గరుడ గండం ఇంకెన్నాళ్ళు?

ABN , First Publish Date - 2021-06-20T06:59:32+05:30 IST

స్తంభాలు..

గరుడ గండం ఇంకెన్నాళ్ళు?

అలిపిరి దాకా అవసరమా?

టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయంపై విమర్శలు


తిరుపతి- ఆంధ్రజ్యోతి: స్తంభాలు పూర్తయ్యాయి. పైకప్పు నిర్మాణం సగానికి పైగా అయిపోయింది. దాదాపుగా సంపూర్ణ రూపుకు వచ్చిన సమయంలో గరుడవారధిని పొడిగిస్తామంటూ టీటీడీ పాలకమండలి శనివారం ప్రకటించడం పలువురిని విస్తుపరుస్తోంది. టీడీపీ పాలనలో మొదలైన గరుడ వారధిపై, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల మెలికలు పెట్టిన టీటీడీ పాలకమండలి, తాజాగా అలిపిరి దాకా పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రూ684 కోట్ల వ్యయమయ్యే వారధి పనులు 55 శాతం పూర్తయినా పాతిక కోట్లకు మించి విడుదల చేయని టీటీడీ ఇప్పుడెందుకు వారధి పొడిగింపు నిర్ణయం తీసుకుందా అని ఆశ్చర్యపోతున్నారు. నిజానికి పొడిగింపు అవసరం ఉందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండేళ్లుగా వారధి నిర్మాణంతో తిరుపతి ప్రజలు అష్టకష్టలు భరిస్తున్నారు. తాజా నిర్ణయం వల్ల పూర్తవడానికి ఇంకెంత కాలం పడుతుందో అనే ఆందోళన ప్రజల్లో ఉంది. 


తిరుపతి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా టీడీపీ హయాంలో గరుడ వారధి పట్టాలెక్కింది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల కోరికమేరకు శంకరంబాడి సర్కిల్‌ నుంచి మార్కెట్‌ యార్డు వరకు వారధిని పొడిగించారు. రూ684 కోట్ల బడ్జెట్‌తో తిరుచానూరు రోడ్డులో మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు 7 కి.మీ పొడవుతో ప్లైఓవర్‌ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.  వారధి వ్యయంలో 66 శాతం నిధులు ఇచ్చేందుకు టీటీడీ అంగీకరించింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే వారధి నిర్మాణం కొంతకాలం స్తంభించింది. తిరుపతి ప్రజల నిరసనలతో తిరిగి నిర్మాణం మొదలైనా, నిధుల విడుదలలో టీటీడీ జాప్యం చేస్తూనే వస్తోంది.


ఎన్ని మెలికలో..  

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పలుసార్లు వారధి పనులను పరిశీలించారు. కపిలతీర్థం నుంచి అలిపిరికి, మార్కెట్‌ యార్డునుంచి తిరుచానూరు ఫ్లైఓవర్‌ వరకు గరుడ వారధిని పొడిగించేవిధంగా రీడిజైన్‌ చేయాలని సూచించారు.  ఈమేరకు ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. అయితే ప్రభుత్వం నుంచి  స్పందన లేకపోవడంతో యధాతధంగా నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ సమీపం వరకు వారధి నిర్మాణం జరిగింది. వంతెన రోడ్డు స్థాయికి దిగిపోయే పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ దశలో అలిపిరి దాకా పొడిగిస్తామని చెప్పడం వృధాగా కోట్లు ఖర్చు చేయడమే అవుతుందని భావిస్తున్నారు. 


పొడిగింపు ఎలా ఉంటుంది?

నందిసర్కిల్‌ మీదుగా అలిపిరి గరుడ విగ్రహం ముందు వరకు వారధి నిర్మాణం పొడిగించాలని టీటీడీ పాలకమండలి భావిస్తోందని సమాచారం. అయితే కపిలతీర్థం (నంది)సర్కిల్‌ వద్ద వారధి విషయంలో  సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. నంది సర్కిల్‌ను యధాతథంగా వదిలేయడమా? లేదా అక్కడ కూడా సర్కిల్‌ రూపంలో వారధి నిర్మించడమా? అన్న స్పష్టత ఇంకారాలేదని తెలుస్తోంది. అలాగే పోలీస్‌ స్టేషన్‌ దగ్గర నేలకు దిగిపోయిన వంతెనను కొనసాగించడమీ లేక అలాగే వదిలేసి, వంద మీటర్ల తర్వాత వంతెన నిర్మించడమా అనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అదే జరిగితే అది రెండో వంతెనే అవుతుంది గానీ, గరుడవారధి పొడిగింపు కాబోదు. 


అవసరమా?

అసలు ఇప్పుడు పొడిగింపు అవసరం ఏమిటనే సందేహం నగరవాసుల్లో వినిపిస్తోంది. సహజంగా రోడ్డు దాటాల్సి వచ్చినచోటే ఫ్లైఓవర్‌ అవసరం ఉంటుంది. లీలామహల్‌ కూడలి తర్వాత ఎక్కడా ఇటువంటి క్రాసింగ్‌లు లేవు. ఖాదీకాలనీ రోడ్చు, కెటి రోడ్డు మాత్రమే వచ్చి కలుస్తాయి కానీ ఇవి క్రాస్‌ చేయవు. నంది సర్కిల్‌ నుంచి అలిపిరి దాకా ఉత్తరం దిక్కు మొత్తం అడవే. ఈ నడుమ రోడ్డు దాటి వెళ్లే అవసరం లేదు. మరి ఎందు కోసం గరుడవారధిని పొడిగించదలచుకున్నారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పొడిగింపు వ్యయం కనీసం మరొక 200 కోట్లు ఉండచ్చని అంచనా. అసలే ఏడాదిన్నరగా కరోనా ప్రభావంతో టీటీడీ ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వందల కోట్ల అదనపు వ్యయం అవసరమా ఆలోచించాల్సి ఉంది. వారధి నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులు వెంటనే ఇచ్చి, త్వరగా పూర్తయ్యేలా చూడాల్సిన టీటీడీ తాజా నిర్ణయంతో మరింక ఎన్నేళ్లు తిరుపతి ప్రజలను ట్రాఫిక్‌ చిక్కుల్లో ఉంచుతుందో అర్ధం కావడం లేదు. 


అసంతృప్తిలో స్థానిక వ్యాపారులు

తిరుమలకు వచ్చే యాత్రీకులతోనే తిరుపతిలో చాలావరకు వ్యాపారాలు అధారపడి ఉన్నాయన్న విషయం తెలిసిందే. కరోనాకు తోడు గరుడ వారధి నిర్మాణం ఉన్న మేరకు ఇప్పటికే వ్యాపారాలకు తీవ్ర దెబ్బ తగిలింది. ఇప్పుడు అవసరంలేని చోట కూడా వారధినిర్మించడం వలన అక్కడి స్థానిక వ్యాపారుల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అదీగాక ఇప్పటికే మూడేళ్లుగా వారధి నిర్మాణంలో భాగంగా ప్రజలు ట్రాఫిక్‌ కష్టాలను ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వారధి నిర్మాణం అంటే ట్రాఫిక్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. 

 

వారధి తాజా పరిస్థితి ఇదీ!

గరుడవారధి నిర్మాణం దాదాపుగా 55శాతం పూర్తయింది. నిర్మాణ టెండరును దక్కించుకున్న ఆఫ్కాన్స్‌ కాంట్రాక్ట్‌ సంస్థ 190 పిల్లర్లు, 158 స్పాన్లతో (ఒక స్పాన్‌ దూరం 40 మీటర్లు)తో పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం 190 పిల్లర్లు, 740 పైలింగ్స్‌ పూర్తిచేసింది. 158 స్మాన్లలో 77 పూర్తికాగా, మరో 78 పెండింగ్‌లో ఉనన్నాయి.  7 కి.మీ వారధి నిర్మాణంలో 3 కి.మీ మేర పూర్తిస్థాయిలో పనులుపూర్తయ్యాయి. మరో 4 కి.మీ పునాది పనులు, సబ్‌ స్ట్రక్చర్‌ పనులు పూర్తయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు బస్టాండు నుంచి అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వరకు వారధిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.


అరాకొరా నిధులిస్తున్నా...

నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నా నిర్మాణ సంస్థ పనులు కొనసాగిస్తూనే ఉంది. అయితే ప్రారంభకాలం నాటి వేగం మాత్రం లేదు. 55శాతం పనులు పూర్తయినా, ఇప్పటివరకు 35 శాతం మాత్రమే నిధులు కాంట్రాక్ట్‌ సంస్థకు అందాయి. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు నుంచి రూ180 కోట్లు విడుదలకాగా,  టీటీడీ రూ25కోట్లు మాత్రమే అందజేసింది. ముందుగా ప్రకటించిన వాటా ప్రకారం రూ458కోట్లు టీటీడీ ఇవ్వాల్సి ఉంది. 



Updated Date - 2021-06-20T06:59:32+05:30 IST