వలస కార్మికుల శ్రేయస్సు ఎలా?

ABN , First Publish Date - 2020-06-23T06:53:06+05:30 IST

ఎక్కడెక్కడి వలస కార్మికులూ తమ స్వస్థలాలకు, అదీ కాలినడకన వెళ్ళడాన్ని ఇటీవల మనం చూశాం. కన్న ఊరు మీద మమతతో ‘మా వూరు వొకసారి పోయి రావాలి’ అన్న ఉత్సాహంతో వారేమీ అలా వెళ్ళలేదు...

వలస కార్మికుల శ్రేయస్సు ఎలా?

తిరిగివచ్చిన వలస కార్మికులను స్వరాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగం చేయడానికి బదులు వారిని ఆతిథేయి రాష్ట్రాలకు పంపించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో లాక్‌డౌన్ విధించడం అనివార్యమయితే వలసకార్మికుల రోజువారీ జీవన వ్యయాలను కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. తద్వారా వలసకార్మికులకు ఒక భరోసా కల్పించాలి.


ఎక్కడెక్కడి వలస కార్మికులూ తమ స్వస్థలాలకు, అదీ కాలినడకన వెళ్ళడాన్ని ఇటీవల మనం చూశాం. కన్న ఊరు మీద మమతతో ‘మా వూరు వొకసారి పోయి రావాలి’ అన్న ఉత్సాహంతో వారేమీ అలా వెళ్ళలేదు. కరోనా బాధల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు గనుక, ఆ బాధలేవో ఆత్మీయుల మధ్యనే పడదామనే ఉద్దేశంతోనే లక్షలాది అభాగ్యులు ఒక్కసారిగా బాటసారులై పోయారు. మరి సొంత ఊరిలో బతుకు తెరువు ఎలా? స్వరాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలలో వారిని ఏ విధంగానైనా అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలు చేయాలని ముంబైలోని ‘అంతర్జాతీయ జనాభా అధ్యయనాల సంస్థ’ సూచించింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారం సమకూర్చాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించాలని, ఆతిథేయి రాష్ట్రాలతో సరిసమానంగా విద్యా వసతులు, వైద్య సేవలు అందించాలని ఆ సంస్థ సిఫారసు చేసింది.


ఇది సరైన విధానమేనా? ప్రతికూల ఫలితాలకు మాత్రమే అది దారితీస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. కార్మికుల కొరత కారణంగా ఆతిథేయి రాష్ట్రాలలోని పరిశ్రమలు రోబోలను ఉపయోగించుకుంటాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దీనివల్ల కార్మికులకే కాదు దేశ ప్రజల సంక్షేమానికే హాని జరుగుతుంది. అంతేకాదు, తిరిగి వెళ్ళిన వలస కార్మికుల నైపుణ్యాలు– స్వరాష్ట్రాలలోని ఆర్థిక కార్యకలాపాల అవసరాల మధ్య –పొంతన కొరవడే అవకాశమున్నది. ముంబైలో మర మగ్గాలకు మరమ్మత్తులు చేసే కార్మికుడు సొంత జిల్లా దర్భంగాలో ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు చేస్తాడా? చేయడానికి ఇష్టపడతాడా? అతని నైపుణ్యాలు వ్యర్థమవుతాయి. అతన్ని అలా స్వరాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం చేయడమనేది తిరోగామి చర్య.


సరే, జనకోటిని పోషించే వ్యవసాయరంగం ఉన్నది కదా అనుకుందాం. తిరిగివచ్చిన వలస కార్మికులకు సేద్యరంగంలో ఉపాధి కల్పించడమనేది సుసాధ్యమయ్యే విషయం కాదు. అందుకు చాలా పరిమితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి పెరుగుదలతో వ్యవసాయరంగంలో ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడమనేది ఒక సాధారణ పరిణామంగా ఉన్నది. అమెరికా, బ్రిటన్, జర్మనీ మొదలైన పారిశ్రామిక దేశాలలోని మొత్తం శ్రామికులలో కేవలం ఒక శాతం మాత్రమే వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన వేళ మన దేశ జనాభాలో 80 శాతం పైగా వ్యవసాయరంగంపైనే ఆధారపడివున్నారు. ఇప్పుడు దానిపై ఆధారపడివున్న వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ వాస్తవాల దృష్ట్యా స్వరాష్ట్రాలకు తిరిగివచ్చిన వలసకార్మికులకు వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పించడమనేది ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యం కాదు.


అయితే, ఎలాంటి కష్టతరమైన విషయానికైనా ఒక మినహాయింపు ఉంటుంది. మనమూ నెదర్లాండ్స్ తులిప్ పూలు, ఇటలీ ఆలివ్ పండ్లూ, ఫ్రాన్స్ ద్రాక్షలూ, ఫ్లారిడా నారింజలూ, వాషింగ్టన్ అక్రోట్లూ, కేరళ మిరియాలూ, కర్ణాటక కాఫీ గింజలూ మొదలైన పంటలను బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో సాగు చేయగలిగితే తిరిగివచ్చిన వలసకార్మికులకు వ్యవసాయరంగంలో ఉపాధి కల్పించడం సాధ్యమవుతుంది. అయితే, ముందుగా చాలా పరిశోధనలు జరగవలసివున్నది. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేము. ఏమైనా ఇది చాలా వ్యవధి తీసుకునే ప్రక్రియ. సమస్యను తక్షణమే కాదు కదా సమీప భవిష్యత్తులో కూడా పరిష్కరించడం సాధ్యంకాదు.


తిరిగివచ్చిన వలస కార్మికులను స్వరాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగం చేసుకునే ప్రయత్నాలు మరో ప్రతికూల ప్రభావానికి దారితీస్తాయి. వారికి ఆహారం, ఉపాధి, విద్యావైద్య వసతులు సమకూర్చడం వల్ల స్వరాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఆర్థిక భారాన్ని మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అదనపు భారం వల్ల మూల ధన వ్యయాలను తగ్గించుకోవలసిరావడం అనివార్యమవుతుంది. గ్రామీణ రోడ్ల నిర్మాణం మొదలైన మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల వృద్ధిరేట్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని తిరిగివచ్చిన వలసకార్మికులను తక్షణమే ఆతిథేయి రాష్ట్రాలకు పంపించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. కార్మికుల కొరత కారణంగా ఆతిథేయి రాష్ట్రాలలో పరిశ్రమల అభివృద్ధికి తీవ్ర ఆటంకాలు ఏర్పడతాయి. ఆ పరిశ్రమలు రోబోలను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే కార్మికులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పటికే కాలహరణం జరిగింది. నష్టం మరింత తీవ్రం కాకముందే నివారణ చర్యలు చేపట్టాలి.


ప్రభుత్వం తక్షణమే మూడు చర్యలు చేపట్టాలి. ఒకటి- భవిష్యత్తులో లాక్‌డౌన్ విధించడం అనివార్యమయితే వలసకార్మికుల రోజువారీ జీవన వ్యయాలను కేంద్ర ప్రభుత్వమే భరించితీరేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. దీనివల్ల వలసకార్మికులకు భరోసా సమకూరుతుంది. ప్రభుత్వ సహాయాన్ని ఇలా పొందేందుకు వారు తమ పేర్లను నమోదు చేయించుకోవలసివుంటుంది. ఈ ప్రక్రియను యాజమాన్యాల, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలకు, చపలచిత్త నిర్ణయాలకు వదిలివేయకూడదు. అలా చేయడమంటే నిర్భాగ్య కార్మికుల శ్రేయస్సును విస్మరించడమే అవుగలదు.


రెండు- వలస కార్మికుల స్వరాష్ట్రాల ప్రభుత్వాలు ఆత్మశోధన చేసుకోవాలి. తమ పారిశ్రామిక వేత్తలు, కార్మికులు స్వరాష్ట్రాలలో కలసికట్టుగా పనిచేయకుండా గుజరాత్ మొదలైన ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసపోతున్నారో నిష్పాక్షికంగా ఆలోచించుకోవాలి. వ్యాపారవేత్తలను వేధించడానికి బదులు వారిని గౌరవించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్పి తీరాలి. మా పూర్వీకులు రాజస్థాన్‌లోని లుహారు ప్రాంతంలో నివసించేవారు. మల్ సిసార్ సంస్థాన మహారాజు ఒకసారి మా పూర్వీకుల గ్రామాన్ని సందర్శించి వారిని తన సంస్థానానికి ఆహ్వానించాడు. వారి వ్యాపారాలకు పలు వసతులు కల్పించాడు. మా పూర్వీకులు విత్తనాలు అమ్మి, రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారు. తద్వారా గ్రామ సంపత్తికి, సంస్థాన ఆర్థికాభివృద్ధికి విశేషంగా దోహదం చేశారు. ఇటువంటి గౌరవాదరాలనే తమ వ్యాపారవేత్తలకు ఇవ్వవలసిన నైతిక కర్తవ్యాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిర్వర్తించవలసివున్నది. ఇందుకు వారు వ్యాపారవేత్తల సంఘాల సహాయసహకారాలను తీసుకోవాలి. అవినీతిపరులైన రాజకీయవేత్తలు, అధికారులను గుర్తించి వారిపై కఠినచర్యలు చేపట్టాలి. అటువంటి వారిపై చర్య తీసుకున్నప్పుడే వ్యాపారవర్గాలలో వ్యాపార సౌలభ్యంపై భరోసా ఏర్పడుతుంది.


మూడో చర్య- దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోను ఏ పంట సాగుకు ఎక్కువ సానుకూల పరిస్థితులు ఉన్నాయో గుర్తించి, అక్కడ ఆ పంటసాగును ప్రోత్సహించేందుకుగాను ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. దీనివల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, వలసకార్మికులకూ మేలు జరుగుతుంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-06-23T06:53:06+05:30 IST