Abn logo
Sep 26 2021 @ 16:25PM

ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలంటే సగటు భారతీయుడు ఎన్ని గంటలు పనిచేయాలంటే?

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఏదైనా ఫోన్‌ను ప్రకటించిందంటే అది లాంచ్ అయ్యే వరకు దాని కోసం కళ్లలో వత్తులు వేసుకుని చూసే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉంటారు. జీవితంలో ఒకసారైనా ఐఫోన్ వాడాలనేది కొందరి లక్ష్యం అయితే, ఆ ఫోన్ కోసం క్యూలలో తిండీతిప్పలు లేకుండా రోజుల తరబడి నిల్చోవడం, ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. 


యాపిల్ ఇటీవల ఐఫోన్ 13ను విడుదల చేసింది. ఇందులో నాలుగు మోడల్స్.. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 మ్యాక్స్‌ ఉన్నాయి. వీటి ధరలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. యూకేలో వీటి ధర 679 -1,549 పౌండ్ల మధ్య ఉండగా, అమెరికా, కెనడాలలో సగటున ఈ ఫోన్ల ధరలు వరుసగా 771-1,691, 826-1,941 డాలర్ల మధ్య ఉంది. అయితే, ఈసారి మాత్రం వీటి ధరలు యాపిల్ ప్రియులకు కాస్తంత అందుబాటులోనే ఉన్నాయి. 


ఐఫోన్ 13 (128 జీబీ)ని సొంతం చేసుకోవాలంటే ఏ దేశ ప్రజలు ఎన్ని గంటల పనిచేయాల్సి ఉంటుందన్న దానిపై బ్రిటన్‌కు చెందిన ‘మనీ సూపర్ మార్కెట్’ ఓ అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం.. ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలంటే భారతీయులు ఏకంగా 724.2 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీని ధర భారత్‌లో రూ. 79,900. అంటే అన్ని గంటలు పనిచేస్తే తప్ప భారతీయులకు ఐఫోన్ ముచ్చట తీరదన్నమాట. 


ఫిలిప్పీన్స్ ప్రజలైతే ఏకంగా 775.3 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే 97 రోజులు (మూడు నెలల కంటే ఎక్కువ) చెమటోడిస్తే తప్ప ఐఫోన్ కొనడం అసాధ్యం. ఇక స్విట్జర్లాండ్‌లో ఈ ఫోన్‌ను అత్యంత చవగ్గా కొనేయొచ్చు. ఇక్కడివారు కేవలం 34 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీరి సగటు వార్షికాదాయం 79,270 డాలర్లు. బ్రెజిల్‌లో అయితే 690.5 గంటలు, అంటే 86 రోజులు (2.8 నెలలు) పనిచేయాల్సి ఉంటుంది. హాంకాంగ్‌లో ఐఫోన్ 13 (128 జీబీ) వేరియంట్ ధర 874 డాలర్లు. ఇక్కడి వారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు 61.9 గంటలు (7.7 రోజులు) పనిచేయాల్సి ఉంటుందని ‘మనీ సూపర్ మార్కెట్’ అధ్యయనం వెల్లడించింది.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...