Abn logo
Sep 24 2021 @ 23:23PM

ఈ బాధలు ఇంకెన్నాళ్లు?

వాగులో నుంచి నడుస్తున్న రైతులు

వర్షాలకు కొట్టుకుపోయిన లింగాపూర్‌ చెక్‌డ్యాం కమ్‌ కాజ్‌వే 

రైతులు పొలాలకు వెళ్లాలంటే వాగు దాటడమే శరణ్యం

ఎరువులు, పురుగు మందులను తీసుకెళ్లాలంటే 20 కిలోమీటర్లు తిరగాల్సిందే!


మద్దూరు, సెప్టెంబరు 24 : సిద్దిపేట జిల్లాలోని దూళిమిట్ట మండలం లింగాపూర్‌ గ్రామ శివారులోని వాగుపైన ఉన్న చెక్‌డ్యాం కమ్‌ కాజ్‌వే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నది. దీంతో కాజ్‌వే మీదుగా సుమారు 170 మంది రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో ప్రతి రోజూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని వాగును దాటుతున్నారు. ఇంకెన్నాళ్లు ఈ బాధలు భరించాలని రైతులు మండిపడుతున్నారు. ఎరువులు, పురుగుల మందులు, ఇతర సామగ్రితో కూడిన ఆటోలు, ట్రాక్టర్లు వెళ్లాలంటే చుట్టూ 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాజ్‌వేను మరమ్మతు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా నీటిమూటగానే మారింది. పలుమార్లు రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా గత సంవత్సరం ఇరిగేషన్‌ అధికారులు రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా మరమ్మతు పనులు మాత్రం ప్రారంభం కాలేవు. మరోసారి రూ.2.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా పైల్‌ మాత్రం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 

20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సివస్తోంది

200 గజాల దూరంలోని మా పొలానికి వెళ్లడానికి 20 కిలోమీటర్ల దూరం తిరిగాల్సి వస్తున్నది. శాశ్వత మరమ్మతులు చేపడితే తప్ప రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి. కాలినడకన తీసుకెళ్లాల్సిన కూలీలను ఎక్కువ కూలీ చెల్లిస్తూ ఆటోల్లో తీసుకెళ్లాల్సి వస్తోంది. ఎరువుల బస్తాలను ట్రాక్టర్లలో తరలించాల్సి రావడంతో ఖర్చు తడిసిమోపడువుతున్నాయి. 

- బండి చంద్రయ్య, రైతు

ఏ దేవుడు కరుణిస్తాడో

వాగవతల నాకు మూడెకరాలు ఉంది. నాట్లు వేయాలన్నా, మందు సంచులు తీసుకెళ్లాలన్నా ఆకునూరు, రాంపూర్‌, నర్సాయపల్లి మీదుగా గాగిళ్లాపూర్‌ నుంచి పొలానికి చేరుకోడానికి 20 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. ఇంకెన్నాళ్లీ బాధలు పడాలి. ప్రస్తుతం వాగు ఉధృతి తగ్గినా ప్రాణాలరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. ఏ దేవుడు కరుణిస్తాడో చూడాలి.  

- మీస బాలయ్య, రైతు


వర్షాలకు కొట్టుకుపోయిన కాజ్‌వే