పక్కా ఇల్లు.. ప్రణాళికే లేదు!

ABN , First Publish Date - 2020-12-01T09:39:06+05:30 IST

పక్కా ఇళ్ల నిర్మాణ పథకంలో ప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తోంది. ప్రతి దాంట్లోనూ వైసీపీ ప్రభుత్వ ముద్ర కనిపించాలనే తాపత్రయంతో మొత్తం విధానాలను

పక్కా ఇల్లు.. ప్రణాళికే లేదు!

మేమే కట్టిస్తామంటున్న ప్రభుత్వం

ఇంటి నిర్మాణానికి ఇచ్చేది రూ.1.8 లక్షలే

ఆ మొత్తంతో నిర్మాణం పూర్తికాదంటున్న ఇంజనీర్లు

మిగతా భారం లబ్ధిదారులపైనే?

భారాన్ని మోస్తూ.. షరతులు పాటించాలా..!


అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పక్కా ఇళ్ల నిర్మాణ పథకంలో ప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తోంది. ప్రతి దాంట్లోనూ వైసీపీ ప్రభుత్వ ముద్ర కనిపించాలనే తాపత్రయంతో మొత్తం విధానాలను గందరగోళం చేస్తున్న ప్రభుత్వం.. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మొదటికొచ్చే సంస్కృతికి అలవాటుపడింది. పేదలకు ఇళ్ల నిర్మాణ పథకంలోనూ అదే తీరును అనుసరిస్తోంది. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఇంతవరకూ ఒక్క ఇల్లూ కట్టని వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు నిర్మాణాలు అంటూ హడావుడి మొదలుపెట్టింది. ఇందుకోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని కాదని కొత్త పాలసీ తీసుకొచ్చింది. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా రాయితీని ప్రభుత్వం మంజూరుచేస్తే లబ్ధిదారే ఇల్లు కట్టుకునే విధానమే అమల్లో ఉంది.


ప్రభుత్వం పలు విడతలుగా రాయితీని విడుదల చేస్తే, దానికి అదనంగా కొంత వేసుకుని లబ్ధిదారులు తమకు నచ్చినట్లుగా ఇళ్లు కట్టుకునేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమదేనని ఘనంగా ప్రకటించింది. పూర్తిగా ఇల్లు కట్టించి ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని అధికార యంత్రాంగం మొత్తుకున్నా ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలోనూ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని చెప్పింది. కానీ హౌసింగ్‌ పాలసీ మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పట్టణాల్లో ప్రారంభించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. అందులో 272 అడుగుల్లో ఇల్లు ఉంటే, 62 అడుగుల వరండా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.1.8 లక్షల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన సామాగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తుంది. ఒక్కో ఇంటికి 90 సిమెంట్‌ బస్తాలు, 480 కిలోల స్టీలు, 1500 సిమెంటు రాళ్లు సరఫరా చేస్తుంది.


ఇసుకను ఉచితంగానే సరఫరా చేసినా.. రవాణా ఖర్చును లబ్ధిదారులే భరించాలి. ఇంటికి ప్లాస్టింగ్‌ చేయించడం, విద్యుత్‌ ఏర్పాటు కూడా ఇందులోనే ఖర్చు చేస్తారు. లబ్ధిదారులు మేస్ర్తీలు, కూలీలతో మాట్లాడుకుని ఇల్లు నిర్మించుకోవాలి. అందుకయ్యే ఖర్చును పూర్తిగా లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కలిపి రూ.1.8 లక్షలతో ఎలా అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత ధరల ప్రకారం ఎంత చిన్న ఇల్లు కట్టినా కనీసం నాలుగు లక్షల వరకు అవుతోంది. మెటీరియల్‌తో సమానంగా కట్టుబడి కూలీ అవుతోంది. అవన్నీ లబ్ధిదారుల నెత్తిన వేసి ఇల్లు మొత్తం మేమే కట్టిస్తాం అనడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకావడం లేదు. పైగా ప్రభుత్వం ఇచ్చే మెటీరియల్‌ సరిపోకపోతే లబ్ధిదారులు ఏంచేయాలనే దానిపైనా స్పష్టత లేదు. ఇళ్ల నిర్మాణాలన్నీ లేఅవుట్లలో కావడంతో అన్నీ ఒకేవిధంగా ఉండాలనే షరతు పెడుతున్నారు. అలాకాకుండా లబ్ధిదారు అభీష్టం మేరకు కట్టుకునే స్వేచ్చనిస్తే ఎలాగోలా నిధులు సమీకరించుకుని నచ్చినవిధంగా కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం దానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు.


ప్రభుత్వ సొమ్ముతో పూర్తిచేయడం కష్టమే

ప్రభుత్వం నిర్ణయించిన ధరతో ఇంటి నిర్మాణం పూర్తిచేయడం అసాధ్యమని హౌసింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగం అభిప్రాయపడుతోంది. రూ.1.8 లక్షల్లో చాలావరకు మెటీరియల్‌ ఖర్చులకే సరిపోతుంది. అప్పుడు లబ్ధిదారుడు కట్టుబడి కూలీని పూర్తిగా భరించాల్సి ఉం టుంది. పైగా గోడలకు ప్లాస్టింగ్‌, విద్యుత్‌ కనెక్షన్‌ ఖర్చు లు చాలా అవుతాయి. వీటన్నిటినీ రూ.1.8 లక్షలు దాటకుండా చూడాల్సిన బాధ్యత గృహ నిర్మాణ శాఖపై ఉం టుంది. ఈ విధానం వల్ల నానా పాట్లు పడి నిర్దేశించిన యూనిట్‌ కాస్ట్‌లోనే ఇల్లు కట్టినా లబ్ధిదారులు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఆ రాయితీ ఏదో లబ్ధిదారులకే ఇచ్చేసి, నిర్మాణాల పర్యవేక్షణ వరకే పరిమితం అయితే ప్రభుత్వానికి తలనొప్పులు ఉండవని, లబ్ధిదారుడు కూడా నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుంటాడని అంటున్నాయి.


గృహ ప్రవేశాల కార్యక్రమం భగ్నం

దాసన్నపేట, నవంబరు 30: హుద్‌హుద్‌ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలో నిర్వహించిన గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల వద్దకు ర్యాలీగా వెళ్తున్న మహిళలను పోలీసులు తోసేయడంతో కొంతమంది కింద పడిపోయారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. జనవరి 10 నాటికి ఇళ్లు అందిస్తామని గృహ నిర్మాణ పీడీ లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2020-12-01T09:39:06+05:30 IST