ఏపీ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ!

ABN , First Publish Date - 2021-09-12T05:30:00+05:30 IST

ప్రభుత్వం కొత్త..

ఏపీ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ!

హౌసింగ్‌ ఎత్తుగడ

ఏజన్సీలు రుణాలు తీసుకోవాలంటూ ప్రభుత్వం సూచన

టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని దిశానిర్దేశం 

లబ్ధిదారుల రుణాలతో బిల్లుల మంజూరుకు కసరత్తు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లు పూర్తి చేయడానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు రుణాలపై ఆధారపడుతోంది. ఏజన్సీలకే ఆ బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ నిధులతో బిల్లులు చెల్లించలేమని పరోక్షంగా తేల్చేసింది. ఆ దిశగా ఏజన్సీలు కసరత్తు ప్రారంభించాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి.


తొలివిడతలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌లను ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 80 శాతం నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మిగిలిన వాటిని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నుంచి బిల్లులు రావాలని ఏజన్సీ ఆకాంక్షించింది. ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నిర్మాణ ఏజన్సీలు కూడా అదే ధోరణిలో ఉండిపోయాయి. పనులు దాదాపుగా నిలిపివేశాయి. కొద్దిమంది సిబ్బందితోనే నత్తనకడన నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. రెండో దశ టిడ్కో ఇళ్లను ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు, కొవ్వూరు, నిడదవోలులో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వం నుంచి బిల్లులు నిలిపివేయడంతో సంస్థ పూర్తిగా నిర్మాణాలను నిలిపి వేసింది. ఇప్పుడు పనులు చేయాలని ఆదేశాలు జారీచేసినప్పటికీ సదరు సంస్థ ససేమీరా అంటోంది.


జిల్లాలో బకాయిపడ్డ రూ.100 కోట్లను చెల్లిస్తేనే నిర్మాణం చేపడతామంటూ ఏజన్సీ స్పష్టం చేస్తోంది. ఈ తరుణంలో బ్యాంకు రుణాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలంటూ ప్రభుత్వం సంకేతాలు పంపింది. ఎల్‌ అండ్‌టీ సంస్థ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉంది. టిడ్కో ఇళ్లకు బ్యాంకులు ఎంతమేర రుణాలు ఇస్తాయనే దానిపై ఇప్పుడు టిడ్కో ప్రాజెక్ట్‌ల భవితవ్యం ఆధారపడి ఉంది. 


ఇళ్లు పూర్తయితేనే లబ్ధిదారులకు రుణాలు

మరోవైపు లబ్ధిదారులకు రుణాలు కల్పించేందుకు ఏపీ టిడ్కో శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇళ్లు పూర్తయితే వాటికే రుణాలు ఇస్తామంటూ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో మాదిరిగా రుణాలు ఇచ్చేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ముందుగా 75 శాతం రుణం మాత్రమే ఇవ్వనున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించిన తర్వాత మిగిలిన 25శాతం రుణాలు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇలా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు వచ్చే రుణాలను నిర్మాణ ఏజన్సీలకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇళ్లు పూర్తి కావాలంటే నిధులు అవసరం అవుతోంది. బకాయిలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏజన్సీలే రుణాలు తీసుకోవాలని ప్ర భుత్వం సూచనలు చేసింది. వడ్డీతో సహా చెల్లిం చేందుకు అంగీకారం తెలిపినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రుణాలపై ఆధారపడుతోంది. 


రంగు మార్పులేనట్టేనా ?

టిడ్కో ఇళ్లు రంగులు మార్చాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గాఢమైన నీలిరంగుతోపాటు, తెలుపు రంగు వేయాలని స్పష్టం చేసింది. అయితే ఆ రంగుల్లో ఆకర్షణీయత లోపించడమే కాకుండా ప్రభుత్వానికి భారమవుతోంది. లబ్ధిదారుల్లోనూ రంగుల మార్పిడిపై అసంతృప్తి ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసిన రంగులనే ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. 

Updated Date - 2021-09-12T05:30:00+05:30 IST