నా ఎత్తు ఐదడుగుల ఒక అంగుళం.. ఇంకా పెరగాలంటే ఏం చేయాలి?
ABN , First Publish Date - 2021-12-11T22:46:46+05:30 IST
నాకు పదిహేనేళ్ళు. ఎత్తు ఐదడుగుల ఒక అంగుళం. మరింత ఎత్తు పెరగడానికి ఎలాంటి ఆహారం, వ్యాయామం అవసరం?
ఆంధ్రజ్యోతి(11-12-2021)
ప్రశ్న: నాకు పదిహేనేళ్ళు. ఎత్తు ఐదడుగుల ఒక అంగుళం. మరింత ఎత్తు పెరగడానికి ఎలాంటి ఆహారం, వ్యాయామం అవసరం?
- దినకరన్, నెల్లూరు
డాక్టర్ సమాధానం: ఎత్తు సాధారణంగా వంశపారంపర్య లక్షణం. అయితే మీరు ఎదిగే వయసులో ఉన్నారు. ఆహారం, నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎత్తు పూర్తిగా పెరగరు. మీకు ఇప్పుడు పదిహేనేళ్లే కాబట్టి కనీసం మరొక నాలుగైదు సంవత్సరాల పాటు ఎత్తు పెరగవచ్చు. ఎత్తు పెరగడానికి ముఖ్యమైంది ఎముకల ఆరోగ్యం. దీని కోసం ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ - డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, ఆక్రోట్ లాంటి గింజలు తీసుకోవచ్చు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్ మొదలైన ఆహారపదార్ధాల్లో కాల్షియం ఉంటుంది. రోజుకు అరలీటరు నుండి ముప్పావు లీటరు పాలు లేదా పాల పదార్థాలు తీసుకుంటే సరిపడా కాల్షియం లభిస్తుంది. విటమిన్- డి కోసం మీరు కనీసం ఓ అరగంట సమయం ఎండలో తిరిగితే సరిపోతుంది. ఇలా ఆహార జాగ్రత్తలతో పాటు వ్యాయాయం కూడా చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. రోజుకు ముప్పై నుండి అరవై నిమిషాల పాటు వేగంగా నడవడం, పరిగెత్తడం, లేదా ఏదైనా ఆట ఆడండి. కనీసం ఎనిమిది గంటల పాటు రాత్రి నిద్ర కూడా అవసరం.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.coomకు పంపవచ్చు)