పసుపు రైతులకు ఎన్ని కష్టాలో..!

ABN , First Publish Date - 2020-08-15T09:56:16+05:30 IST

మద్దతు ధర వస్తుందనే ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పసుపు అమ్మారు. నెలలు గడిచినా లెక్క అందలేదు. రూ.120.36 కోట్లకు గానూ ఎట్టకేలకు రూ.70

పసుపు రైతులకు ఎన్ని కష్టాలో..!

ఖాతాకు చేరిన లెక్క చేతికందక అవస్థలు

ఆధార్‌ సీడింగ్‌ కాక కొందరు..

రూ.50 వేలుపైబడి జన్‌ధన్‌ ఖాతాలో జమ కాక ఇంకొందరు

వివిధ కారణాలతో రూ.30 కోట్లు వెనక్కి


(కడప-ఆంధ్రజ్యోతి):

మద్దతు ధర వస్తుందనే ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పసుపు అమ్మారు. నెలలు గడిచినా లెక్క అందలేదు. రూ.120.36 కోట్లకు గానూ ఎట్టకేలకు రూ.70 కోట్లు ఇచ్చారు. అయితే ఖాతాకు ఆధార్‌ సీడింగ్‌ కాక కొందరు, రూ.50 వేలుపైబడి చెక్కులు జన్‌ధన్‌ ఖాతాల్లో జమకాక దాదాపు రూ.30 కోట్లు వెనక్కివెళ్లిపోయాయని తెలిసి రైతులు గొల్లుమంటున్నారు. బ్యాంక్‌ ఖాతా సరిచేసి తెచ్చిస్తే మళ్లీ బిల్లులు విజయవాడకు పంపుతామని మార్క్‌ఫెడ్‌ అధికారులు అంటున్నారు.


పసుపు రైతులు నష్టపోకుండా క్వింటా రూ.6,850లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ సంస్థ ద్వారా జిల్లాలో రైతుల నుంచి 1,75,710 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. పసుపు విక్రయించిన 5,850 మంది రైతులకు రూ.120.36 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మే ఒకటో తారీఖు నుంచి జూలై 10వ తేది వరకు రైతుల నుంచి పసుపు సేకరించారు. మేలో విక్రయించిన రైతులకు మూడు నెలలు, జూన్‌లో అమ్మిన రైతులకు రెండు నెలలు, జూలైలో విక్రయించిన రైతులకు నెల రోజులుగా పంట అమ్మిన లెక్క అందలేదు. పెట్టుబడికి చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయి.


కొత్త కొర్రీలతో రూ.30 కోట్లు వెనక్కి

రైతుల నుంచి మొత్తం 1,75,710 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొదట 1.25 లక్షల క్వింటాళ్లకు, రెండు, మూడు విడతల్లో మరో 50,710 క్వింటాళ్లకు బిల్లులు విజయవాడలోని మార్క్‌ఫెడ్‌ హెడ్‌ ఆఫీసుకు పంపారు. రూ.120.36 కోట్లకు గానూ తొలి విడతగా రూ.70 కోట్లు ఇచ్చారు. అయితే రైతులు ఇచ్చిన బ్యాంక్‌ ఖాతాలు 5-15 శాతం ఆధార్‌ సీడింగ్‌ చేయలేదని, 30-40 శాతం మంది రైతులు జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నాయని అంటున్నారు.  పసుపు అమ్మిన రైతులకు కనిష్టంగా రూ.68,500, గరిష్టంగా రూ.2.74 లక్షలు జమ కావాల్సి ఉంది. జన్‌ధన్‌ ఖాతా నిబంధనల మేరకు రూ.50 వేలు మించి జమకాదని బ్యాంక్‌ అధికారులు అంటున్నారు. ఈ రెండు కారణాలతో వచ్చిన రూ.70 కోట్లలో రూ.30 కోట్లు వెనక్కి వెళ్లిందని మార్క్‌ఫెడ్‌ అధికారులు పేర్కొంటున్నారు.


మళ్లీ బిల్లు పెట్టాలి

ఆధార్‌ సీడింగ్‌ లేని రైతులు బ్యాంక్‌కు వెళ్లి సీడింగ్‌ చేయించాలి. జన్‌ధన్‌ ఖాతా కలిగిన రైతులు అదే ఖాతాను గ్రామీణ ప్రాంతాల రైతులు రూ.500, పట్టణ ప్రాంతాల రైతులు రూ.1,000లు చెల్లించి సేవింగ్‌ ఖాతాగా మార్చుకోవాలి. లేదా కొత్తగా అకౌంట్‌ తెరవాలి. బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌ కాపీని పసుపు కొనుగోలు కేంద్రాల్లో ఇస్తే మళ్లీ విజయవాడ హెడ్‌ ఆఫీసుకు బిల్లులు పంపుతారు. హెడ్‌ ఆఫీసులో అందుబాటులో ఉన్న నిధులను బట్టి 15 రోజుల నుంచి నెలరోజుల్లో పసుపు లెక్క వస్తుందని అధికారులు అంటున్నారు.


ఎన్నాళ్లీ నిరీక్షణ

ఇప్పటికే నెలలు నిరీక్షించిన రైతులు ఈ ఖరీఫ్‌ సీజన్లో పనులు వదిలి బ్యాంకుల చుట్టూ తిరగాలి. లెక్క కోసం నెల రోజులు ఆగాలి. అప్పుడైనా తప్పక వస్తుందా..? అదీ లేదు. ఏపీ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే మద్దతు ధర వస్తుందని ఆశిస్తే.. లెక్కకోసం అవస్థలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


లెక్క కోసం ఎన్ని నెలలు ఆగాలి..ఆర్‌.వెంకటనారయణరెడ్డి, పసుపు రైతు, చెమ్ముళ్లపల్లి, ఖాజీపేట మండలం 

కపడ మార్కెట్‌ యార్డు కొనుగోలు కేంద్రంలో జూన్‌ 24న 21 క్వింటాళ్లు విక్రయించాను. రూ.1,43,850 రావాలి. పది పదైదు రోజుల్లో ఇస్తామన్నారు. ఖరీఫ్‌ పెట్టుబడికి వస్తుందనుకుంటే ఇప్పటికీ లెక్క రాలేదు. ఇప్పుడేమో ఆధార్‌ సీడింగ్‌ కాలేదని, జన్‌ఽధన్‌ ఖాతాలు ఇవ్వడం వల్ల నిధులు వెనక్కి వెళ్లాయని అంటున్నారు. తక్షణమే డబ్బు ఇచ్చి ఆదుకోవాలి.


రైతులు ఖాతాలు సరిచేసి ఇస్తే బిల్లులు పంపుతాం..నాగరాజు, ఇన్‌చార్జి మేనేజరు, ఏపీ మార్క్‌ఫెడ్‌, కడప 

జిల్లాలో పసుపు విక్రయించిన రైతులకు రూ.120.36 కోట్లు రావాలి. అందులో రూ.70 కోట్లు రైతుల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశారు. అయితే.. ఆధార్‌ సీడింగ్‌ చేయని రైతులు, జన్‌ధన్‌ ఖాతాలు ఇచ్చిన రైతుల డబ్బు వెనక్కి వెళ్లిన మాట నిజమే. బ్యాంక్‌ ఖాతాలు సరిచేసి ఇస్తే మళ్లీ హెడ్‌ ఆఫీసుకు బిల్లులు పంపుతాం.

Updated Date - 2020-08-15T09:56:16+05:30 IST