ఆయుర్వేదంతో ఎంత సాధ్యం?

ABN , First Publish Date - 2021-06-20T19:22:37+05:30 IST

ఆయుర్వేదాన్ని చిన్నచూపు చూడటం అంటే మన కళ్లను మనమే పొడుచుకోవడం లాంటిది..

ఆయుర్వేదంతో ఎంత సాధ్యం?

ఆయుర్వేదాన్ని చిన్నచూపు చూడటం అంటే మన కళ్లను మనమే పొడుచుకోవడం లాంటిది. వందల ఏళ్ల  నుంచీ వస్తున్న ప్రకృతి వైద్యం ఆయుర్వేదం. కరోనాకు కేవలం అల్లోపతే అంతిమం అని భావించకుం డా ప్రత్యామ్నాయ వైద్యవిధానాల వైపు వెళితే తప్పులేదు. విచిత్రమేంటంటే ఆయుర్వేదంపై పాశ్చాత్య దేశాల్లో ఆసక్తికర పరిశోధనలు, విలువైన చికిత్సలు జరుగుతున్నాయిప్పుడు. కరోనా చికిత్సలో ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది? దీనికున్న పరిమితులు ఏమిటి? చూద్దాం...


భారతదేశంలో అనేక వైద్య విధానాలు శతాబ్దాలుగా అమలులో ఉన్నాయి. Pluralistic health care system మనది. మన శరీరాలు వాటికి అలవాటుపడి ఉన్నాయి. ఆయుర్వేదం అనేది ఒక జీవన విధానం. పుట్టిన నాటి నుండీ కడదాకా ఆయుర్వేదం చెప్పినట్లే జీవిస్తున్నాం. అన్నం వండటం దగ్గర నుంచీ తినటం వరకు ప్రతీదీ ఆయుర్వేదానుసారంగానే చేస్తున్నాం. దాన్ని కాదని, ఇప్పుడు కొందరు వాణిజ్యవేత్తల చేతులకు దేశప్రజలందరి ఆరోగ్యాన్ని అప్పగించారు. వైద్యం వ్యాపారంగా మారింది. ఆయుర్వేద శాస్త్రానికి స్వస్థుడి ఆరోగ్యాన్ని కాపాడటం మొదటి కర్తవ్యం కాగా, అస్వస్థుడి వ్యాధిని తగ్గించటం రెండవ కర్తవ్యం. వ్యాధి వచ్చాక మందులు వెదుక్కోవటం కన్నా అది రాకుండా ముందు జాగ్రత్త పడటం ఉత్తమం కదా!. 


ఈ చికిత్సకూ ఒక సూత్రం..

కరోనాకు నివారణ, నిర్ధారణ, నిరోధం ఈ మూడూ కీలకం. వ్యాధి రాకుండా రోగిబలాన్ని (ఓజస్‌-ఇమ్యూనిటీ) పెంచడాన్ని నివారణ అంటారు. అయినా వైరస్‌ తీవ్రత కారణంగా ఒక్కోసారి వ్యాధి సోకవచ్చు. రోగబలాన్ని, రోగి బలాన్నీ, శరీరంలో దోషధాతువుల పరిస్థితిని అంచనా వేయటాన్ని నిర్ధారణ (నిదానం - డయగ్నోసిస్‌) అంటారు. రోగబలాన్ని తగ్గించి, రోగిబలాన్ని పెంచటం ద్వారా వ్యాధిని గెలవటాన్ని (చికిత్స) నిరోధం అంటారు. ఆయుర్వేదానికి నివారణ, నిర్ధారణ, నిరోధం మూడూ ముఖ్యమైనవే!. 


కరోనా విషయంలో వ్యక్తుల ఆరోగ్యాన్ని సంరక్షించి, శరీర బలాన్ని పెంచేవిగా, వ్యాధి తగ్గిన వారికి ఆరోగ్యాన్ని పునరుద్ధరించేవిగా, ప్రధాన చికిత్సకు సహాయకారిగా, స్వల్ప లక్షణాలను ((mild to moderate)  తగ్గించేవిగా, దగ్గు, జలుబు, ఆయాసం, అజీర్తి, అన్నం సహించక పోవటం, కడుపునొప్పి, నీరసం, నిస్సత్తువ లాంటి అనుబంధ లక్షణాల్ని పోగొట్టేవిగా, స్టెరాయిడ్లు ఇతర ఔషధాల వాడకం వల్ల కలిగిన అపకారాలను సరిచేసేవిగా ఆయుర్వేద ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయి. 


ఆ ‘తొమ్మిది’ ప్రాణాంతం 

కరోనా సోకిన వ్యక్తుల్లో 9 రకాల వ్యాధులున్న వారికి ప్రాణాపాయ స్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. షుగరు, బీపీ, ఊపిరితిత్తుల వ్యాధులు (COPD), గుండె, మెదడు జబ్బులు, ‘హెపటైటిస్‌ బి’, కేన్సరు, మూత్రపిండాలు, ఇమ్యూనిటి సంబంధ వ్యాధులు.. ఈ తొమ్మిదీ ఉన్నవారికి కరోనా ఎక్కువ ప్రమాదకరం. ఈ వ్యాధులున్నవారు ఆయుర్వేద సహకారం తీసుకుంటే కరోనా ముప్పు తప్పుతుంది. కొవిడ్‌ ఉపద్రవాలు ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో సమస్యలు, ఫైబ్రోసిస్‌, తీవ్రమైన నిస్సత్తువలు తగ్గి, ఇమ్యూనిటీ పెరగటానికి ఆయుర్వేదం తోడ్పడుతుంది. ఆక్సిజన్‌ అవసరమైన ఒక రోగికి ఆయుర్వేద ఔషధాలతో తగ్గించిన PMC (అమెరికన్‌ జాతీయ వైద్య గ్రంథాలయం, జాతీయ ఆరోగ్య సంస్థ) ప్రచురించిన ((https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7553124) నివేదికలో ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయి. మనమే పట్టించుకోవటం లేదు. ఆయుర్వేదానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 


దేశీయులకు దేశీ వైద్యం

ఏ దేశం వారికి ఆ దేశంలో దొరికే వనమూలికలే ఉత్తమ ఔషధాలుగా పనిచేస్తాయన్నది ఆయుర్వేద సిద్ధాంతం. చైనా, జపాన్‌, ఉత్తర కొరియా, కెనడా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో కూడా మూలికా విఙ్ఞానాన్ని సంగ్రహించి పరిరక్షిస్తున్నారు. కెనడాలో ఇప్పటికీ అనేక వనమూలికల కషాయాలను ఔషధాలుగా తీసుకుంటున్నారు. మచ్చుకు ఈ ఉదాహరణలు చూడండి: 

బల్సామ్‌ ఫిర్‌ మొక్క కషాయం టీబీ, ఇతర ఊపిరితిత్తుల లక్షణాలకు, యారో (Achillea millefolium) అనే మొక్కని లివరు రక్త దోషాలను తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. Acorus americanus అనే గడ్డి జాతి మొక్కని ఊపిరితిత్తుల జబ్బుల నివారణకు, Alders మొక్కని శరీరంలో నీరు లాగేసేందుకు అక్కడి ప్రజలు వాడుతున్నారు.Wormwood  అనే మొక్క దగ్గు, జలుబు కఫం ఆయాసం తగ్గించే ఔషధంగా ప్రాచుర్యం పొందింది. ఆ దేశంలో పెరిగే అడవి అల్లం దుంపని తలనొప్పి, జ్వరం, పొంగు, ఇతర వైరస్‌ వ్యాధులు, దగ్గు, జలుబు, ఆయాసం, రక్తస్రావం లాంటి వ్యాధుల్లో నేటికీ వాడుతున్నారు. ‘రెడ్‌విల్లో’ అనే మొక్కని వ్రణాలు, గాయాలు, ఇన్‌ఫెక్షన్లు, బ్యాక్టీరియా వైరస్‌ దోషాల మీద ఉపయోగిస్తున్నారు. Heracleum maximum అనే మొక్కని అలాగే, జునిపర్స్‌ అనే మొక్కని వాపులు, గడ్డలు, శ్వాస ఇబ్బందులు, కీళ్లవాతం, తలనొప్పి, మూత్రపిండాల సమస్యల్లో వాడతారు. అక్కడ కూడా పుదీనా ఆకుల్ని టీ కాచుకుని దగ్గు జలుబు, జీర్ణకోశ సమస్యల్లో వాడే అలవాటుంది.


కెనడాకూ ఉందొక తులసి.. 

మనకు తులసిమొక్క లాగా కెనడా వారికి డెవిల్స్‌ క్లబ్‌ మొక్క పవిత్రమైనది. ప్రతికూల ప్రభావాలు పోతాయని వారి నమ్మిక. కీళ్లవాత వ్యాధుల్లో నొప్పి, వాపులను తగ్గించే ఔషధంగా దీన్ని వాడతారు. స్పూస్రెస్‌ అనే మొక్క కూడా ఇలానే కీళ్లవాత వ్యాధుల మీద పనిచేస్తుంది. చెర్రీ మొక్కల బెరడుని దగ్గు జలుబులకు ఔషధంగా వాడతారు. ఇప్పుడు వీటన్నింటిపైనా కరోనా నివారణ కోణంలో పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. అయితే భారతదేశంలో ఇందుకు వ్యతిరేకమైన వాతావరణం నెలకొంది. ఒకప్పుడు మనకెంతో విలువైన ఆయుర్వేద విజ్ఞాన సంపదను  పూర్వీకులు అందించి వెళ్లారు. అలాంటి ఔషధ చికిత్స పట్ల చిన్నచూపు మొదలైంది. దేశీయతని కించపరచి, విదేశీ వ్యామోహాన్ని తెచ్చి రుద్దటం ద్వారా వాణిజ్య ప్రయోజనాలను పొందటమే లక్ష్యంగా కరోనా చికిత్స సాగుతోంది. ప్రత్యామ్నాయ వైద్య విధానాలపైకి దృష్టి పోవడం లేదు. ఇది మంచి పరిణామం కాదు. 


శాస్త్ర గ్రంథాలే ప్రమాణం.. 

ఆయుర్వేద ఔషధాలకు ప్రమాణం శాస్త్ర ్త్రగ్రంథాలే! వాటిని చదువుకుని, అనుసరించి చికిత్స చేసే అనుభవం ఉన్నవారికి మాత్రమే వాటి పని సమర్థత గురించి మాట్లాడే అధికారం ఉంటుంది. బ్రిటిష్‌ వారి చేతికి దేశ భవిష్యత్తు హస్తగతం అయిన నాటి నుండి ఈ రోజువరకూ గత 300 యేళ్లుగా ఆధునిక శాస్త్ర సాంకేతిక అంశాలేవీ ఆయుర్వేదానికి అందించలేదు. పాలకులు ఆ విషయాన్నే విస్మరించారు. కొవిడ్‌-19కు సహాయ చికిత్సా విధానంగా కూడా ఆయుర్వేదాన్ని రానీయకుండా ఉపేక్షించారు. ‘‘నిరూపణ కాలేదు కదా’’ అనే కుంటి సాకు ఒక అలవాటుగా మారింది. ఆయుర్వేద శాస్త్ర ప్రమాణాలకు ఎవరి నిరూపణ కావాలి? ఆయుర్వేద శాస్త్రంలో ఒక ద్రవ్యానికి చెప్పిన గుణధర్మాలు దానికి లేవని నిరూపించినప్పుడు మాత్రమే ఈ వైద్యాన్ని అడ్డుకోగలిగే హక్కు ఉంటుంది. సమీరపన్నాగ రసం, బృహత్‌ కస్తూరి భైరవి, శ్వాసానంద గుటిక, శీతాంశురసం లాంటి రస ఔషధాలు వైద్య పర్యవేక్షణలో వాడుకునే మందులు అనేకం ఉన్నాయి. కానీ, ప్రజలు స్వంతంగా వాడుకోదగిన మూలికా ఔషధాలలో కొన్నింటిని మాత్రమే పరిచయం చేస్తున్నాను.


ఆ రాష్ట్రం పంపిణీ చేస్తోంది..

యష్టిమధు అనే మొక్క వేరుని ‘అతిమధురం’ అంటారు. తల, మెదడులలో వచ్చే కేన్సర్‌ వ్యాధిలో రేడియేషన్‌ తరువాత ఏర్పడే సమస్యలను తగ్గించే అతి తియ్యని మందు ‘అతి మధురం’. దీన్ని ‘జీవనీయం’ అని పిలుస్తారు. నిస్సత్తువని, దప్పికను పోగొడుతుంది. రక్తస్రావాన్ని ఆపుతుంది. అరికాళ్లు, అరిచేతుల్లో మంటల్ని తగ్గిస్తుంది. కంఠంలో ఏర్పడే sore throat లాంటి సమస్యలను పోగొడుతుంది. గాయకులు ‘అతి మధురం’ చిన్నముక్కని బుగ్గన పెట్టుకుంటారు. గొంతు శ్రావ్యంగా ఉంటుందని!. పోషక ద్రవ్యాలలో అతిమధురం ముఖ్యమైనది. త్రిదోషాలనూ పోగొడుతుంది. వాపుని తగ్గించే గుణం కూడా ఉంది. నరాల పటుత్వాన్ని కలిగిస్తుంది. ఇందులో గ్లిజరైజిన్‌ అనే కాంపౌండ్‌ ఉంది. ఇదే దీనికి తీపి రుచినిస్తోంది. 

ఆయుర్వేద ఔషధ దుకాణాల్లో యష్టిచూర్ణం టాబ్లెట్లు, చూర్ణం రెండూ దొరుకుతున్నాయి. రెండు బిళ్లలు చొప్పున రెండు పూటలా వేసుకుంటే పేగుపూత, ఎసిడిటీ, మానసిక ఉద్వేగాలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. కొవ్వు తగ్గుతుంది. లివర్‌, స్పైన్‌, పాంక్రియాజుల్ని బలసంపన్నం చేస్తుంది. చర్మాన్ని మృదువు పరుస్తుంది. అదనపు కొవ్వును దహనప్రక్రియ ద్వారా తగ్గించి స్థూలకాయాన్ని అదుపు చేస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు వాడుకోవచ్చు. 

2021 ఏప్రిల్‌ 5న డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక ‘అతిమధురం’ అనేది కొవిడ్‌ నివారణకు ఒక గొప్ప ఔషధంగా ఋజువు కానున్నదని ఒక కథనాన్ని ప్రచురించింది. ఏప్రిల్‌ 18న హిమాచల్‌ప్రదేశ్‌ ఆయుష్‌ శాఖ లక్షన్నర మందికి ‘మధుయష్ట్యాది కషాయం’ ఉచితంగా పంపిణీ చేసి ఫలితాలు అనుకూలంగా ఉన్నట్టు ప్రకటించింది. 

sore throat జర్నల్‌లో కరోనా వ్యాధిపైన అతిమధురం ప్రభావం గురించి చాలా నివేదికలున్నాయి.  broad-spectrum antiviral agent (bsaa) గా దీన్ని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఎసిడిటీని తగ్గించే ఆధునిక ఔషధాలలో దీనిని చేరుస్తుంటారు.


లివర్లో వచ్చే హెటరో వైరస్‌లు, పేగుల్లో వచ్చే ఎంటరో వైరస్‌లు, సార్స్‌ - కొవిడ్‌ వైరస్‌లు, ఫ్లూ వైరస్‌ల పైన దీని ప్రభావం ఉంది. ఇది ఇప్పటికే రుజువైన వైరస్‌ సంహారి. ఊపిరితిత్తుల్లో, జీర్ణకోశంలో ఏర్పడే సమస్యలకు ఇతర ఔషధాలతో పాటు దీన్ని వాడవచ్చు. అయితే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అతి తీపి వలన వాంతి అయ్యేలా చేస్తుంది. 250 గ్రా. త్రిఫలా చూర్ణాన్ని 50-75 గ్రా. యష్టి చూర్ణాన్ని కలిపి ఒక సీసాలో భద్రపరచుకుని రోజూ రెండు పూటలా ఒక గ్లాసు పాలలో అరచెంచా మోతాదులో కలిపి తాగితే మేలు చేస్తుంది.




తిప్పతీగలో ఏముంది?

ఆయుర్వేదంలో తిప్పతీగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కరోనా వైద్య నేపథ్యంలో ఈ తీగల మొక్క మరోసారి చర్చకు వచ్చింది. చేదు-వగరు కలిగి, విష దోషాలను హరించే ద్రవ్యంగా తిప్పతీగ పనిచేస్తుంది. ధాతువృద్ధిని కలిగిస్తుంది. కాబట్టి, దీన్ని ఆయుర్వేద గ్రంథాలు ‘రసాయనం’ అన్నాయి. అంటే శరీర ధాతువులను పెంచి, వృద్ధాప్యాన్ని అడ్డుకునే ఔషధంగా చెప్పాయి. 


తిప్పతీగ విరేచనాల్ని ఆపుతుంది (సంగ్రాహి), బలకరం (బల్యం), జీర్ణశక్తి పెంచుతుంది (అగ్నిదీపని), దప్పికను పోగొడుతుంది (తృష్ణానాశకం), త్రిదోషాలనూ హరిస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. కొవ్వు తగ్గిస్తుంది, చంటిపిల్లల నుండీ వయో వృద్ధుల దాకా అందరికీ ఇవ్వదగిన నిరపాయకర ఔషధం ఇది. ముఖ్యంగా షుగరు, బీపీ ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువ. ఈ ఏడాదిన్నర కరోనా కాలంలో చాలామంది తిప్పతీగ ఆకులు సేకరించుకుని టీ కాచుకోవటం, నూరి రసం తాగటం చేస్తున్నారు. దీన్ని వాడుకోవటానికి ఎవరి అనుమతులూ అవసరం లేదు. ఆయుర్వేద శాస్త్రగ్రంథాలే ఇందుకు ప్రమాణం. 


కరోనా తొలిదశలో ‘సంశమనీవటి’ జ్వరహరంగా పనిచేస్తుంది. కరోనా వచ్చినప్పుడు జ్వరం శమిస్తుంది. వేడి తగ్గుతుంది.. రోగిబలాన్ని (ఇమ్యూనిటీ) పెంచుతుంది. సూక్ష్మజీవి నాశకంగా పని చేస్తుంది. జీర్ణాశయ వ్యవస్థని బలసంపన్నం చేస్తుంది. ఈ మాత్రల్ని 500 మి.గ్రా చొప్పున రెండు పూటలా వేసుకోవచ్చు. గుడూచీ సత్వం (తిప్పసత్తు) ముప్పావు చెంచా మోతాదు వేడిపాలలో కలిపి తీసుకుంటే జ్వరం వెంటనే దిగుతుంది. తిప్పతీగ ప్రకృతి ప్రసాదించిన వ్యాధి నివారక ఔషధాలలో ముఖ్యమైంది. ఇమ్యూనిటీ బూస్టర్‌ అన్నమాట.


కరోనా వ్యాధిగ్రస్తుల్లో దగ్గు మరొక ఇబ్బంది పెట్టే లక్షణం. కరక్కాయతో తయారైన దివ్యౌషధాలలో అగస్త్య రసాయనం లేదా అగస్త్య హరీతకీ రసాయనం ఒకటి. ఆయుర్వేద గ్రంథాల్లో దీనిని ఆయుష్షు, శరీరబలం, జీవన ప్రమాణాలు, ఇమ్యూనిటీలను పెంచే ఔషధాలలో ‘శ్రేష్టరసాయనం’ అని పిలిచారు. 5 రకాల దగ్గులు, ఎక్కిళ్లు, క్షయవ్యాధి, మలేరియా జ్వరం, ఎప్పటికీ వదలని పడిశెభారం, అరుచి, హృద్రోగాలలో దీని ప్రయోగం ఉంది. 


‘అడ్డసరం’పై నేపాల్‌ పరిశోధన

ఆయుర్వేదానికి శాస్త్రీయత ఏదీ? అనే వాళ్లకు ఇలాంటి పరిశోధనలు కనిపించవు. మన తెలుగు ప్రాంతాల్లో విరివిగా దొరికే ‘అడ్డసరం’ (వాసా/వసాక/అటరూష) మొక్క ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఆయాసం, ఊపిరాడక పోవటం లాంటి లక్షణాల మీద ఇది పనిచేస్తుంది. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ 2008 జనవరి - ఫిబ్రవరి సంచిక ఊపిరితిత్తుల వ్యాధుల్లో ‘అడ్డసరం’ ప్రభావం ప్రాముఖ్యత గురించి ఒక నివేదికను ప్రచురించింది. 2020 మార్చి 27న Chemrxiv జర్నల్‌లో"Justicia Adhatoda Leaves Extract Is A Strong Remedy For Covid-19'' పేరుతో మరో నివేదిక వెలువడింది. 

నేపాల్‌లోని తనహూన్‌ జిల్లా మ్యాగ్డే మునిసిపాలిటీ పరిధిలోని ప్రాంతాలలో అడ్డసరం మొక్కలు బాగా పెరుగుతాయి. అక్కడి శాస్త్రవేత్తలు కరోనా వ్యాధిపైన అడ్డసరం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అధ్యయనం చేశారు. ఆ దేశ ప్రభుత్వం వారికి సహకరించింది. 2020 అక్టోబర్‌లో  Journal Of Medicinal Plants Studies 8(5):44-48  ప్రచురించారు. వసాకా (అడ్డసరం) అనే వనమూలిక కొవిడ్‌-19 వ్యాధిలో ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలపైన ప్రభావం చూపించినట్టు నివేదిక ప్రకటించింది. అడ్డసరం ఆకులలోని వాసిసినైన్‌ ఆల్కలాయిడ్స్‌ జీవకణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశాన్ని అడ్డుకోగలవంటూ అనేక కొత్త విషయాలను ఈ నేపాలీ పరిశోధన వెలుగులోకి తెచ్చింది. అడ్డసరం ఆకులు వ్యాధినిరోధక శక్తిని పెంచి, కఫంతో మూసుకుపోయిన వాయు ప్రసార మార్గాలను తెరిచి విప్పారేలా ((Bronchodilatory Activity)) చేస్తాయని, కఫాన్ని, దగ్గుని అణచివేస్తాయని (Antitussive Activity), ఒకే వనమూలికతో ఇన్ని ప్రయోజనాలు నెరవేరతాయి కాబట్టి, దీన్ని ‘వైద్యమాత’ అన్నారు. 


శ్రీలంకలో సుదర్శన సిరప్‌.. 

సింకోనా అనేది అమెరికాలోని ప్రాచీన రెడ్‌ ఇండియన్‌ జాతులవారి ఔషధ మొక్క. స్పానిష్‌ వైస్రాయి భార్య సింకన్‌ కౌంటెస్‌కు మలేరియా జ్వరం వస్తే రెడ్‌ ఇండియన్లు ఈ చెట్టు బెరడు కషాయాన్ని తాగించి తగ్గించారు. ఆ సింకన్‌ గారి జ్వరాన్ని తగ్గించిందని ఆమె పేరున ఈ మొక్కని సింకోనా అని పిలిచారు. అయితే దీని కంటే ఎక్కువ గుణధర్మాలు కలిగిన రసాయనం నేలవేము. దీనిని భూనింబ, సుదర్శన అని పిలుస్తారు. శక్తివంతంగా పనిచేసే చేదైన ఔషధం. మలేరియా, బోదకాలు, శ్వాస సంబంధిత, జీర్ణకోశ వ్యాధుల నివారణకు మేలు చేస్తుంది. తమిళనాడులో తిరునాళ్లు జరిగేప్పుడు అంటువ్యాధులు ప్రబలకుండా నేలవేము చిక్కటి కషాయం కాచి ప్రజలకు ఉచితంగా అందిస్తుంటారు. ‘సుదర్శన ఘనవటి’ పేరుతో ఇది ఆయుర్వేద మందుల షాపుల్లో టాబ్లెట్లుగా దొరుకుతుంది. ఇంటిల్లిపాదీ ఈ ఔషధాన్ని 1-2 బిళ్లలు రెండు పూటలా వేసుకుని తులసాకుల టీ తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కరోనా సమస్యలకు నివారకంగా పనిచేస్తుంది. 


నేలవాముపై శ్రీలంకలో జరిగిన పరిశోధనను ‘సిలోన్‌ టుడే‘ పత్రిక 2020 అక్టోబరు 31న ప్రచురించింది. ఇది కొన్ని కరోనా వ్యాధి లక్షణాల మీద పనిచేస్తున్నట్లు ఆ పరిశోధన పత్రం పేర్కొంది. శ్రీలంక ఆరోగ్య ఔషధ నియంత్రణ శాఖామాత్యులు Prof. Jayasumana నేలవేముతో తయారైన ‘సుదర్శన సిరప్‌’ని కరోనా రోగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక ప్రకటన చేశారు. వీరు స్వయంగా ఆధునిక వైద్యులు. ప్రముఖంగా ఔషధ విభాగానికి చెందిన ఆచార్యులు కూడా! western medicine standards లో పరీక్షించి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. 


ఆయుర్వేదానికీ పరిమితులు..

ఈ ప్రపంచంలో ఏ వైద్య విధానమూ అంతిమం కాదు. దేన్నీ తిరుగులేనిది అని చెప్పలేం. దేని పరిమితులు దానికి ఉన్నాయి. వేద కాలం నుండీ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో తనను తాను మెరుగుపరుచుకుంటూ వచ్చింది ఆయుర్వేద శాస్త్రం. వైజ్ఞానికంగా ఎదిగే మనిషి తన విజ్ఞానాన్ని ఆయుర్వేదానికి ఆపాదిస్తూ.. ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్లాలని రెండు వేల ఏళ్ల కిందటే చరకుడు అభిలషించాడు. భారతదేశం విదేశీ పాలనలోకి వెళ్లిన తరువాత... ఈ అభివృద్ధి ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. ఆధునిక సాంకేతిక ఉపకరణాలన్నీ ఆంగ్లేయ వైద్య శాస్త్రానికి మాత్రమే సొంతం కావడంతో ఆయుర్వేదానికి పరిమితులే మిగిలాయి. అంతమాత్రాన ఈ వైద్యవిధానాన్ని పక్కన పెట్టడం సరికాదు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేదమే మెరుగైనది. ఆయుర్వేదం- ఒక మోస్తరు లక్షణాలున్న కరోనా రోగులకు అన్ని పరిమితులకూ లోబడే నిరపాయకరమైన ప్రామాణిక చికిత్సను అందించగలదు కూడా!. ఆయుర్వేదానికి అనుమతి కాదు, అవకాశం ఇవ్వాలి. మెడికల్‌ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తక్కిన వైద్య విధానాలన్నింటి రెక్కలు కట్టేయడం వల్ల సమాజానికి కీడే ఎక్కువ జరుగుతుంది. కరోనా నివారణ, నిరోధాలకు సంబంధించిన ఒక సమన్వయ విధానం కావాలి. ఈ దేశీయ వైద్యాన్ని ఈ దేశీయులకు అందించేందుకు ఎవరి అనుమతులో ఎందుకు? మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం వేల ఏళ్ల కిందటి నుంచీ నిరూపణ చేస్తూనే వస్తోంది. ఆయుర్వేదం వైద్యం మాత్రమే కాదు, అదొక జీవనవిధానం కూడా!.

- డా. జి. వి పూర్ణచందు, 

9440172642 


ఏ దేశానికీ సరిపోనంత ఆయుర్వేద విజ్ఞానం మన దగ్గర ఉంది. కానీ కరోనా చికిత్సకు ప్రత్యామ్నాయ వైద్యంలో అనుకున్నంత స్థాయిలో అధ్యయనం, పరిశోధనలు జరగడం లేదు. ఇతర దేశాలలో ఆయుర్వేదాన్ని మనకంటే చురుగ్గా వాడుకుంటున్నారు... 


కరోనాకు ఇంకా పూర్తిస్థాయిలో మందులు రాలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ‘రోగి బలం పెంచడం- రోగ బలం తగ్గించడం’ అనే ఆయుర్వేద సూత్రానుసారం ఆహార నియమాలు, వైద్య విధానాలను వివరిస్తూ ‘కరోనా సంహారం’ పుస్తకాన్ని రాశారు విజయవాడకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డా.పూర్ణచందు. హైదరాబాద్‌లోని ‘శాంతా-వసంతా ట్రస్టు’ ఈ పుస్తకాన్ని సేవా దృక్పథంతో అచ్చువేసింది. ఇందులో కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి? ఆయుర్వేద సూత్రాలను ఎలా పాటించాలి? వంటింటినే వైద్యశాలగా మార్చుకోవడం ఎలా? చికిత్సకు ఆయుర్వేదం ఎంత వరకు దోహదపడుతుంది? వంటి అనేక విషయాలను సామాన్యులకు అర్థమయ్యేలా రాశారు పూర్ణచందు. ‘‘ఆరోగ్యం - అనారోగ్యం రెండూ కలిసే మన జీవితంతో సహజీవనం చేస్తాయి. వ్యాధితో యుద్ధం చేస్తూనే జీవితం ఆరంభమై చివరివరకు కొనసాగుతుంది. వ్యాధిపై విజేతగా నిలబడినన్నాళ్లే మనకు బతుకు. ఎప్పుడైతే వ్యాధి మనల్ని జయిస్తుందో అదే మరణం..’’ అంటున్నారు శాంతా-వసంతా ట్రస్టు వ్యవస్థాపకులు వరప్రసాద్‌ రెడ్డి. శాంతా బయోటెక్‌ సంస్థ ద్వారా ప్రపంచానికి అనేక టీకాలను అందించిన ఆయన ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో - ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్తంగా అమలులో ఉన్న జానపద, సంప్రదాయ చికిత్సా విధానాలపై విస్తృత పరిశోధనలు సాగించాలని ఆశించారు. శాంతా- వసంతా ట్రస్టు ఫోన్‌ నెంబర్‌ : 9010663344

Updated Date - 2021-06-20T19:22:37+05:30 IST