Abn logo
Sep 29 2021 @ 11:26AM

Warning: అరేబియా సముద్రంలో షహీన్ తుపాన్ ముప్పు

అహ్మదాబాద్ : గులాబ్ తుపాన్ అనంతరం అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరించింది.బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాన్ బలహీన పడిన అనంతరం అరేబియా సముద్రంలో మరో తుపాన్ ఏర్పడవచ్చని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.రానున్న నాలుగైదు రోజుల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. గులాబ్ తుపాన్ అవశేషాల వల్ల రాబోయే రెండు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. 

నవ్ సారి, వల్సాద్ లతోపాటు పొరుగు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అహ్మదాబాద్ నగరంలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మనోరమ మొహంతి చెప్పారు. సౌరాష్ట్ర, రాజ్ కోట్, నవ్ సారీ, వల్సాద్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. గుజరాత్ లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. గులాబ్ తుపాన్ వల్ల తెలంగాణలోనూ భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. 

ఈశాన్య అరేబియా సముద్రంలో మరో తుపాన్ ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ అరేబియా సముద్రంలోకి వెళ్లి తీవ్రతరం కావడాన్ని గతంలో చూశామని అధికారులు చెప్పారు. 2018 నవంబరులో బంగాళాఖాతంలో సంభవించిన గజ తుపాన్ తమిళనాడు తీరం వైపు కదిలి మధ్య కేరళ తీరంలో ఉద్భవించింది. 


ఇవి కూడా చదవండిImage Caption