పురుగులున్న భోజనాన్ని ఎలా తినేది?

ABN , First Publish Date - 2021-12-03T06:27:48+05:30 IST

పురుగులు, రాళ్లున్న భోజనాన్ని విద్యార్థులు ఎలా తింటారని యాదమరి మండలం మాదిరెడ్డిపల్లె దళితవాడకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు.

పురుగులున్న భోజనాన్ని ఎలా తినేది?
పిల్లలతో కలిసి నిరసన తెలుపుతున్న తల్లులు

మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

కలెక్టరేట్‌ వద్ద మాదిరెడ్డిపల్లె దళితవాడ విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన


చిత్తూరు, డిసెంబరు 2: పురుగులు, రాళ్లున్న భోజనాన్ని విద్యార్థులు ఎలా తింటారని యాదమరి మండలం మాదిరెడ్డిపల్లె దళితవాడకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. మాదిరెడ్డిపల్లె యూపీ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ గురువారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. భోజనంలో పురుగులు, రాళ్లు కనిపించడంతో తమ బిడ్డలు తినలేకపోతున్నారని చెప్పారు. ఇదేంటని గతనెల 25వ తేదీన మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకు భోజన బిల్లులు రాలేదని, ఇంతకంటే పెట్టలేమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. దాంతో భోజనం పెట్టే పనిని తమకు అప్పగించేయండని అడిగితే.. కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కలెక్టర్‌ అయినా స్పందించి విచారించి, న్యాయం చేయాలని కోరారు. 

Updated Date - 2021-12-03T06:27:48+05:30 IST