సివిల్స్‌-2020లో మొత్తం పోస్టులెన్ని?

ABN , First Publish Date - 2021-08-02T07:32:22+05:30 IST

సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు-2020కు సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్యను, దివ్యాంగుల హక్కు చట్టం (ఆర్‌పీడబ్ల్యూడీ) ప్రకారం రిజర్వేషన్ల వివరాలను అందజేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

సివిల్స్‌-2020లో మొత్తం పోస్టులెన్ని?

  • దివ్యాంగులకు ఎంత రిజర్వేషన్లు కల్పించారు
  • వివరాలివ్వండి: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 1: సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు-2020కు సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్యను, దివ్యాంగుల హక్కు చట్టం (ఆర్‌పీడబ్ల్యూడీ) ప్రకారం రిజర్వేషన్ల వివరాలను అందజేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సోమవారం లోపు అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు సూచించింది. ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌పీడబ్ల్యూడీ-2016 చట్టం ప్రకారం దృష్టి లోపం, చెవుడు, వినికిడి లోపం వంటి బహుళ సమస్యలు ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పించలేదని ఆరోపిస్తూ దివ్యాంగుల హక్కుల సంఘాలు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు విచారించింది. కేంద్రం తరఫున అభయ్‌ ప్రకాశ్‌ సహాయ్‌ వాదనలు వినిపిస్తూ.. సివిల్స్‌ పరీక్షలకు 836 ఖాళీలను గుర్తించినట్టు తెలిపారు. వీటిలో 251 పోస్టులకు రిజర్వేషన్లు లేవని, మిగిలిన 585 ఖాళీలకు గాను 4 శాతం రిజర్వేషన్లు (24 పోస్టులు) కల్పించినట్టు వెల్లడించారు. కాగా చట్టం ప్రకారం 4 శాతం రిజర్వేషన్లను కల్పించలేదని, లెక్కించడంలో పొరపాటు జరిగిందని దివ్యాంగుల హక్కుల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. నోటిఫికేషన్‌లో మొత్తం 796 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారని, ఇందులో 4 శాతం రిజర్వేషన్లు అంటే 32 పోస్టులు ఉండాలని పేర్కొంది. వాదనలు విన్న అనంతరం.. పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-08-02T07:32:22+05:30 IST