‘టెక్నాలజీ గురు’తో పోటీ ఎలా?

ABN , First Publish Date - 2020-06-30T05:51:02+05:30 IST

కొత్త,వినూత్న సాంకేతికతల అభివృద్ధిలో చైనా అగ్రగామిగా పురోగమిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ‘టెక్నాలజీ గురు’గా ఆ దేశం ఆవిర్భవించింది. మరి ఈ సాంకేతికతా మహాబలుడుతో మనం ఎలా వ్యవహరించాలి? ఈ ప్రశ్న ఎందుకంటే...

‘టెక్నాలజీ గురు’తో పోటీ ఎలా?

ప్రభుత్వోద్యోగుల గొంతెమ్మ కోరికలు తీర్చడాన్ని నిలిపివేసి, పరిశోధన, అభివృద్ధిరంగంలో వ్యయాలను ఇతోధికంగా పెంపొందించాలి. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలి. ఇవి జరిగినప్పుడు మాత్రమే కొత్త సాంకేతికతల అభివృద్ధిలో చైనాను భారత్ సమర్థంగా అధిగమించగలదు.


కొత్త,వినూత్న సాంకేతికతల అభివృద్ధిలో చైనా అగ్రగామిగా పురోగమిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ‘టెక్నాలజీ గురు’గా ఆ దేశం ఆవిర్భవించింది. మరి ఈ సాంకేతికతా మహాబలుడుతో మనం ఎలా వ్యవహరించాలి? ఈ ప్రశ్న ఎందుకంటే పలు భారతీయ కంపెనీలు, ముఖ్యంగా ఓలా లాంటి అంకుర సంస్థలు చైనా మదుపుల ఆలంబనతో వర్ధిల్లుతున్నాయి. ఈ కంపెనీలు తమ లాభాలను చైనాకు తరలిస్తున్నాయి. చైనీస్ కంపెనీల మదుపులను తీసుకోవడాన్ని మనం నిలిపివేయగలం. అయితే దానివల్ల ఏ సమస్యా పరిష్కారం కాబోదు. చైనా పెట్టుబడులను స్వీకరించడం వల్ల మనమూ సాంకేతికతల అభివృద్ధిలో ముందంజ వేసేందుకు అవకాశమున్నది. పూర్తిగా చైనా మదుపులు, సాంకేతికతలపై ఆధారపడితే మన ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోతుంది. ఇంకా పలు విధాల ప్రతి కూలతల నెదుర్కోవలసివస్తుంది.


చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ఒకటి ఇలా పేర్కొంది: ‘2002లో చైనా ప్రభుత్వం పవన విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన టర్బైన్ల కోసం ఓపెన్ బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. టర్బైన్ ఉత్పత్తిదారుల మధ్య పోటీని ప్రోత్సహించడమే ఈ ప్రక్రియ లక్ష్యం. చైనా మార్కెట్‌లోకి విదేశీ టర్బైన్ల దిగుమతులు వెల్లువెత్తాయి.... అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు తాము ఉపయోగించుకునే విడిభాగాలలో 70 శాతం తప్పనిసరిగా దేశీయ సంస్థలు ఉత్పత్తిచేసినవి అయివుండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. 2009 నాటికి చైనాలో అగ్రశ్రేణి 10 పవన విద్యుత్ టర్బైన్ల ఉత్పత్తికంపెనీలలో 6 చైనా దేశీయ సంస్థలే’. ఈ దృష్ట్యా మనం చైనీస్ మదుపులను తీసుకుంటున్నామా లేదా అన్నది ప్రశ్న కాదు. వాటిని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటున్నామనేదే అసలు ప్రశ్న.


వాణిజ్యంలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉన్నది. మన దేశంలో ఆటోమొబైల్ విడిభాగాల ఉత్పత్తి వ్యయం చైనాలో కంటే అధికంగా ఉన్నది. ఆటో విడిభాగాల దిగుమతులను నిలిపివేయచ్చు. ఇదే మంత సమస్యకాదు. అయితే ఆ విడిభాగాల సాంకేతికతలను మెరుగుపరచలేని పక్షంలో మన ఆటో మోబైల్ కంపెనీలు దేశీయంగా తయారైన ఖరీదైన విడిభాగాలనే కొనుగోలు చేయవలసివస్తుంది. ఇది పరిశ్రమకు మేలు చేయదు. మనం ఉత్పత్తి చేసే కారుల ధర చాలా అధికంగా ఉంటుంది. వినియోగదారులపై అనివార్యంగా పెద్ద ఆర్థిక భారం పడుతుంది. అంతర్జాతీయ విపణిలో ఎదురయ్యే పోటీని మనం సమర్థంగా ఎదుర్కోలేము. ఫలితంగా మన ఆటోమొబైల్ ఉత్పత్తిదారులు అమితంగా నష్టపోతారు. మనమే గనుక ఆటో విడిభాగాల సాంకేతికతలను మెరుగుపరచి చైనాలోకంటే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగితే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మన వాహనాల విక్రయాలు భారీగా పెరుగుతాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలా వద్దా అనేది ప్రశ్న కాదు. మనం మన ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, నాణ్యమైన సరుకులను ఉత్పత్తిచేసి చైనాతో పోటీ పడగలమా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఇలా సమర్థంగా వ్యవహరించేందుకు కొన్ని మూలాధార అంశాలపై మనం దృష్టి పెట్ట వలసివున్నది. పవన విద్యుత్ టర్బైన్ల విషయంలో చైనా వలే మనమూ తెగువ, ధైర్యంతో వ్యవహరించిగలిగినప్పుడే మనం లబ్ధి పొందగలం.


సాంకేతికతల అభివృద్ధిలో ముందంజ వేయాలంటే ఆర్థికరంగంలో పటిష్ఠ చర్యలు చేపట్టడం, రాజకీయ రంగంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం. పరిశోధన, అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం, మన స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో కేవలం 0.7 శాతంగా మాత్రమే ఉన్నది. ఇది మన ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆర్థిక సర్వే వెల్లడించిన వాస్తవం. మరి దక్షిణ కొరియా, ఇజ్రాయిల్ తమ జీడీపీలలో 4.6 శాతం, చైనా 2.1 శాతం పరిశోధన, అభివృద్ధిరంగంలో ఖర్చు చేస్తున్నాయి. చైనా జీడీపీ మన జీడీపీ కంటే ఐదురెట్లు అధికం గనుక పరిశోధన, అభివృద్ధిరంగంలో ఆదేశం వెచ్చిస్తున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కంటే 15 రెట్లు అధికం.


అత్యంత కీలకరంగంలో మనం అతి తక్కువగా ఖర్చు పెట్టడానికి కారణమేమిటి? ప్రభుత్వ వినియోగమేనని చెప్పక తప్పదు. ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాల చెల్లింపులకే సరిపోతుంది. ప్రభుత్వోద్యోగుల సగటు వేతనం చైనాలో ఆ దేశ ప్రజల తలసరి జీడీపీకి ఒకటిన్నర రెట్లు అధికం కాగా మనదేశంలో నాలుగున్నర రెట్లకు పైగా అధికంగా ఉన్నది. ఐదో వేతన సంఘం సిఫారసులను అమలుపరచడం ప్రారంభించిన తరువాత పరిశోధన, అభివృద్ధిరంగంలోనూ, రక్షణ రంగం మొదలైన ఇతర ముఖ్య రంగాలలో ఖర్చు చేసేందుకు అవసరమైన నిధులు మన ప్రభుత్వానికి కొరవడ్డాయని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ ఆదాయాన్ని పెద్ద ఎత్తున స్వాయత్తం చేసుకొని, పరిశోధన, అభివృద్ధి రంగానికి నిధుల కొరత కలిగించడం ద్వారా మన ప్రభుత్వోద్యోగులు దేశ సార్వభౌమత్వానికి హాని చేస్తున్నారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.


ప్రభుత్వోద్యోగులలో అత్యధికులు, మరీ ముఖ్యంగా సాయుధ బలగాలలోనివారు నిజాయితీగా, ఎంతో కష్టనష్టాలకు గురవుతూ దేశానికి సేవలు అందిస్తున్నారన్న విషయం నాకు బాగా తెలుసు. ఈ సత్యాన్ని నేను నిరాకరించడం లేదు. అయితే తలసరి జీడీపీ కంటే అధిక స్థాయిలో వారికి చెల్లిస్తున్న వేతన భత్యాల సమష్టి ప్రభావం దేశ సర్వతో ముఖాభివృద్ధికి దోహదం చేయడం లేదన్నది నిరాకరించలేని వాస్తవం.


సాంకేతికతల అభివృద్ధిలో మన వెనుకబాటుతనానికి మరో కారణం ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మన విశ్వవిద్యాలయాల, పరిశోధనా సంస్థలలోని భ్రష్ట పరిస్థితులు. కొద్ది సంవత్సరాల క్రితం ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడిని ‘ఉద్యోగ విరమణ అనంతరం ఎలా కాలం గడుపుతారని’ అడిగాను ‘గత నలభై సంవత్సరాలుగా పనిచేయకుండా ఉండడానికే నేను అలవాటుపడ్డాను. కాలం దానికదే అలా గడిచిపోతుందని’ ఆయన సమాధానమిచ్చాడు! కొత్త సాంకేతికతల అభివృద్ధిలో అమెరికా సాధించిన అద్భుత పురోగతిలో ఆ దేశ విశ్వద్యాలయాలు నిర్వహించిన పాత్ర అత్యంత కీలకమైనదన్న విషయాన్ని మనం విస్మరించ కూడదు. ఇప్పుడు చైనా విశ్వవిద్యాలయాలు కూడా తమ దేశం సాధిస్తున్న అనుపమాన పురోగతిలో అటువంటి కీలక పాత్రనే పోషిస్తున్నాయి. మరి మన విశ్వవిద్యాలయాలు అప్పటికీ ఇప్పటికీ డిగ్రీలు ప్రదానం చేయడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ డిగ్రీలతో ప్రభుత్వోద్యోగాలు పొందుతున్నవారు దేశాభివృద్ధికి చేస్తున్న దోహదం స్వల్పాతి స్వల్పమే. మనం ఇప్పటికైనా మేల్కొని, ఈ పరిస్థితిని మార్చివేయవలసివున్నది. ఇది జరిగినప్పుడే మనం చైనాతో పోటీపడగలం. ప్రభుత్వోద్యోగుల గొంతెమ్మ కోరికలు తీర్చడాన్ని నిలిపివేసి, పరిశోధన, అభివృద్ధిరంగంలో వ్యయాలను ఇతోధికంగా పెంపొందించాలి. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-06-30T05:51:02+05:30 IST