52,050 ఇళ్లు మంజూరు

ABN , First Publish Date - 2020-12-04T05:48:05+05:30 IST

రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు బలహీన వర్గాలకు ఇళ్లు మంజూరుచేసింది.

52,050 ఇళ్లు మంజూరు

యూనిట్‌ విలువ రూ.1.8 లక్షలే!

గతంలో పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.2 లక్షలు

ప్రభుత్వ నిర్ణయంపై పేదల పెదవివిరుపు


విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు బలహీన వర్గాలకు ఇళ్లు మంజూరుచేసింది. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రమే కేటాయించడం, పైగా గతం కంటే యూనిట్‌ వ్యయం (ఇంటి నిర్మాణానికి ఇచ్చే నిధులు) తగ్గించడంపై దరఖాస్తుదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.


గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ), జిల్లాలోని రెండు (నర్సీపట్నం, ఎలమంచిలి) మునిసిపాలిటీలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (యూడీఏ) పరిధిలో గల మండలాలకు కలిపి ప్రభుత్వం 52,050 ఇళ్లు మంజూరుచేసింది. ఇందులో యూడీఏ పరిధిలో గల 15 మండలాలు...భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేటలకు 38,865, జీవీఎంసీ, రెండు మునిసిపాలిటీలకు 13,185 ఇళ్లు కేటాయించింది. యూడీఏ మండలాల్లో ఇంటి నిర్మాణానికి...కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, ఉపాధి హామీ పఽథకం నుంచి రూ.30 వేలు కలిపి రూ.1.8 లక్షలు, విశాఖ నగరంతో పాటు ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీల్లో కేంద్రం ఇచ్చే రూ.1.5 లక్షలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు ఇవ్వనున్నది. కాగా గ్రామీణ ప్రాంతంలో ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటికే అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. ఆ జాబితాల్లో వున్న పలువురు ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో పాక వేసుకుని నివాసం వుంటున్న మరికొందరికి ప్రభుత్వం ఎల్‌పీసీలు ఇవ్వనున్నది. వీరితోపాటు సొంత స్థలం వుండి ఇంటి నిర్మాణానికి సాయం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇస్తారు. ఇటువంటి వారంతా గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా గత ప్రభుత్వ హయాంలో అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ రూ.2.5 లక్షలు, యూడీఏ మండలాల్లో రూ.2 లక్షలు మంజూరుచేశారు. ప్రస్తుతం అందులో కోత విధించడంపై దరఖాస్తుదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడచిన రెండేళ్లలో మెటీరియల్‌ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇసుక దొరకడమే గగనమైంది. ఈ పరిస్థితుల్లో యూనిట్‌ ధర మరింత  పెంచుతారనుకుంటే తగ్గించడం విచిత్రంగా వున్నదని వాపోతున్నారు.

Updated Date - 2020-12-04T05:48:05+05:30 IST