గృహ నిర్మాణ రంగంలో ఐటీసీకి ఎవరు అర్హులు

ABN , First Publish Date - 2020-03-22T06:10:46+05:30 IST

గృహ నిర్మాణ రంగానికి సంబంధించి గత ఏప్రిల్‌ 1 నుంచి వస్తు సేవల పన్నులో చోటు చేసుకున్న మార్పుల గురించి సవివరంగా తెలుసుకున్నాం. అయితే, కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టి దాదాపు...

గృహ నిర్మాణ రంగంలో ఐటీసీకి ఎవరు అర్హులు

గృహ నిర్మాణ రంగానికి సంబంధించి గత ఏప్రిల్‌ 1 నుంచి వస్తు సేవల పన్నులో చోటు చేసుకున్న మార్పుల గురించి సవివరంగా తెలుసుకున్నాం. అయితే, కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టి దాదాపు సంవత్సరం అవుతున్నందున పాత, కొత్త పన్ను విధానంలో ఉన్న బిల్డర్లు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. 


తొలుత 2019 ఏప్రిల్‌ 1 తర్వాత కూడా పాత పన్ను విధానంలో అంటే 12 శాతం పన్ను విధానంలో కొనసాగే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సదరు వ్యక్తులు 2019 మే 20 వ తేదీ లోపు సంబంధిత అధికారులకు పాత స్కీమ్‌లోనే కొనసాగుతున్నట్లు ఒక డిక్లరేషన్‌ ఇచ్చి ఉండాలి. ఈ విధమైన డిక్లరేషన్‌ ఇచ్చిన వారు మాత్రమే పాత స్కీమ్‌లో కొనసాగటానికి అంటే కొనుగోలుదారుల నుంచి 12 శాతం చొప్పున జీఎ స్‌టీ వసూలు చేయటానికి, ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకోవటానికి అర్హులు. అయితే, నిర్మాణం పూర్తయిందని తెలిపే ద్రువీకరణ పత్రం సంబంధిత మునిసిపల్‌ అధికారుల నుంచి వచ్చిన తర్వాత మాత్రం అప్పటికి అమ్మకం కాకుండా మిగిలి ఉన్న ఫ్లాట్లకు సంబంధించి క్రెడిట్‌ను దామాషా పద్ధతిలో రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి నిర్మాణం ప్రారంభం నుంచి ద్రువీకరణ పత్రం పొందేవరకు తీసుకున్న మొత్తం క్రెడిట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 


అలాగే 2019 ఏప్రిల్‌ 1 ముందు నుంచి నిర్మాణంలో ఉండి తర్వాత కొత్త స్కీమ్‌లోకి వచ్చిన వారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటంటే.. వీరు కొత్త స్కీమ్‌లో ఉన్నందున 5 శాతం పన్ను చెల్లించవచ్చు (అందుబాటు గృహాలు అయితే 1 శాతం). అయితే, వీరికి ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకునే సౌలభ్యం లేదు. అలాగే 2019 ఏప్రిల్‌ 1 కంటే ముందు తీసుకున్న క్రెడిట్‌ను నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం నిర్మాణానికి సంబంధించిన మొత్తం ఏరియా, అప్పటి వరకు జరిగిన నిర్మాణం, జరిగిన అమ్మకాలు, చెల్లించిన పన్ను, తీసుకున్న క్రెడిట్‌ ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్‌ను రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ 2019 అక్టోబరు 20. ఇప్పటికీ ఈ విధమైన రివర్స్‌ చేయకుండా ఉన్నవారు వెంటనే రివర్స్‌ చేయటం ఉత్తమం. 


ఇంకా ఈ కొత్త స్కీమ్‌లో ఉన్నవారు కనీసం 80 శాతం ఇన్‌పుట్స్‌ లేదా ఇన్‌పుట్‌ సర్వీ్‌సలను కచ్చితంగా జీఎ్‌సటీ కింద రిజిస్ట్రేషన్‌ పొందిన వారి నుంచి కొనుగోలు చేయాలి. అలా చేయని పక్షంలో 80 శాతానికి తక్కువైన మొత్తం మీద 18 శాతం చొప్పున బిల్డర్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని అంటే 2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు చేపట్టిన కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సంవత్సరం మధ్యలో నిర్మాణం పూర్తయితే అప్పటివరకు జరిపిన కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే 80 శాతంతో సంబంధం లేకుండా సిమెంట్‌ను మాత్రం కచ్చితంగా జీఎ్‌సటీ కింద రిజిస్ట్రేషన్‌ పొందిన వారి నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఒకవేళ ఏదేనీ నెలలో సిమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ లేని వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తే ఆ మొత్తం మీద 28 శాతం చొప్పున అదే నెలలో పన్ను  చెల్లించాలి.  దీనికి బిల్డరే బాధ్యుడు. 


అలాగే ఒక బిల్డర్‌కు ఒకటికి మించి ప్రాజెక్టులు ఉంటే ఆ వివరాలను ప్రాజెక్ట్‌ వారీగా విడివిడిగా చూసుకోవాలి. 


గమనిక : ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి. 

Updated Date - 2020-03-22T06:10:46+05:30 IST