Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇసుక లేకుంటే అభివృద్ధి పనులు ఎలా?

 గొలుగొండ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు వ్యాఖ్య

 ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పేరిట గ్రామాల్లోకి  వెళితే నిలదీస్తున్నారు : కొత్తమల్లంపేట సర్పంచ్‌  

  గత ప్రభుత్వంలో పింఛన్లు పొందిన వారిలో పలువురికి నిలిపి వేయడంపై ప్రశ్నిస్తున్నారు : నాగాపురం సర్పంచ్‌

గొలుగొండ, డిసెంబరు 2 : ఇసుక లేకుంటే అభివృద్ధి పనులు ఎలా సాధ్యమని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ గజ్జలపు మణికుమారి అధ్యక్షతన గొలుగొండ మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది. తొలుత ఆమె మాట్లాడుతూ సమష్టిగా గ్రామాల అభివృద్ధికి అంతా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులతో పాటు సర్పంచ్‌లు మాట్లాడుతూ ఇసుక లేకపోవడంతో నిర్మాణ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.  అనంతరం కొత్తమల్లంపేట సర్పంచ్‌ పోలిరెడ్డి రాజబాబు మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా ఓటీఎస్‌ కోసం గ్రామాల్లోకి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వెళుతుంటే ప్రజలు నిలదీస్తున్నారని వాపోయారు. నగదు చెల్లించలేమని లబ్ధిదారులు చెపుతున్నారన్నారు. అలాగే, కొత్తమల్లంపేటలో పదిహేను రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడినట్టు చెప్పారు. నాగాపురం సర్పంచ్‌ ఎలమంచిలి రఘురాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పింఛన్లు పొందుతున్న పలువురికి ప్రస్తుతం పింఛన్లు నిలిపివేయడంపై  తమను నిదీస్తున్నారన్నాని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే, గ్రామంలో 18 మందికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కాపు నేస్తం పథకం మంజూరు కాలేదన్నారు. దీనిపై సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే సర్పంచ్‌ పదవికి తాను రాజీనామా చేస్తామని హెచ్చరించారు. జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకటగిరాబాబు మాట్లాడుతూ ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆరుకిలో మీటర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. వ్యవసాయాధికారి మధుసూదనరావు మాట్లాడుతూ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రైతులు మూడు రోజులపాటు వరి కోతలు చేపట్టరాదన్నారు. ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిటికెల భాస్కరనాయుడు, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్‌ లెక్కల సత్యనారాయణ, ఈవోపీఆర్‌డీ రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement