ఎంత దారుణం

ABN , First Publish Date - 2021-05-08T07:07:57+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి కన్నెర్రతో నిత్యం వేలల్లో పాజిటివ్‌లు జిల్లాపై దండెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ బాధితులతో ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లు నిండిపోతున్నాయి. కొత్తగా వచ్చే బాధితులకు ఒక్క పడక కూడా దొరకని పరిస్థితి.

ఎంత దారుణం
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు వార్డుల్లో బెడ్‌లు సరిపోకపోవడంతో ఆసుపత్రి వరండాలో బెడ్‌లు వేసి వైద్య సేవలు అందిస్తున్న దృశ్యం

  • పోటెత్తుతున్న బాధితులతో కొవిడ్‌ ఆసుపత్రులన్నీ కిటకిట 
  • బెడ్లు దొరక్క జనం నరకయాతన
  • ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రుల దందా 
  • అనుమతిలేకున్నా భారీగా అడ్మిషన్లు
  • తెలియక లక్షలకు లక్షలు చెల్లించి చేరుతున్న బాధితులు
  • శుక్రవారం జిల్లాలో 1,823 కేసులు నమోదు.. 8 మంది కొవిడ్‌తో మృతి
  • ఎట్టకేలకు జిల్లాకు ఆరు వేల కొవాగ్జిన్‌ టీకాలు రాక.. సోమవారం నుంచి పంపిణీ
  • పలు నియోజకవర్గాల్లో వైసీసీ సానుభూతిపరులకే టీకా కూపన్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ మహమ్మారి కన్నెర్రతో నిత్యం వేలల్లో పాజిటివ్‌లు జిల్లాపై దండెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ బాధితులతో ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లు నిండిపోతున్నాయి. కొత్తగా వచ్చే బాధితులకు ఒక్క పడక కూడా దొరకని పరిస్థితి. దీంతో అనేక మంది కాకినాడ జీజీహెచ్‌ మొదలు ఇతర ప్రైవేటు ఆసుపత్రుల ముందు పడకల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొన్ని ఆసుపత్రులు దందాకు తెరలేపాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు అనుమతి లేకపోయినా గుట్టుచప్పుడు కాకుండా కొవిడ్‌ బాధితులను చేర్చుకుని చికిత్స చేస్తున్నాయి. లక్షలకులక్షల్లో పిండేస్తున్నాయి. బయట ఎక్కడా పడక దొరకని పరిస్థితి నేపథ్యంలో తమ వారు చనిపోయేకంటే ఎక్కడోదగ్గర చేర్చి బతికించుకుందామనే ఆలోచనతో వీటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో అవన్నీ ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో శుక్రవారం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి 84 ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు అనుమతులున్నాయి. అయితే వీటిలో అన్ని పడకలు నిండిపోయాయి. ఎక్క డకు వెళ్లినా బెడ్‌ లేదనే సమాధానం వస్తోంది. ఒకవేళ ఉన్నా ఉన్నతస్థాయిలో పైరవీలు చేయించుకుంటేనేగాని చోటు దొరకడం లేదు. ఈనేపథ్యంలో జిల్లాలో కోనసీమ,రామచంద్రపురం, మండపేట, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజమహేంద్రవరం రూరల్‌, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, పిఠాపురం ఇలా అనేక నియోజకవర్గాల్లో కొవిడ్‌ చికిత్సకు అనుమతి పొందని ఆసుపత్రులు గట్టుచప్పుడు కాకుండా బాధితులను చేర్చుకుని చికిత్స అందిస్తున్నాయి. ఇందుకు లక్షలకులక్షలు వసూలు చేస్తున్నాయి. ఒకవేళ అనుమతి లేదని ఎవరైనా అడిగితే రెండు రోజుల్లో వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. విషయం తెలియక అనేక మంది గ్రామీణ, పట్టణ ప్రాంత బాధితులు వీటిలో చేరుతున్నారు. తీరా వైద్యం చేయలేక ఆఖరినిమిషంలో వేరే ఆసుపత్రికి తరలించాలని కొన్ని ఆసుపత్రులు చెబితే..  మరికొన్ని ప్రయత్నం చేశాంగానీ.. బతకలేదు.. అంటూ సమాధానం చెబుతున్నాయి. అయితే వీటిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో యథేచ్ఛగా ఈ దందా జరిగిపోతోంది. కాగా జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,823 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,979కు చేరుకోగా, యాక్టివ్‌ కేసులు 20,924 మందిగా తేలారు. అటు కొవిడ్‌తో జిల్లావ్యాప్తంగా శుక్రవారం 8 మంది చనిపోగా, మొత్తం మరణాలు 753గా తేలాయి. కాగా శుక్రవారం నాటి పాజిటివ్‌ బాధితుల్లో 1,823 మందిని హోంఐసోలేషన్‌కు పరిమితం చేశారు. కాగా అత్యధికంగా కాకినాడ 162, కాకినాడ రూరల్‌ 47, రాజమహేంద్రవరం 131, రాజమహేంద్రవరం రూరల్‌ 34, రామచంద్రపురం 54, అల్లవరంలో 92, అమలాపు రం 34, అంబాజీపేట 38, ఆత్రేయపురం 31, బిక్కవోలు 23, గొల్లప్రోలు 76, కె.గంగవరం 42, కరప 20, కొత్తపల్లి 50, కొత్తపేట 29, మలికిపురం 61, మామిడికుదురు 38, పెద్దాపురం 44, పిఠాపురం 79, రాయవరం 58, సఖినేటిపల్లి 52, సామర్లకోట 62,తొండంగి 22, తుని 38, ఉప్ప లగుప్తం 46, ఏలేశ్వరం 49 చొప్పున నమోదయ్యాయి.

కొవాగ్జిన్‌ వచ్చింది...

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొవాగ్జిన్‌ టీకా ఎట్టకేలకు జిల్లాకు స్వల్పస్థాయిలో వచ్చింది. ఆరు వేల డోసులు జిల్లాకు చేరాయి. ఇప్పటికే మొదటి డోసు తీసుకుని రెండో డోసు కోసం భారీస్థాయిలో ఎదురుచూస్తున్న తరుణంలో తక్కువ డోసులు ఎలా పంపిణీ చేయాలనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం కూపన్లు పంచి సోమవారం నుంచి అందించాలని నిర్ణయించారు. అటు కొవీషీల్డ్‌ 12 వేల డోసులు జిల్లాకు చేరింది. కాగా టీకాల పంపిణీలో తొక్కిసలాట జరుగుతున్న నేపథ్యంలో రంగుల కూపన్ల విధానం కలెక్టర్‌ ప్రారంభించారు. ఒక్కో గ్రామంలో గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లకు ఈ కూపన్లు రోజుకు ఇద్దరికి చొప్పున జనానికి పంపిణీ చేయిస్తున్నారు. కానీ పలుచోట్ల వైసీపీ నేతల ఒత్తిళ్లతో కేవలం ఆ పార్టీ సానుభూతిపరులకే వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు.

నేడు వ్యాక్సిన్‌ పంపిణీ నిలుపుదల : జేసీ 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే7: ఫ్యూమిగేషన్‌, శానిటైజేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున జిల్లాలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఈనెల 8వ తేదీ శనివారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పంపిణీ నిలుపుదల చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి తెలిపారు. అందువల్ల జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేశారు.

Updated Date - 2021-05-08T07:07:57+05:30 IST