జుట్టు రాలుతోంది... ఎందుకలా..?

ABN , First Publish Date - 2020-08-08T17:34:36+05:30 IST

నా వయసు 45 సంవత్సరాలు. జుట్టు బాగా రాలుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బయోటిన్‌ టాబ్లెట్స్‌ రాశారు. అయితే ఆహారం

జుట్టు రాలుతోంది... ఎందుకలా..?

ఆంధ్రజ్యోతి(08-08-2020)

ప్రశ్న: నా వయసు 45 సంవత్సరాలు. జుట్టు బాగా రాలుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బయోటిన్‌ టాబ్లెట్స్‌ రాశారు. అయితే ఆహారం ద్వారా బయోటిన్‌ ఎలా వస్తుంది? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మా బాబుకు కూడా జుట్టు రాలుతోంది. వాడి వయసు 18 సంవత్సరాలు. నేను వాడుతున్న టాబ్లెట్స్‌ వాడు వాడొచ్చా?


- రిదిమ, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: జుట్టు రాలడం అనే సమస్యను ఈ మధ్య కాలంలో 90 శాతం మంది ఎదుర్కొంటున్నారు. వయసుతో పనిలేకుండా జుట్టు రాలడం సర్వసాధారణంగా కనబడుతోంది. జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే... హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండటం, పోషకాహార లోపం ఉండటం, ఇటీవల ఏదైనా జ్వరంగానీ జబ్బుగానీ బయటపడటం, మందుల వాడకం, వంశపారంపర్యంగా రావడం, మేల్‌ ప్యాటర్న్‌ జుట్టు ఊడటం, ఫిమేల్‌ ప్యాటర్న్‌ బట్టతల రావడం... ఇలా ఎన్నో రకాల కారణాలున్నాయి. మీరు ఈ చెక్‌లిస్టులో రూల్‌ అవుట్‌ చేసుకుంటూ వెళ్లండి. దానికి తగిన చికిత్స పొందవచ్చు.




జుట్టు పెరగడానికి పోషకాలు


ప్రొటీన్‌: ప్రొటీన్‌ లోపం రాకుండా చూసుకోవడం అవసరం. రోజుకు 0.8 గ్రాములు-1 గ్రాము ప్రొటీన్‌ పర్‌ కిలో ఐడియల్‌ బాడీ వెయిట్‌ తీసుకోవాలి. గుడ్డు, మాంసాహారం, పప్పు దినుసులు, పాలు, పెరుగు, చీజ్‌, పనీర్‌, సోయాలలో ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి. ప్రతీసారి ఆహారంలో ప్రొటీన్‌ పదార్థాలు ఉండాలి. దీనితోపాటు విటమిన్‌-సి ఉండేట్టు చూసుకోవాలి. 


బయోటిన్‌: ఇది బి -విటమిన్‌. ఆహారం నుంచి శక్తి ఉత్పన్నం కావాలంటే బి-విటమిన్స్‌ చాలా అవసరం. మన శరీరంలో బి-విటమిన్స్‌ నీళ్లలో కలిసి పనిచేస్తాయి కావున అవి నిల్వ ఉండవు. అందుకే ప్రతిరోజూ బి-విటమిన్స్‌ ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. బయోటిన్‌ అధికంగా లభించే పదార్థాలివి...


గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ప్రతీరోజూ ఒక గుడ్డు ఉడకబెట్టుకుని తినాలి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తీసుకోవచ్చు.

పప్పు దినుసులు, పల్లీలు, సోయాలో బయోటిన్‌ ఉంటుంది. వీటిని మధ్యాహ్న భోజనంలో, డిన్నర్‌లో తీసుకోవాలి.

బాదాం, సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌లో కూడా బయోటిన్‌ ఉంటుంది. వీటిని ప్రతీరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. అరటిపండ్లలో బి-విటమిన్‌ ఉంటుంది. ప్రతీరోజూ ఒక అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లివర్‌ లాంటి ఆర్గాన్‌ మీట్‌లో బయోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.


జుట్టు రాలకుండా ఉండాలంటే వీటితోపాటు  పోషకాలతో కూడిన ఆహారం, కంటి నిండా నిద్ర... అది కూడా సరైన సమయంలో నిద్రపోవడం అవసరం. మీ బాబుకు ఎందువల్ల జుట్టు రాలుతుందో తెలుసుకుని  జాగ్రత్తలు పాటించండి. ఏ టాబ్లెట్‌ అయినా డాక్టర్‌ను సంప్రదించకుండా వాడకండి. 


- డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

Updated Date - 2020-08-08T17:34:36+05:30 IST