చదువులు సాగేదెలా?

ABN , First Publish Date - 2022-08-29T04:22:03+05:30 IST

ఇంటర్‌ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం జూన్‌ 15నుంచి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తరగతులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేక బోధన ముందుకు సాగడం లేదు.

చదువులు సాగేదెలా?
బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- భర్తీకాని అతిథి అధ్యాపకుల పోస్టులు

- ఇబ్బందుల్లో విద్యార్థులు

బెజ్జూరు, ఆగస్టు 28: ఇంటర్‌ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం జూన్‌ 15నుంచి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తరగతులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేక బోధన ముందుకు సాగడం లేదు. చాలాచోట్ల రెగ్యులర్‌ అధ్యాపకులు లేరు. ఒప్పంద అధ్యాపకులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఇంకా మిగిలి ఉన్న ఖాళీల్లో అతిథి అధ్యాపకులను నియమించాల్సి ఉంది. ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడంతో చదువులపై  ప్రభావం చూపనుంది. గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి నియమించకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇంటర్‌ విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం అతిథి అధ్యాపకుల నియామకంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. దూరప్రాంతాలకు వెళ్లలేని, ఆర్థిక స్థోమతలేని చాలామంది విద్యార్థులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. విద్యార్థుల చదువులు ముందుకు సాగక వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బోధన లేక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

సిలబస్‌పై తీవ్ర ప్రభావం

జిల్లాలో 11ప్రభుత్వ కళాశాలలుండగా, ఇందులో 120మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఐదుగురు మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. 11కళాశాలలకు 11మంది రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మరో 39మంది అతిథి అధ్యాపకులు అవసరమున్నా ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు విడుదల చేయలేదు. యేటా అతిథి అధ్యాపకులు ఐదారు నెలల కంటే ఎక్కువ బోధన చేయడం లేదు. ఇంటర్‌మీడియట్‌ బోర్డు అతిథి అధ్యాపకులను తిరిగి తీసుకోవడంలో జాప్యం చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకుంటోంది. విద్యా సంవత్సరం జూన్‌ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం జూన్‌, జులై మాసాలు పూర్తి కాగా ఆగస్టు కూడా పూర్తి కానుంది. అతిథి అధ్యాపకులకు పనిని బట్టి(పీరియడ్స్‌ లెక్కన)వేతనం చెల్లిస్తారు. ఇందులో నాలుగు తరగతులు బోధించాలి. ఒక్కో పీరియడ్‌కు రూ.300చొప్పున నెలకు 72పీరియడ్లు బోధిస్తే నెలకు సరాసరి రూ.21600వేతనం పొందుతారు. కళాశాల నడిచిన రోజు మాత్రమే వేతనం ఇస్తారు. సెలవు రోజులకు సంబంధించిన వేతనం ఉండదు. కళాశాలలో అతిథి అధ్యాపకులు లేనందున ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులను బోధించే వారు లేక సిలబస్‌పై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది. ప్రతియేటా ఆలస్యంగా నియామకాలు చేపట్టడంతో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహన లేకుండా పోతోంది. సిలబస్‌ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతేడాది కళాశాలల్లో పనిచేసిన అతిథి అధ్యాపకులకు రెండునెలల వేతనం కూడా విడుదల కాలేదు. ఈసారి ఇప్పటివరకు అతిథి అధ్యాపకుల నియామకంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల చదువులపై ప్రభావం ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కళాశాలల్లో నియామకాలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

మార్గదర్శకాలు విడుదల కాలేదు

- శ్రీధర్‌సుమన్‌, జిల్లా మాధ్యమిక విద్యాధికారి 

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. అతిథి అధ్యాపకుల నియామకంపై ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. ఉత్తర్వులు రాగానే నియామకం చేపడుతాం.

Updated Date - 2022-08-29T04:22:03+05:30 IST