Abn logo
Apr 7 2020 @ 08:57AM

గర్భిణులకు కరోనా సోకకుండా...

ఆంధ్రజ్యోతి(07-04-2020)

చైనా ఎల్లలు దాటి ప్రపంచమంతటా వేగంగా విస్తరించిన కొత్తరకం కరోనా వైరస్‌ (కొవిడ్‌ - 19)  భయంతో మానవాళి వణికిపోతోంది. నిరంతర పరిశోధనలు జరుగుతున్నా, కొవిడ్‌ - 19 వైరస్‌కు టీకా కనుక్కోవడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో గర్భిణులకు  ఈ వైరస్‌ సోకకుండా ఎలా వహరించాలి? కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి తల్లీబిడ్డలను కాపాడుకునేదెలా?


గర్భం దాల్చినప్పుడు సహజంగా జరిగే మార్పుల వల్ల గర్భిణి ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత తగ్గుతుంది. ఆక్సిజన్‌ మామూలుగా కంటే ఎక్కువగా వినియోగం అవుతుంది. అందువల్ల, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల గర్భిణులకు సహజంగానే శ్వాససంబంధ వ్యాధుల దుష్పరిణామాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ తగిన జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా సోకకుండా నియంత్రించుకోవచ్చు!


ఇంట్లో గర్భిణి ఇలా....

గర్భిణులు ఉండే గదిలోకి ధారాళంగా వెలుగు, గాలి రావాలి. ఇతర కుటుంబ సభ్యులకు టాయిలెట్‌ వేరుగా ఉండాలి. సరిపడా ఆహారం, నీరు, శుభ్రత పాటించడానికి అవసరమైన సౌకర్యాలు కలగజేయాలి. ఏదైనా ఇతర ఆరోగ్య సమస్య వస్తే, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలి.  


ప్రసవం!

సహజ ప్రసవం, సిజేరియన్‌లలో ఏది ఉత్తమం అని చెప్పడానికి ఇప్పటికీ ఆధారం ఏమీ లేదు.


గర్భిణి నుండి గర్భస్థ శిశువుకు కరోనా?

దీనికి సంబంధించి పరిశోధనలు పరిమితంగానే ఉన్నాయి. ఇన్ఫెక్షన్‌ ఉన్న తల్లి నుండి బిడ్డకు వ్యాధి సంక్రమించదనీ, నెలలు నిండక మునుపే ప్రసవం కావడం, శిశువుకు అంగవైకల్యాలు వచ్చే ప్రమాదం లాంటివి కొవిడ్‌-19 వైర్‌సతో ఉండవనీ పరిశోధకులు చెబుతున్నారు. కానీ, దీనికి సంబంధించి మున్ముం దు ఎలాంటి నివేదికలు వస్తాయో తెలియదు.


గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మామూలుగా అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలే గర్భిణులు కూడా పాటించాలి. తరచుగా సబ్బునీటితో లేక ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో చేతుల్ని కడుక్కోవాలి. దగ్గు, తుమ్ములు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. కళ్ళు, ముక్కు, నోటిని చేతితో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. జనసమ్మర్దం ఉన్న చోటుకు వెళ్ళరాదు. వ్యాధి లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. సకాలంలో అవసరమైన పరీక్షల్ని చేయించుకోవాలి. డాక్టర్‌ చెప్పిన సూచనలనూ, ముందు జాగ్రత్త చర్యలనూ పాటించాలి. అవసరమైతే తగిన చికిత్సను చేయించుకోవాలి. వీటిని 


గర్భిణులు తప్పనిసరిగా, కచ్చితంగా పాటించాలి. ఉద్యోగినులైన గర్భిణులకు తక్కువ ప్రమాదం ఉన్న పనుల్ని కేటాయించాలి. పధ్నాలుగు రోజుల పాటు ఇంటి నుండి పని చేయడం, లేదంటే సెలవు తీసుకోవడం వాళ్ళకు సహాయపడుతుంది.


గర్భిణుల పట్ల వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీసుకోవలసిన చర్యలు...

పరీక్షకు మామూలు వ్యవధిలో కన్నా కొంత ఆలస్యంగా రమ్మనాలి. ఆస్పత్రికి వచ్చాక సాధ్యమైనంత త్వరగా పరీక్ష చేసి పంపేయాలి. స్వల్పమైన సమస్యలకు హాస్పటల్‌కు రమ్మనకుండా టెలిఫోన్‌ ద్వారా, లేదంటే ఫేస్‌ టైమ్‌, వాట్సాప్‌ వీడియోకాల్‌ ద్వారా (ముఖ్యంగా మొదటి ఇరవై వారాలు) సలహాలివ్వాలి. ముఖాముఖిగా జరిపే యాంటీ నేటల్‌ క్లాసులను వాయిదా వెయ్యాలి. రోగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు భర్తను కానీ, లేదంటే ఎవరో మరొకరిని మాత్రమే అనుమతించాలి. ఆస్పత్రి నుంచి మామూలుగా కంటే త్వరగా డిశ్చార్జి చెయ్యాలి. 


ప్రసవం తరువాత?

ఇన్ఫెక్షన్‌ వచ్చి కోలుకున్న గర్భిణులలో యాంటీబాడీలు ఉత్పత్తి అయి, అవి తల్లి పాల ద్వారా శిశువుకు చేరి శిశువుకు రక్షణ లభిస్తుందని కొన్నిఅధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువల్ల శిశువుకు తల్లి పాలు ఇవ్వడమే మేలు! 


గర్భం, ప్రసవం గురించి మామూలుగానే గర్భిణులకు అనేక సందేహాలు, భయాలు ఉంటాయి. ప్రస్తుత వాతావరణంలో అవి మరింత ఎక్కువయ్యే అవకాశాలూ లేకపోలేదు. అయితేభయానికి లోనవకుండా, ధైర్యాన్ని కూడదీసుకోవాలి. వైద్యులు సూచించే అన్ని జాగ్రత్తలనూ నిష్ఠగా పాటించాలి. అప్పుడే కరోనా వైరస్‌ బారిన పడకుండా పండంటి బిడ్డను ప్రసవించగలుగుతారు.- డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

శ్రీశ్రీ హోలిస్టిక్‌ హాస్పిటల్‌,

హైదరాబాద్‌. 984902441 (కన్సల్టేషన్‌ కోసం)


Advertisement