అనుమతిలేని విగ్రహాలను ఎన్ని తొలగించారు

ABN , First Publish Date - 2021-07-22T07:28:58+05:30 IST

రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన, ప్రధాన కూడళ్లవద్ద నిబంధనలకు విరుద్ధంగా నాయకుల

అనుమతిలేని విగ్రహాలను ఎన్ని తొలగించారు

వివరాలతో కౌంటర్‌ వేయండి:హైకోర్టు


హైదరాబాద్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన, ప్రధాన కూడళ్లవద్ద నిబంధనలకు విరుద్ధంగా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోడ్లపై అనుమతిలేని విగ్రహాలను తొలగించాలని కోరుతూ హైదరాబాద్‌ నివాసి ఎం.ఏ.కే. ముఖీద్‌ 2010లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ వాదించారు.


రోడ్ల పక్కన అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని ప్రభుత్వం 2018లో జీవో జారీచేసిందని ఆయన తెలిపారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం...జీవో ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదని, ఆచరణలో పెట్టాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఎన్ని తొలగించారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నామని, ఇక మీదట దీనిపై సుమోటోగా తామే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. సుమోటో వ్యాజ్యంలో రోడ్లు భవనాల శాఖ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులను, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ నాలుగు వారాల్లోగా కౌంటర్లు వేయాలని సీజే హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీచేసింది.


Updated Date - 2021-07-22T07:28:58+05:30 IST