మూడో దశలో పిల్లలకు పెను ప్రమాదం.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ABN , First Publish Date - 2021-06-12T18:50:18+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ రోజు రోజుకీ అంతుపట్టకుండా మార్పులు చెందుతోంది.

మూడో దశలో పిల్లలకు పెను ప్రమాదం.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

  • పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి
  • పరిశోధన ఫలితాలు వెల్లడించిన 
  • నిట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పెరుగు శ్యామ్‌

హైదరాబాద్ సిటీ/నిట్‌క్యాంపస్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ రోజు రోజుకీ అంతుపట్టకుండా మార్పులు చెందుతోంది. మొదటి దశలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధుల వరకే పరిమితమైన వైరస్‌ రెండో దశలో వేరియంట్‌లను మార్చుకుంటూ యువతపై కూడా పంజా విసిరింది. దాన్ని మరవకముందే మూడో దశ రూపంలో ముప్పు పొంచిఉందంటూ హెచ్చరిస్తున్నారు వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌)కు చెందిన బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పెరుగు శ్యామ్‌. కరోనా వైరస్‌ దాని పరిణామాలపై రూ.2 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిట్‌లో ఏడాదిగా ఆయన పరిశోధనలు జరుపుతున్నారు. శుక్రవారం పెరుగు శ్యామ్‌ తన పరిశోధనను వెల్లడించారు. మొదటి దశలో కంటే రెండో దశలో వైరస్‌ వివిధ వేరియంట్స్‌గా రూపాంతరం చెందడంతో రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపి, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయన్నారు. 


ఇప్పటి వరకు 40 రకాల స్ర్టెయిన్‌లను గుర్తించగా 20 రకాల స్ట్రెయిన్‌లపై పరిశోధన జరుగుతోందనీ, మరి కొన్ని రకాల స్ర్టెయిన్‌లు అక్కడక్కడా కనిపిస్తున్నాయన్నారు. వియత్నాం, బ్రెజిల్‌, యూకే వంటి దేశాలలో మూడో, నాలుగో దశలో వైరస్‌ మ్యూటేషన్‌ చెందాయి. మహారాష్ట్ర, కోల్‌కత్తా, పలు ప్రాంతాల్లో మూడో దశ ఆనవాళ్లు కనిపించినా సరైన ఆధారాలు లేవని అందుకు స్ట్రెక్‌ ప్రోటీన్‌ విభిన్న వేరియంట్స్‌గా రూపాంతరం చెందడమే కారణమన్నారు. స్ట్రెక్‌ ప్రోటీన్‌లలో ఉన్నటువంటి అమోనో యాసిడ్స్‌ మార్పు చెందడం వల్ల వివిధ రకాలు వేరియంట్స్‌గా మ్యూటేషన్‌ చెందుతున్నాయని తెలిపారు. ఒకసారి ఉత్పరివర్తనం చెందిన వైర్‌సలు డబుల్‌, ట్రిబుల్‌ వేరియంట్లుగా మార్పు చెందుతున్నాయన్నారు.


రెండు డబుల్‌ మ్యూటేషన్‌లు కలవడం వలన వచ్చేదే హైబ్రిడ్‌ వేరియంట్‌ అని.. దీని వలన జరిగే నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో బీ.1.617.2 వేరియంట్‌తో పాటు బీ.1.1.28.2 అనే వేరియంట్‌తో కలిసి హైబ్రిడ్‌ మ్యూటేషన్‌గా రూపాంతరం చెందుతుందన్నారు. ఇది చాలా ప్రమాదకర అంశమని తెలిపారు. థర్డ్‌ వేవ్‌లో లక్షణాలు అందరికీ ఒకే లాగా ఉండవన్నారు. తీవ్రమైన గొంతు, కడుపు, కండరాల నొప్పులు, దగ్గు, జలుబు, దద్దుర్లు, కంటిలో దురద, ఎర్ర పడటం, శరీర అవయవాలు వాపుకు గురి కావటం వంటి లక్షణాలతో బాధపడుతారన్నారు. మూడవ దశలో పిల్లలకు పెను ప్రమాదం ఉంటుందని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యుల సూచనలు పాటించాలన్నారు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కరోనా ఏ విధమైన వేరియంట్‌తోనైనా దాడి చేయక ముందే మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ప్రతీ రోజు తాజా పండ్లు, అధికంగా న్యూట్రిన్స్‌ ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి, వ్యాయామం, సరిపడినంత నిద్ర అవసరం. మూడవ దశలో 3-15 సంవత్సరాల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మాస్కులు, శానిటైజర్‌లు వాడడం, భౌతిక దూరం పాటించటంపై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు.



Updated Date - 2021-06-12T18:50:18+05:30 IST