ఒక్క రోజులో పది అంతస్థుల భవనం.. ఎలా కట్టారో తెలుసా?

ABN , First Publish Date - 2021-06-20T14:53:58+05:30 IST

ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అన్ని పనులూ చాలా వేగంగా జరిగిపోతున్నాయి. భవన నిర్మాణం కూడా చాలా స్పీడ్ అయింది. ఇలాంటి సమయంలో పది అంతస్థుల భవనం నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది?

ఒక్క రోజులో పది అంతస్థుల భవనం.. ఎలా కట్టారో తెలుసా?

ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అన్ని పనులూ చాలా వేగంగా జరిగిపోతున్నాయి. భవన నిర్మాణం కూడా చాలా స్పీడ్ అయింది. ఇలాంటి సమయంలో పది అంతస్థుల భవనం నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత లేదన్నా ఒక నెల. మరీ స్పీడ్ అయితే ఒక వారం. కానీ చైనాకు చెందిన ఒక కంపెనీ మాత్రం ఒక్క రోజులోనే పది అంతస్థుల భవనం కట్టేసింది. కేవలం 28 గంటల 45 నిమిషాల్లో ఈ భవనాన్ని నిర్మించి రికార్డు సృష్టించింది. ఇదంతా చైనాలోని బ్రాడ్ గ్రూప్‌ ఘనతే. గతంలో కూడా ఇలాగే అత్యంత వేగంగా భవన నిర్మాణాలు చేసిన రికార్డులు ఈ కంపెనీ పేరిట ఉన్నాయి. ఈ క్రమంలోనే చైనాలోని చాంగ్సా ప్రాంతంలో ఒక పది అంతస్థుల భవన నిర్మాణాన్ని బ్రాడ్ గ్రూప్ చేపట్టింది.


ప్రి-ఫ్యాబ్రికేటెడ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ విధానంలో నిర్మించిన ఈ భవనం.. సులభంగా ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఫ్యాక్టరీలో ఆల్రెడీ తయారు చేసిన విడి భాగాలను తీసుకొచ్చి ఒకదానికి మరొకటి జత చేయడం ద్వారా ఈ భవన నిర్మాణం జరుగుతుంది. ఈ టెక్నాలజీతోనే 2015లో ఈ కంపెనీ 57 అంతస్థుల భవనాన్ని నిర్మించింది. దీనికి ఆ కంపెనీకి పట్టిన సమయం 19 రోజులు. దీన్ని ‘లివింగ్ బిల్డింగ్’ టెక్నాలజీ అని ఈ కంపెనీ చెప్తుంది. ఈ భవన నిర్మాణ స్లాబులను బి-కోర్ స్టీల్‌తో తయారు చేస్తారట. ఈ భాగాలు సాధారణ స్లాబుల కన్నా పది రెట్లు తేలికగా, వంద రెట్లు బలంగా ఉంటాయని తెలిపింది. కాబట్టి భద్రత విషయంలో ఎటువంటి భయమూ అక్కర్లేదని చెప్పింది. తాజాగా ఈ కంపెనీ నిర్మించిన పది అంతుస్థుల భవనానికి చెందిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. 

Updated Date - 2021-06-20T14:53:58+05:30 IST