ఇంకెన్నేళ్లు పునరావాసం

ABN , First Publish Date - 2021-07-24T05:12:07+05:30 IST

ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం వారు ఉన్న ఊరిని, అన్నంపెట్టిన పొలాలను ఎంతో ఉదాత్తతో ప్రాజెక్టు కోసం ఇచ్చేశారు. అయినా వారి త్యాగాలకు విలువలేకుండా పోయింది. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చిన సర్కారు పునరావాసం విషయంలో నిర్లక్ష్యం పదర్శిస్తోంది. దీంతో కొన్నిగ్రామాల నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇంకెన్నేళ్లు పునరావాసం
ధేనువకొండ గ్రామం వ్యూ

 గుండ్లకమ్మ నిర్వాసితులపై అధికారుల నిర్దయ

15 ఏళ్లుగా పూర్తికాని ఇళ్ల పట్టాల పంపిణీ

ఇంకా వందలాది మందికి పెండింగ్‌

పునరావాస కాలనీల్లోనూ కనీస వసతులు కరువు

ముంపు పేరుతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు పుల్‌స్టాప్‌

ఇక్కడ ఉండలేక.. అక్కడికి వెళ్లలేక ప్రజలు సతమతం

అద్దంకి, జూలై 23 : 

సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది.. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల్లోని కొన్నింటి విషయంలో యంత్రాంగం అలవిమాలిన అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సర్వం వదులుకొనేందుకు సిద్ధపడిన నిర్వాసితులపై నిర్దయ చూపుతోంది.  వారి సమస్యలను పరిష్కరించి వెంటనే పునరావాస కాలనీలకు తరలించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా వారిని సమస్యల్లో ముంచుతున్నారు. మరోవైపు ముంపు పేరుతో వారు ఉంటున్న గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులను నిలిపివేసి నరకం చూపుతున్నారు. 


ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం వారు ఉన్న ఊరిని, అన్నంపెట్టిన పొలాలను ఎంతో ఉదాత్తతో ప్రాజెక్టు కోసం ఇచ్చేశారు. అయినా వారి త్యాగాలకు విలువలేకుండా పోయింది. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చిన  సర్కారు పునరావాసం విషయంలో నిర్లక్ష్యం పదర్శిస్తోంది. దీంతో కొన్నిగ్రామాల నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 2003లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2008లో సీఎంగా ఉన్న వైఎస్సార్‌ దానిని ప్రారంభించారు. రిజర్వాయర్‌ కింద 12 ముంపుగ్రామాలుగా గుర్తించారు. వాటిలో మద్దిపాడు మండలంలోని చిన్నమల్లవరం, ఘడియపూడి, గార్లపాడు, బూరేపల్లి, అన్నంగి, కొరిశపాడు మండలంలోని తమ్మవరం, అనమనమూరు, యర్రబాలెం, అద్దంకి మండలంలోని ధేనువకొండ, మణికేశ్వరం, తిమ్మారెడ్డిపాలెం, పాతకొటికలపూడి ఉన్నాయి. అయితే పునరావాసం విషయంలో అధికారుల నిర్లక్ష్యం పలు గ్రామాల నిర్వాసితులకు కష్టాలు తెచ్చిపెట్టింది. కొన్ని గ్రామాల వారికి కాలనీలు ఏర్పాటుచేయడంతో వారు అక్కడికి వెళ్లిపోయారు. మరికొన్ని గ్రామాల నిర్వాసితులు వివిధ సమస్యలతో పునరావాస కాలనీలకు వెళ్లలేకపోయారు. ధేనువకొండ, అనమనమూరు గ్రామాల వారు పాక్షికంగా ఖాళీచేయగా... మణికేశ్వరం, తిమ్మారెడ్డిపాలెం, యర్రబాలెంకు చెందిన నిర్వాసితులు మాత్రం ఇంకా ఆ గ్రామాల్లోనే ఉంటున్నారు. ముంపుగ్రామాలు కావడంతో ఇటు అభివృద్ధి పనులకు నోచుకోక, ఇటు పునరావాస చర్యలు పూర్తికాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


పూర్తికాని ఇళ్ల పట్టాల పంపిణీ

ధేనువకొండలో మొత్తం 2వేల కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకూ 1700 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరో 300మందికి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మణికేశ్వరంలో సుమారు 800 కుటుంబాలు ఉండగా వారిలో 500 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మరో 300 మందికి ఇవ్వాల్సి ఉంది. యర్రబాలెంలో కూడా సుమారు 40మందికి ఇళ్లస్థలాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలాఉండగా యర్రబాలెం, మణికేశ్వరం, తిమ్మారెడ్డిపాలెం గ్రామాల్లో మాత్రం ఒక్క కుటుంబం కూడా పునరావాస కాలనీకి వెళ్లలేదు. అక్కడ పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడం ఇందుకు కారణమైంది. ఇదిలా ఉండగా 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వే చేసిన సమయంలో పలువురు మైనర్లుగా ఉండటంతో వారికి ఇళ్ల స్థలాలు  కేటాయించలేదు. ఇప్పుడు వారికి వివాహాలు అయి సంతానం కూడా కలగటంతో వేరు కాపురాలుగా ఉంటున్నారు. వారు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. ఇలా పట్టాలు ఇవ్వని వారితోపాటు, మిగిలిన వారు కూడా ముంపుగ్రామాల్లోనే ఉంటున్నారు. 


ముంపు గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులు

 ధేనువకొండ, మణికేశ్వరం, తిమ్మారెడ్డిపాలెం, యర్రబాలెం ప్రజలు ఆ గ్రామాల్లోనే ఉంటున్నారు.  అవి ముంపు గ్రామాలు కావడంతో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. కనీసం వీధిలైట్లు, రోడ్లు, సైడ్‌ డ్రైన్‌లు కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. మరోవైపు పునరావాస కాలనీల్లో కూడా కనీస వసతులు కరువయ్యాయి. అక్కడికి వెళ్లిన పలు గ్రామాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు పలు కాలనీల వద్ద శ్మశానాలు కూడా లేక సుదూర ప్రాంతాల్లో ఉన్న పాత గ్రామాలకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ధేనువకొండ వాసులకు సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న అద్దంకి సమీపంలో రెండు పునరావాసకాలనీలు ఏర్పాటు  చేశారు. దీంతో కుటుంబ సభ్యులు  మృతి  చెందినప్పుడు ధేనుకకొండకు తీసుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతమయ్యాయి.  దీంతో ప్రజలు పునరావాసకాలనీలకు వెళ్లలేక, ముంపు గ్రామాల్లో ఉండలేక ఇబ్బంది పడుతున్నారు.


ఇల్లు  శిథిలమై ఇబ్బంది  పడుతున్నాం:

-సోమా సుబ్బాయమ్మ, మణికేశ్వరం, అద్దంకి మండలం

ఇల్లు పూర్తిగా శిథిలమైంది. చిన్నపాటి  వర్షం  కురిసినా ఇంట్లో ఉండే వీలు లేకుండా పోతోంది. ఎప్పుడు కూలుతుందో కూడా అర్థం కావడం లేదు. పునరావాసకాలనీకి వెళ్దామంటే ఇంకా పూర్తిగా వసతులు  కల్పించ లేదు.


ఇల్లు కట్టుకోవడం భారంగా మారింది: 

-కోటిరెడ్డి, మణికేశ్వరం

గతంలో  ఎప్పుడో  ఇళ్లకు పరిహారం ఇచ్చినా  కుటుంబ  అవసరాల  కోసం  ఖర్చయ్యాయి. ఇప్పుడు  పునరావాస కాలనీలో ఇల్లు నిర్మించుకోవడం భారంగా మారింది. ప్రభుత్వం జగనన్న ఇల్లు మంజూరు చేసి అధిక నిధులు కేటాయించాలి.


ఇంకా చాలామందికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు

-సుబ్బారెడ్డి, మణికేశ్వరం

గ్రామంలో ఇంకా చాలా మందికి పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పునరావాసకాలనీకి వెళ్లే అవకాశం ఉంటుంది





Updated Date - 2021-07-24T05:12:07+05:30 IST