ఎన్నాళ్లీ నిరీక్షణ

ABN , First Publish Date - 2021-08-02T05:39:10+05:30 IST

మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేందాల్లో మొక్కజొన్న అమ్మిన రైతులకు నగదు చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పంట కొనుగోలు చేసిన రెండు వారాల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండగా అది ఆచరణ శూన్యమైంది. రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండగా రేపుమాపు అని చెప్పి వారు కాలయాపన చేస్తున్నారు.

ఎన్నాళ్లీ నిరీక్షణ

మొక్కజొన్న రైతులపై సర్కారు చిన్న చూపు

రూ.15 కోట్లకుపైన బకాయిలు 

విక్రయించి రెండు నెలలైన

జరగని చెల్లింపులు 

రైతుల అవస్థలు 

సకాలంలో రుణాలు చెల్లించలేక

 ఒంగోలు (జడ్పీ), ఆగస్టు 1 : 

 

‘మాది రైతు ప్రభుత్వం. అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంటోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా నిబంధనల కారణంగా ఎక్కువ మంది రైతులు పంటను అక్కడ అమ్ముకోలేకపోతున్నారు. విక్రయించిన వారికి కూడా సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పంట అమ్మి రెండు నెలలు పూర్తయినా నేటికీ ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో తెచ్చుకున్న పంట రుణాలు సకాలంలో తీర్చలేకపోతున్నారు. దీంతో వడ్డీరాయితీని కోల్పోతున్నారు. మరోవైపు ఖరీఫ్‌ పనులు ముమ్మరమయ్యాయి. ఈ సమయంలో పంటల సాగుకు చేతిలో సొమ్ము లేక చింతిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. 


 

మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేందాల్లో మొక్కజొన్న అమ్మిన రైతులకు నగదు చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పంట కొనుగోలు చేసిన రెండు వారాల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండగా అది ఆచరణ శూన్యమైంది. రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండగా రేపుమాపు అని చెప్పి వారు కాలయాపన చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తయిన వెంటనే మార్కెట్‌ మాయాజాలం కూడా బయటపడింది. ఇప్పుడు ధరలు పెరిగాయి. 

రూ.15 కోట్లకుపైన బకాయిలు

జిల్లాలో 80కుపైగా కొనుగోలు కేంద్రాల్లో 28,501 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్‌ సేకరించింది. ప్రభుత్వ నిర్దేశించిన క్వింటా రూ.1,850 మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేసింది. ఆ ప్రక్రియ జూన్‌ 30తో ముగిసింది. మొత్తం  కొనుగోలు చేసిన మొక్కజొన్నల తాలూకా రూ.55కోట్ల వరకూ చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.40కోట్లు  రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.15 కోట్లు ఇప్పటి వరకూ చెల్లించలేదు. 


కొనుగోళ్లు ముగిసిన తర్వాత పెరిగిన ధర

మొక్కజొన్న రైతుల్లో 90 శాతం మంది మే 30లోపే తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనో లేక నిబంధనల అర్హతను పొందలేక మద్దతు ధర రూ.1,850 కన్నా తక్కువకే దళారులకో  అమ్మేసుకున్నారు. అనూహ్యంగా ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధర పెరిగి క్వింటా రూ.2300కు చేరింది. ప్రస్తుతం రూ.2400కు కూడా రుకుంది.  కరోనా కాలంలో దిగుబడి ఖర్చులు పెరిగి నష్టాలపాలవుతున్న రైతు తన చేయిదాటిపోయాక రేటు పెంచిన సిండికేట్‌ జిమ్మిక్కులను చూసి నివ్వెరపోతున్నాడు


వడ్డీ రాయితీలకు దూరం

గత సంవత్సరం ఖరీఫ్‌కు సంబంధించి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తేనే అంతో ఇంతోఅంతో వడ్డీ రాయితీలు అన్నదాతలకు అందుతాయి. ఏడుశాతం  వడ్డీరేటులో  తీసుకున్న  మొత్తాన్ని సకాలంలో కడితే మూడు శాతం మేర రాయితీ రైతుకు  లభిస్తుంది. పంట అమ్ముకున్న తర్వాత కూడా నెలల తరబడి సొమ్ములు అందకపోవడంతో రుణాలు సకాలంలో చెల్లించలేక రైతులు రాయితీలకు కూడా దూరమవుతున్నారు. ఖరీఫ్‌సాగుకు కూడా చేతిలో డబ్బులు లేక  నానా ఇబ్బందులు పడుతున్నాడు.

మూడు నెలలు దాటినా...

 యద్దనపూడి మండలం పూనూరులో నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, పర్చూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించారు. అక్కడకు వచ్చిన కొంతమంది రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మూడు నెలలు దాటినా మొక్కజొన్న అమ్మిన డబ్బులు రాలేదని వారికి ఫిర్యాదు చేశారు. తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. వీరే కాదు జిల్లావ్యాప్తంగా అనేక మంది పరిస్థితి ఇలాగే ఉంది.    



డబ్బులు వచ్చాక వేస్తాం

దమ్మాలపాటి శ్రీనివాసరావు,సూదివారిపాలెం, ఇంకొల్లు మండలం 

ద్రోణాదుల యార్డులో సరైన స్పందన లేకపోవడంతో నేను మే  పంగులూరులో మే 24న మొక్కజొన్నలు అమ్మా. సుమారు రూ.3 లక్షల వరకూ రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ రూపాయి కూడా నా ఖాతాలో జమ కాలేదు. బ్యాంకులో తీసుకున్న రుణం సకాలంలో కట్టలేక 3 శాతం వడ్డీ రాయితీని కోల్పోయా. అసలే పెట్టుబడి ఖర్చులు పెరిగి మొక్కజొన్న సాగు గిట్టుబాటు కాకపోతుంటే రాయితీలను కూడా కోల్పోవాల్సి వస్తోంది. 

వారంలో జమ చేస్తాం

కె.హరికృష్ణ, మార్క్‌ఫెడ్‌ డీఎం

మార్కెటింగ్‌ శాఖనుంచి నిధులు విడుదలయ్యాయి. మరో వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మే24 లోపు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న అందరికీ ఇప్పటికే డబ్బులు అందాయి. దాదాపు 70 శాతం మందికి చెల్లించాం. ఆ తర్వాత వారికే పెండింగ్‌ ఉన్నాయి. రూ. 12 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అందుతాయి. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు    

           


Updated Date - 2021-08-02T05:39:10+05:30 IST