ్‌ డోసు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కూడా గట్టి మద్దతు ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-11-07T13:12:53+05:30 IST