రాహుల్‌లో సంశయాత్మ ఇంకెంతకాలం?

ABN , First Publish Date - 2021-10-20T08:24:17+05:30 IST

భారతదేశంలో ప్రతిపక్షం అన్న పదానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రశ్నించేవారు కనపడడం లేదు...

రాహుల్‌లో సంశయాత్మ ఇంకెంతకాలం?

భారతదేశంలో ప్రతిపక్షం అన్న పదానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రశ్నించేవారు కనపడడం లేదు. అడపాదడపా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్లకు, వామపక్షాలు విడుదల చేసే ప్రకటనలకు పెద్ద తేడా ఉండడం లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున పునరుజ్జీవం పొందగలదని, ఆ పార్టీలో జవజీవాలు ప్రవేశిస్తాయని గత రెండేళ్లుగా ఆశిస్తున్న వారికి పరిస్థితులు ఆశాజనకంగా కనపడడం లేదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు మరో ఏడాది తర్వాత జరుగుతాయని, కొత్త అధ్యక్షుడు 2022 అక్టోబర్ కల్లా ఎన్నికవుతాడని నిర్ణయించారు. అంతవరకూ తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా కొనసాగుతానని సోనియాగాంధీ ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది వరకూ పార్టీలో ఇప్పుడున్న జడత్వమే కొనసాగుతుందని అర్థమవుతోంది. నిజానికి సోనియాగాంధీ క్రియాశీలకంగా ఉంటే, గతంలో మాదిరి దేశంలోని వివిధ పార్టీలనన్నీ ఏకత్రాటిపై తేగల శక్తి ఆమెలో ఉంటే ఆమె నాయకురాలిగా కొనసాగినా అర్థం ఉండేది. అంతేకాదు, సోనియాగాంధీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పరిస్థితులకూ, ఇప్పటి పరిస్థితులకూ తేడా ఉన్నది. నాడు భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా ఉండేది కాదు. మోదీ లాంటి నాయకుడు ఉండేవారు కాదు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల వ్యూహాలూ అవలంబిస్తూ ఉరకలు వేస్తున్న పరిస్థితి ఆ పార్టీకి ఉండేది కాదు. ఇప్పుడు ఆఖరుకు అండమాన్ నికోబార్ ద్వీపాలను కూడా బిజెపి వదిలిపెట్టడం లేదు. నాలుగు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండమాన్ నికోబర్ ద్వీపాల్లో మూడు రోజులు పర్యటించి పార్టీ కార్యకర్తలతో గడిపారంటేనే ఒక చిన్న ప్రదేశానికి కూడా ఆ పార్టీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థమవుతోంది. ఆఖరుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈశాన్య రాష్ట్రాలలో ఏడు రోజులు పర్యటించి అనేక ప్రాజెక్టులను ప్రారంభించడాన్ని కూడా బిజెపి ఉపయోగించుకుంది. దేశంలో ప్రత్యర్థులు బలహీనంగా ఉన్న ఏ ప్రాంతాన్నీ బిజెపి వదులుకోవడానికి ఇష్టపడకపోగా, కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు నిత్యం ప్రయత్నిస్తోంది.


ఇలాంటి పరిస్థితుల్లో జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండాలి? అస్వస్థతతో బాధపడుతూ, విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో 74 సంవత్సరాల సోనియాగాంధీయే మరో ఏడాది కొనసాగాలని పార్టీ నిర్ణయించింది. నిజానికి ఆమె కొద్ది సంవత్సరాలుగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, రాహుల్ గాంధీయే అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నుంచీ ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ వరకూ రాహుల్ గాంధీయే నియమించారు. రాహుల్ ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో పెద్దగా తప్పుపట్టాల్సినవి ఏమీ లేపు. అయినప్పటికీ తన తల్లి నీడలోనే నిర్ణయాలు తీసుకోవాలని, వెనుక సీటులో కూర్చుని డ్రైవింగ్ చేయాలని రాహుల్ గాంధీ ఎందుకు భావిస్తున్నారు? పార్లమెంట్ లోనూ, బయటా మోదీతో ముఖాముఖి తలపడేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఆయనలో ఇంకా ఆత్మవిశ్వాసం ఏర్పడలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. నిజానికి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా, పరోక్షంగా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యత నిర్వర్తిస్తున్నా దాని వల్ల పార్టీకి ప్రయోజనం లభించిందని చెప్పడానికి ఇంతవరకూ దాఖలాలు లేవు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాత్రమే కాక, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా రాహుల్ బలహీనమైన నాయకత్వాన్ని ప్రతిఫలించాయి. బహుశా ఏదో ఒక ఎన్నికలో తన ప్రభావం చూపిన తర్వాత కాని రాహుల్ నాయకత్వం చేపట్టే అవకాశాలు లేకపోవచ్చు. కాని ఆ పరిస్థితి ఎప్పుడు తలెత్తాలి? నాయకుడనే వాడు పార్టీకి విజయావకాశాలున్నప్పుడు ఘనత తగ్గించుకోవడం కాదు, పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేసి తన సత్తా నిరూపించుకోగలగాలి. ఆ పరిస్థితి లేనందువల్లే రాహుల్ బాధ్యత లేకుండానే అధికారం అనుభవిస్తూ తల్లి చాటు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. జాతీయస్థాయిలో నాయకత్వ ప్రతిభను ప్రదర్శించకుండా మోదీ పాలనా విధానాలను విమర్శించడం, విమానాశ్రయాల్లో ధర్నాకు కూర్చోవడం వంటి నాటకీయ ప్రదర్శనలు చేయడం వల్ల పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రణగొణ ధ్వనులు తప్ప తిరుగుబాట్లు, చీలికలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కామరాజ్, మొరార్జీ దేశాయ్, నిజలింగప్ప, అతుల్య ఘోష్, నీలం సంజీవరెడ్డి, కరుణాకరన్ వంటి బలమైన నాయకులు కాంగ్రెస్‌లో లేరు. ఉంటే ఏనాడో సోనియా, రాహుల్ నాయకత్వాన్ని ధిక్కరించి వేరే కుంపటి పెట్టి ఉండేవారు. ఇప్పుడున్న సీనియర్ నేతల్లో ఎక్కువ మంది ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లినవారు. చేవ చచ్చినట్లు కనిపిస్తున్న పార్టీని చేవ చచ్చిన వారు చీల్చి ఏమి చేయగలరు? బహుశా ఇదే రాహుల్ గాంధీ తెరవెనుక చక్రం తిప్పడానికి కారణమవుతోంది. దాని వల్ల పార్టీలో సుస్థిరత కానీ, పటిష్ఠత కానీ ఏర్పడే సూచనలు కనపడడం లేదు. ప్రత్యామ్నాయం కనపడని పరిస్థితుల్లో కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవానీ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందేమో కానీ బిజెపి పట్ల తలెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను ఒక రాజకీయ ప్రభంజనంగా మార్చే నాయకత్వ పటిమ తనకున్నదని రాహుల్ గాంధీ నిరూపించుకోలేకపోతే ఆ చేరికలు కూడా వ్యర్థం కాక తప్పదు.


బహుశా నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రతరం అయి ప్రజలు ప్రత్యామ్నాయంగా తన వైపు చూస్తారన్న ఆశాభావం రాహుల్ గాంధీలో ఉండవచ్చు. నిజానికి మోదీ అనేక ప్రజా వ్యతిరేక, నిరంకుశ నిర్ణయాలు తీసుకున్నారనడంలో సందేహం లేదు. వివిధ వర్గాల ప్రజలు తీవ్ర నిరసనను కూడా వ్యక్తపరిచారు. నెలల తరబడి ఆందోళనలను నిర్వహించారు. మేధావులు, ప్రజాస్వామికవాదులలో కూడా మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. పెట్రోల్, డీజిల్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. మోదీ ప్రభుత్వ విధానాల పట్ల ప్రతిపక్షాల్లో మాత్రమే కాదు స్వపక్షాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ ఈ ప్రజావ్యతిరేకతను పూర్తిగా తమ వైపుకు మళ్లించగల శక్తి, నాయకత్వం కాంగ్రెస్‌లో లేదు. 2009కి పూర్వం కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం పట్ల ఏర్పడిన తీవ్ర ప్రజావ్యతిరేకతను, కుంభకోణాలను బిజెపి పూర్తిగా తన వైపుకు తిప్పుకోగలిగింది. అంతకుముందు రెండు సార్లు ఆడ్వాణీని ప్రయోగించి విఫలమైన బిజెపి నాయకత్వం నరేంద్రమోదీని రంగంలోకి దించి ఒక ఊపును నిర్మించగలిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు అలాంటి ఊపు అందించగల నాయకత్వం ఇవ్వగలరా? అన్నది ప్రశ్నార్థకం. బిజెపికి హిందూత్వ సైద్ధాంతిక ప్రాతిపదిక, సంస్థాగత పటిష్ఠత, ఆర్ఎస్ఎస్ తోడ్పాటుతో పాటు మోదీ వ్యక్తిగత ప్రాబల్యం, ఓట్లను కులాలవారీగా, వర్గాలవారీగా చీల్చగలిగిన వ్యూహరచన, వివిధ ప్రభుత్వ యంత్రంగాలను వాటి ప్రత్యర్థులను భయభ్రాంతులు చేయగలిగిన శక్తి తోడ్పడితే కాంగ్రెస్‌కు వీటన్నిటి విషయంలోనూ లోపాలున్నాయి. దీని వల్ల కాంగ్రెస్ మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్క మమతా బెనర్జీ తప్ప దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపిని నేరుగా ఢీకొనేందుకు ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. బిజెపి గ్రాఫ్ పడిపోతుందని, ఓటమి దిశన పయనిస్తుందని సంకేతాలు వస్తే కాని అనేక ప్రతిపక్షాలు నేరుగా బిజెపిని ఢీకొనేందుకు సిద్దపడకపోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి, తాను ముఖాముఖి బిజెపిని ఢీకొనగలిగిన సీట్లలో సత్తా చూపించగలదన్న నమ్మకం కలిగిస్తే కాని దేశంలో మిగతా ప్రతిపక్షాలకు ధైర్యం రాకపోవచ్చు. ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ఓట్లుగా మారితే బిజెపి గాలిలో కొట్టుకుపోవచ్చు కాని  ప్రతిపక్షాల ఓట్ల చీలిక భారతీయ జనతా పార్టీ కే ఉపయోగపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే అంతమాత్రాన బిజెపి తనకు తిరుగులేదని అనుకోవడానికి ఆస్కారం లేదు. ప్రజావ్యతిరేకత ఎక్కడ ఏ రూపంలో ఏ ఊపున వస్తుందో చెప్పలేం. వచ్చే రెండేళ్లలో భారతీయ జనతాపార్టీ 16 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఆ తర్వాత 2024లో సార్వత్రక ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది రాజకీయంగా కీలకమైన రాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో యథాప్రకారం భారీ మెజారిటీతో విజయం సాధించకపోతే రాష్ట్రపతి ఎన్నిక కోసం చిన్నా చితక పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల రానున్న రోజుల్లో బిజెపి హిందూత్వ, అంతర్గత భద్రత, సరిహద్దుల రక్షణ, కశ్మీర్‌తో సహా అన్ని రకాల అంశాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంతో పాటు ప్రత్యర్థులపై సామ, దాన భేద దండోపాయాలు ప్రయోగించి పావులు కదుపుతుందనడంలో సందేహం లేదు. రాహుల్ తన నాయకత్వ పటిమ ఇంకా రుజువు చేసుకోలేదు కాని మోదీ నాయకత్వానికి పరీక్ష మాత్రం మొదలైందని చెప్పవచ్చు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి


Updated Date - 2021-10-20T08:24:17+05:30 IST