Abn logo
Jun 17 2021 @ 04:02AM

బీసీ రిజర్వేషన్లు పెరిగేదిలా..!

ఇటీవల తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా 17 మంది బీసీలు మంత్రులయ్యారని దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలవారు సంతోషించారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలు కోసం జరిగిన పోరాటాల వల్ల ప్రతి పదేళ్లకోసారి బీసీల స్థితిగతుల గురించి అధ్యయనం జరగాలని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించాయి. సామాజిక అభివృద్ధిలో బీసీలు ఎలా ఉన్నారు? వారి అభ్యున్నతికి ఏమేం చేయాలి అనేవి సూచించడం, కొత్త కులాలను చేర్చడం, ఎదిగిన కులాలను తొలగించడం, రిజర్వేషన్లు పెంచడం, అన్ని రంగాల్లో దామాషా ప్రాతినిధ్యం కల్పించడం మొదలైన వాటిని నిర్వర్తించేందుకు బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.


తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు ఆదర్శంగా ఆ రాష్ట్రంలో కంటే మరింత అధికంగా బీసీ రిజర్వేషన్లను అమలుపరిచేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అనేకసార్లు ప్రకటించారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయో అధ్యయనం చేసేందుకు సంబంధిత నివేదికలను, ప్రభుత్వ ఉత్తర్వులను కేసీఆర్ తెప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక వర్గాల జనాభా నిష్పత్తిని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే చేయడం ద్వారా అనేక విషయాలు తెలిసాయి. తెలంగాణలో 89 శాతం జనాభా రిజర్వేషన్ పరిధిలోనికి వచ్చే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు అని తేలింది. తెలంగాణలో బీసీలు 52శాతం, ఎస్టీలు 10శాతం, ఎస్సీలు 16శాతం, ముస్లింలు 12శాతం ఉన్నారని స్పష్టమైంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుసార్లు నొక్కి చెప్పారు. అందువల్ల తమిళనాడులో కంటే అధికంగా రిజర్వేషన్లను పెంచాలనే నిర్ణయానికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. 


అనుభవం లేక, అధికారుల పొరపాటు వల్ల బీసీ కమిషన్ ఏర్పాటు చేయకముందే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేయించింది. ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే వివరాలు రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉపయోగపడవని న్యాయస్థానం అభిప్రాయపడింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని పేరిట సర్వే జరిగిఉంటే అది శాస్త్రీయ అధ్యయనంగా పరిగణనలోకి వచ్చేది, న్యాయస్థానాలలోనిలిచేది. సమగ్ర కుటుంబ సర్వే ముగిసిన తరువాత 2016 అక్టోబర్ 23న బిఎస్ రాములు చైర్మన్‌గా తెలంగాణలో తొలి బీసీ కమిషన్ ఏర్పాటైంది. బీసీల సామాజిక, విద్య ఉద్యోగ, ఆర్థిక స్థితిగతులపై కుటుంబాల వారీగా అధ్యయనం చేసి, ఆయా సామాజిక వర్గాల వెనుకబాటుతనం గురించి తులనాత్మకంగా పరీక్షించి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 


2011 సెప్టెంబరు నుంచి 2016 అక్టోబరు దాక బీసీ కమిషన్‌కు చైర్మన్, సభ్యులు లేకుండా పోయారు. అందులో ఉండాల్సిన సిబ్బందిని వేరే విభాగాలకు పంపారు. అలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్ కొత్త చైర్మన్, సభ్యులు తమ విధి నిర్వహణను ప్రారంభించారు. అప్పటికే సుధీర్ కమిషన్ ముస్లిం రిజర్వేషన్లను పెంచాలని సిఫారసు చేసింది. ఆ రిజర్వేషన్లు బీసీ కమిషన్ పరిధిలోనివి గనుక అందుకు సంబంధించిన ప్రక్రియను ముందు పూర్తి చేయాలని కోరారు. సుధీర్ కమిషన్ నివేదికను మార్గదర్శకంగా తీసుకుని బీసీ కమిషన్ స్వయంగా క్షేత్ర పర్యటన చేసి ప్రజాభిప్రాయ సేకరణ గావించింది. అనంతరం పలు సిఫారసులతో కూడిన నివేదికను 2017 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రికి అందజేసింది. ఆ వెంటనే దానిని మంత్రివర్గం, చట్టసభలు ఆమోదించడం, కేంద్రానికి పంపడం జరిగింది. 


బీసీల జీవన స్థితిగతుల అధ్యయనానికి బీసీ కమిషన్ పూనుకున్నది. బీసీ రిజర్వేషన్ల పూర్వాపరాలను కూలంకషంగా అధ్యయనం చేయడంలో భాగంగా తమిళనాడు రిజర్వేషన్ల పరిణామాన్ని పరిశీలించింది. తమిళనాడులో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్లను న్యాయ స్థానాలలో సవాలు చేయడం జరిగింది. అయితే వాటిని పరిరక్షించడానికి శాస్త్రీయ ప్రాతిపదికలను సమకూరుస్తూ 2011లో జస్టిస్ ఎంఎస్ జనార్దనం కమిషన్  నివేదిక సమర్పించింది. దానిని బీసీ కమిషన్ తెలుగు చేసి  ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. జస్టిస్ జనార్దనం కమిషన్ నివేదిక చరిత్రాత్మకమైనది. అందులో దక్షిణ భారత చరిత్ర పరిణామాల ప్రత్యేకతను వివరించారు. రిజర్వేషన్ల పుట్టు పూర్వోత్త్రరాలును వెలికితీశారు. జనాభా, సామాజిక వర్గాలను వింగడించారు. తమిళనాడులో 1982 డిసెంబర్‌లో ఏర్పాటయిన ఆంబాశంకర్ కమిషన్ బీసీలపై 1985 ఫిబ్రవరిలో తన సమగ్ర నివేదిక అందించింది. రాష్ట్రంలో ఉన్న బీసీలు 67శాతం అని ఆ నివేదిక తేల్చి చెప్పింది. 1990 జూన్‌లో గిరిజనులకు 2శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. దాంతో 1990 నుంచి తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 69శాతం అయ్యాయి. న్యాయస్థానాలలో వీటిని పరి రక్షించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వాలు నిరంతర జాగరూకతతో పనిచేస్తున్నాయి. న్యాయస్థానాల జోక్యాన్ని నివారించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 1994లో చట్టం చేసి పార్లమెంటు ఆమోదం సాధించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చింది.


ప్రభుత్వం చేసిన చట్టాన్ని పరిరక్షించుకోవడానికి మరిన్ని మద్దతు ప్రాతిపదికలు సమకూర్చడం జస్టిస్ ఎమ్‌ఎస్ జనార్దనం కమిషన్ కర్తవ్యమయింది. ఆయన నివేదిక దేశానికి కొత్తచూపు నందించింది. రిజర్వేషన్ల పెంచాలనకునే వారికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. ఆ నివేదిక నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణలో 89 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే గనుక తమిళనాడులో కంటే ఎక్కువ రిజర్వేషన్లు అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ఆ ప్రక్రియను వేగవంతం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా న్యాయస్థానాల జోక్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. రాజకీయ సంకల్పబలంతోనే ఇది సాధ్యం. కేసీఆర్ పూనికతో, పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో (కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ సాధించుకున్నట్టు) ఆ రిజర్వేషన్లను సాధించుకోవాలి. అందుకుగాను తెలంగాణ ఉద్యమం రీతిలో బీసీలు ఉద్యమించాలి.  


బీసీ కమిషన్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, యూనివర్సిటీ అధికారులు, నిపుణులను ఆహ్వానించి అధ్యయనాలు నిర్వహించింది. పరిశోధనా శాఖల అనుభవాలను, సూచనలను తీసుకుంది. సెమినార్లు నిర్వహించింది. క్షేత్ర పర్యటన, తాజా డేటా సేకరణ, సమస్త జనుల స్థితిగతుల అధ్యయనంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం నివేదిక రూపకల్పనకు అవసరం. తమిళనాడులో అంబాశంకర్ కమిషన్, కర్ణాటకలో కాంతరాజ కమిషన్ వలె తెలంగాణలో అధ్యయనం సాగవలసి ఉన్నది. లేదా జనాభా గణనలో భాగంగా చేర్చి సేకరిస్తే దేశమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు, వారి సమగ్ర అభివృద్ధికి నిర్దిష్టంగా సమగ్రంగా అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి వీలుగా కుటుంబ సర్వే కోసం అవసరమైన బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ బీసీ కమిషన్ కోరింది. ప్రభుత్వం ఇంకా దానిని కేటాయించలేదు. ఈ విషయమై బీసీల నుంచి ఒత్తిడి లేకపోవడం విచార కరం. ఈ లోపు ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బీసీల జాబితా చేర్చని కులాలను అందులో చేర్చాలని మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. వారు ఆయా కులాలకు ఆశ్రితకులాలుగా కడు పేదరికంలో గడుపుతున్నారు. వీరందరిని క్షేత్ర పర్యటనతో స్వయంగా పరిశీలించి 14 కులాలను బీసీఏలో, 3 కులాలను బీసీడీలో చేర్చడానికి కమిషన్‌ నివేదిక అందజేయడంతో ప్రభుత్వం తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది కొరత, బడ్జెట్లు కేటాయించకపోవడం మొదలైన పరిమితులలో కూడ తెలంగాణ తొలి బీసీ కమిషన్ ఇతర రాష్ట్రాల బీసీ కమిషన్ నివేదికలను అనువాదం చేసి ప్రచురించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.   బీసీలలో చైతన్యం పెరిగి సంఘటితమైతేనే తమిళనాడులో వలె వారు అన్ని రంగాలలో ఎదుగుతారు. కాని వర్తమానం నిరాశాజనకంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మెడికల్ సీట్లలో స్లైడింగులోని లోపాల వల్ల బీసీలు ఏటా వందలాది సీట్లు కోల్పోతున్నారు. బీసీ కమిషన్ దీనిపై దృష్టి సారించి కాళోజీ మెడికల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌లను పిలిపించింది. వారు ఏవేవో సాకు చెప్పారు. అయితే అన్యాయం జరిగినవారు ఫోన్ చేయడం, మెసేజ్‌లు పెట్టడం తప్ప ఏ ఒక్కరూ నిర్దిష్టంగా దరఖాస్తు రాసి స్వయంగా వచ్చి ఇవ్వలేక పోయారు. ఎవరో పోరాడితే తాము అందిపుచ్చుకోవాలి అనే దృష్టి బీసీలలో హెచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజలు ముందుకు రాకుండా ఎవరూ ఏ పనీ చేయలేరని అందరూ గుర్తెరగాలి. బీసీ కమిషన్ పని మధ్యలో ఆగిపోయింది. తొలి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తయి 20 నెలలు గడిచాయి. వెంటనే కొత్త కమిషన్‌ను నియమించాలని ఒత్తిడి చేసే స్థాయిలో బీసీ శక్తులు లేకపోవడం విచారకరం. ఇక తమిళనాడులో వలె వారిని మించి 75–80శాతం రిజర్వేషన్లు సాధించుకోవడం అనేది ఎలా సాధ్యం? 102, 103 రాజ్యాంగ సవరణలతో బీసీ కమిషన్‌లకు పూర్తిస్థాయి అధికారాలు సంక్రమించాయి. రిజర్వేషన్ల పెంపుదలకైనా, ఉన్న వాటిని సక్రమంగా అమలు చేయడానికైనా, విద్య ఉద్యోగ రంగాలలో అవకతవకలను సరిచేయడానికైనా, ఉపాధి, ఆర్థిక ప్రణాళికలు చేపట్టడానికైనా సిఫారసులు చేయడానికైనా బీసీ కమిషన్ అవసరం మునుపటి కన్నా ఎన్నో రెట్లు పెరిగింది.

బిఎస్ రాములు

బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌