Abn logo
Sep 13 2020 @ 00:00AM

అక్షయమైన దారుఢ్యం ఇలా...

‘ఫిట్‌నెస్‌’ అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే వ్యక్తి బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. 53 ఏళ్ళ వయసులోనూ అతను చేసే యాక్షన్‌ సీన్లు ప్రేక్షకుల్ని కుర్చీ అంచుల్లో కూర్చోబెడతాయి. తాజాగా ప్రఖ్యాత సాహస యాత్రికుడు బేర్‌ గిల్స్‌తో చేసిన ‘ఇన్‌టూ ది వైల్డ్‌’ షో గురించి మాట్లాడుతూ తన ఫిట్‌నె్‌సకు కారణం రోజూ గోమూత్రం తాగడమేనని అక్షయ్‌ చేసిన ప్రకటనతో చాలామంది గోమూత్రం గొప్ప గుణాల గురించి శోధించడం మొదలెట్టారు. ఇంతకూ అక్షయ్‌ శరీర దారుఢ్యం వెనుక రహస్యమేమిటి? ఫిట్‌నెస్‌ కోసం అతనేం చేస్తాడు? ఏం తింటాడు?


అయిదు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు సవాల్‌ విసిరే ఫిట్‌నెస్‌ అక్షయ్‌ కుమార్‌ది. సవాల్‌ విసిరే యాక్షన్‌ సన్నివేశం దొరికితే అక్షయ్‌కి పట్టపగ్గాలుండవు. అతనికి డూప్‌తో పని లేదు. ‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ సినిమా షూటింగ్‌లో సింగపూర్‌లోని 74 అంతస్తుల భవనాన్ని అవలీలగా ఎక్కేశాడు. ‘‘ఎవరైనా ఇలా చెయ్యొచ్చు. కావలసిందల్లా శ్రమించే తత్త్వం, క్రమశిక్షణ’’ అంటాడు అక్షయ్‌. ఆ క్రమశిక్షణ అతనికి వారసత్వంగా వచ్చింది. అక్షయ్‌ తండ్రి ఆర్మీలో పని చేశారు. శరీర దారుఢ్యానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. తండ్రి స్పూర్తితో అక్షయ్‌ చిన్నప్పటి నుంచీ వివిధ వ్యాయామాలు చేసేవాడు. తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించాడు. 


అదే అతని మంత్రం

‘‘త్వరగా నిద్రపోవాలి. త్వరగా నిద్ర లేవాలి. మనిషికి ఆరోగ్యం, సంపద, వివేకం కావాలంటే అనుసరించాల్సిన సూత్రం ఇదే!’’ అంటాడు అక్షయ్‌. దాన్ని అతను కఠినంగా పాటిస్తాడు. ఉదయాన్నే నాలుగున్నరకు నిద్ర లేస్తాడు. తొమ్మిదికల్లా నిద్రపోతాడు. రాత్రి షిప్టుల్లో పని చెయ్యడానికి ఇష్టపడడు. పార్టీలకు దూరంగా ఉంటాడు.


జీవితంలో భాగం కావాలి

‘‘శరీరం దృఢంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అలా ఉండాలంటే శారీరక వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి’’ అంటాడు అక్షయ్‌. మార్షల్‌ ఆర్ట్స్‌ను క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేస్తాడు. బాస్కెట్‌ బాల్‌ ఆడతాడు. కిక్‌ బాక్సింగ్‌, షాడో బాక్సింగ్‌, వాకింగ్‌, ట్రెక్కింగ్‌ చేస్తాడు. చెట్లు, కొండలు ఎక్కడం అతనికి సరదా. కుదరకపోతే మెట్లు ఎక్కి దిగుతూ ఉంటాడు. క్లైంబింగ్‌ ప్రాక్టీస్‌ కోసం తన జిమ్‌లో ఒక కృత్రిమమైన చెట్టును ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయాన్నే నాలుగున్నరకు లేచాక గంట సేపు ఈత కొడతాడు. మరో గంట సేపు మార్షల్‌ ఆర్ట్స్‌ పాక్టీస్‌ చేస్తాడు. ఆ తరువాత కాసేపు యోగా, స్ట్రెచ్చింగ్‌ ఎక్సర్‌సైజ్‌లూ చేస్తాడు. అనంతరం గంట సేపు ధ్యానం చేస్తాడు. ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌. యోగా వల్ల మానసికమైన సమతుల్యత కూడా వస్తుంది అని చెబుతాడు.


ఇంటి వంటే బెస్ట్‌!

‘‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి భోజనమే ఉత్తమం. నా రహస్యాల్లో అది కూడా ఒకటి’’ అని గర్వంగా చెబుతాడు అక్షయ్‌. సాయంత్రం ఆరు గంటల కల్లా అతని డిన్నర్‌ పూర్తయిపోతుంది. కాపీలు, టీలు తాగడు. పొగ జోలికి వెళ్ళడు. కెఫిన్‌ ఉన్న పదార్థాలకు దూరంగా ఉంటాడు. తను చేసే వర్కవుట్స్‌ తాలూకు ఫలితం పూర్తిగా అందడం కోసం డైట్‌ ప్లాన్‌ కచ్చితంగా ఫాలో అవుతాడు. ఉదయాన్నే వ్యాయామం ముగించాక పరోటాలు, ఒక కప్పు పాలు తీసుకుంటాడు. రెండు గంటల తరువాత ఒక కప్పు పండ్ల ముక్కలు తింటాడు. మధ్యాహ్నం లంచ్‌లో రొట్టెలు, పప్పు, ఆకుపచ్చటి కూరగాయలు, చికెన్‌, ఒక కప్పు పెరుగు ఉంటాయి. సాయంత్రం చక్కెర లేకుండా తాజా పండ్ల రసం తీసుకుంటాడు. రాత్రి భోజనం తేలిగ్గా ఉండేలా చూసుకుంటాడు. దాన్లో సూప్‌, సలాడ్లు, కూరగాయ ముక్కలు తప్పనిసరిగా ఉంటాయి. ఆహారంలో ప్రోటీన్లు బాగా ఉండేలా చూసుకుంటాడు. 


‘‘సినిమాల్లో నటించడం, పోరాట సన్నివేశాల్లో పాల్గొనడం అంత తేలికైన సంగతి కాదు. దానిలో చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. శరీరం మన మాట వినాలి. వ్యాయామాలూ, యోగాభ్యాసాలూ, మార్షల్‌ ఆర్ట్స్‌ అందుకోసమే’’ అంటాడు అక్షయ్‌. ఏడాది కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’లో ముందువరుసలో నిలిచిన సెలబ్రిటీ అక్షయ్‌. ‘‘ఫిట్‌గా ఉండడం ప్రధానం. ఈ విషయంలో ఎలాంటి చర్చా లేదు. అంటాడతను. వైద్యం విషయానికొస్తే ఆయుర్వేద, నేచురల్‌ థెరపీలకే ప్రాధాన్యం ఇస్తాడు. ‘‘గొంతులో ఇబ్బందిగా ఉంటే వేడి పాలలో పసుపు వేసి తాగడమంత గొప్ప వైద్యం మరొకటి లేదు. రోజూ పొద్దుటే వేణ్ణీళ్ళలో తేనె కలిపి తాగండి. ఫలితాలు మీకే తెలుస్తాయ్‌’’ అని చెబుతాడు అక్షయ్‌.

Advertisement
Advertisement
Advertisement