Abn logo
Jul 31 2020 @ 02:56AM

‘అమ్మ భాష’అమలెలా?

  • 1964 నుంచే ‘మాతృభాష తప్పనిసరి’ నినాదం 
  • 1986 పాలసీలోనూ మాతృభాషే కీలకాంశం
  • సిఫారసులను బుట్టదాఖలు చేసిన ప్రభుత్వాలు
  • తాజా ప్రతిపాదనలు కచ్చితమా? ఐచ్ఛికమా??
  • రాష్ట్రాలదే తుది నిర్ణయమంటున్న కేంద్రం
  • సలహానే.. తప్పనిసరి కాదు: కేంద్ర విద్యా శాఖ
  • తల్లిదండ్రుల్లోనూ ‘అమ్మ భాష’పై అయోమయం!

ఐదు దశాబ్దాలుగా అమ్మభాష అమలుకు వివిధ కమిషన్లు సిఫారసులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ వాటి అమలు అరకొరే. ఆర్థిక సంస్కరణల ఫలితంగా అన్నిటా ఆంగ్లం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇప్పుడు కూడా ఐదో తరగతి వరకూ మాతృభాషలోనే బోధించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ఇప్పటికైనా అమ్మ భాష అమలుకు వచ్చేనా!?


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా.. ఐదోతరగతి వరకూ అమ్మభాషలోనే విద్యావిధానం అమలు సాధ్యమేనా? ఈ డిమాండ్‌ 1964 నుంచే ఉన్నా.. పలు కమిషన్లు, కమిటీలు సిఫారసులు చేసినా.. ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు? త్రిభాషా సూత్రం విఫలమవ్వడానికి కారణాలేంటి? 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత.. ప్రైవేటు, కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇప్పటికిప్పుడు మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయా? కొన్ని రాష్ట్రాలైతే ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లిష్‌ చదువులకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాలు మాతృభాషకు ప్రాధాన్యమిస్తాయా? కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఎన్‌ఈపీ నేపథ్యంలో.. ఆ ముసాయిదాలో మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాల్లోనే స్పష్టత కరువైంది. ఈ సిఫారసు చేసిన కమిషన్‌ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ అది తప్పనిసరి అంటున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్యతోనే విద్యార్థులు సైన్స్‌, గణితం సబ్జెక్టులను అర్థం చేసుకుంటారని, లేదంటే డ్రాపౌట్లు పెరుగుతాయంటున్నారు. జపాన్‌ వంటి దేశాల్లో విద్యావ్యవస్థ సక్సె్‌సకు అదే కారణమన్నారు. అయితే.. కేంద్ర విద్యాశాఖ మాత్రం రాష్ట్రాలదే తుది నిర్ణయమని చెబుతోంది. దీంతో ‘మాతృభాష’లో విద్యాబోధన అమలవుతుందా? కొఠారీ కమిషన్‌ మొదలు పలు కమిషన్లు, కమిటీల ప్రతిపాదనల్లాగే ఇదీ బుట్టదాఖలవుతుందా?అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 


అప్పుడూ ఇలాంటి సిఫారసులే..

‘‘12వ తరగతి వరకు మాతృభాషలో విద్య అమల్లో ఉంది. దీన్ని విశ్వవిద్యాలయాలకూ వర్తింపచేయాలి’’ 1964లో నియమించిన కొఠారీ కమిషన్‌, 1986లో జాతీయ విద్యావిధానంపై కమిటీ కేంద్ర ప్రభుత్వానికి చేసిన కీలక సిఫార్సులు ఇవి. కమిషన్ల సూచనలు అమలుచేస్తామనడం.. తర్వాత బుట్టదాఖలు చేయడం 56 ఏళ్లుగా షరామామూలైపోయింది. చివరిసారిగా 1986లో చేసిన సిఫార్సులే ఇప్పటి విద్యావిధానానికి ఆధారంగా ఉన్నాయి. 1968లో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రం సరిగా అమలు కాలేదని 1992లో ఏర్పాటు చేసిన కమిటీ చెప్పడం గమనార్హం. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో దక్షిణాది భాషలను బోధించడం లేదని పేర్కొంది. ప్రైవేటు, కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో మాతృభాషలో బోధన ఒక సబ్జెక్టుకే పరిమితమైంది. ప్రభుత్వ బడుల్లో కొంతవరకు అమలైనా.. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమ చదువుపై మొగ్గుచూపుతుండటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా.. కేంద్ర మంత్రివర్గం అమోదం అనంతరం తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో విమర్శలు ప్రారంభమయ్యాయి. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన విద్యావిధానానికి 1964 నాటి కొఠారీ కమిషన్‌ సిఫార్సులకు సారూప్యత ఉంది. మాతృభాషకు ప్రాధాన్యత, వృత్తివిద్య కోర్సులు, సైన్స్‌కు ప్రాధాన్యత, వర్సిటీల్లో పరిశోధనలకు పెద్దపీట, దేశ జీడీపీలో 6ునిధులను విద్యకు కేటాయించడం లాంటి అనేక అంశాలు అప్పటి సిఫార్సులోనూ ఉన్నాయి. నాడు ఉన్నత విద్యలోనూ మాతృభాష అమలుచేయాలని సిఫారసు చేశారు. ఇప్పుడు కస్తూరి రంగన్‌ కమిషన్‌ 5వ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అని సిఫారసు చేసింది.


ఇది సలహానే: కేంద్ర విద్యాశాఖ

మాతృభాష/స్థానిక భాషలో ఐదో తరగతి వరకూ విద్యాబోధన ఉండాలనేదే జాతీయ విద్యావిధానం ఉద్దేశమని, అయితే.. అది సలహా మాత్రమేనని, తప్పని సరి కాదని విద్యామంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. త్రిభాషా విధానం ఉంటుందని, నిర్ణయాధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ‘‘ఏ భాషనూ ఎవరిపైనా రుద్దడం లేదు. బోధనా మాధ్యమంలో ఏ భాషనైనా ఎన్నుకోవచ్చు’’ అని జాతీయ విదావిధానం ముసాయిదా కమిషన్‌ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ అన్నారు. 


స్పష్టమైన ప్రకటన రావాలి: తల్లిదండ్రులు

ఎన్‌ఈపీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేనే అయోమయం తొలుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తరుచూ బదిలీ అయ్యే ఉద్యోగులు తమ పిల్లలు అక్కడి భాషలో చదవాలంటే కష్టమే అంటున్నారు. ఏభాషలోనైనా చదువుకునే అవకాశం ఉండాలంటున్నారు. నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టకూడదని, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాల రీత్యా నిర్ణయాలు తీసుకోవచ్చునని వాదిస్తున్నారు. 5+3+3+4 విద్యావిధానాన్ని ప్రవేశపెట్టినా ఇదివరకు 10+2+3 విద్యావిధానానికీ దానికీ పెద్ద తేడా లేదని విద్యామంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. కొత్త విద్యావిధానంలో పిల్లల మానసిక పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా తరగతులను వర్గీకరించామని చెబుతున్నాయి. పరీక్ష విధానం, బోధనా విధానం మారిపోతాయని తెలిపారు


2021 నాటికి ఉపాధ్యాయ విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళిక

బోధన రంగంలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పాఠశాల విద్య మొదలు ఉన్నతస్థాయి విద్య వరకు అనేక సంస్కరణలను అమలు చేయబోతోంది. 2021 నాటికి ఉపాఽధ్యాయ విద్య కోసం జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించనున్నారు. ఇందుకోం ఎన్‌సీఈఆర్‌టీని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌  సంప్రదించి విధి విధానాలను ఖరారు చేస్తుంది. మరోవైపు 2030 నాటికి నాలుగేళ్ల బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సును అమల్లోకి తేవాలని నిర్దేశించారు. బోధన రంగంలోకి రావాలనుకునే వారికి  కనీస అర్హతగా నాలుగేళ్ల బీఈడీ ప్రామాణికం కానుంది.  ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ, ఉపాధ్యాయులు, నిపుణులతో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ చర్చించి 2022 నాటికి జాతీయ స్థాయిలో నేషనల్‌ ప్రొఫెషనల్స్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ టీచర్స్‌(ఎన్‌పీఎ్‌సటీ)పేరుతో సమగ్ర బోధన ప్రమాణాలను రూపొందిస్తుంది. వివిధ స్థాయుల్లో ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఇందులో స్పష్టపరుస్తారు.


మాతృభాషకు కమిషన్ల సిఫారసు

యునివర్సిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1948-49)

సెకండరీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1952-53)

కొఠారీ కమిషన్‌ (1964-66)

నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌-ఎన్‌పీఈ (1968)

నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (1986)

నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌-సవరణ (1992)

టీఎ్‌సఆర్‌ సుబ్రమణియం కమిటీ నివేదిక (మే-2016)

డాక్టర్‌ కస్తూరిరంగన్‌ కమిషన్‌ (మే-2019)


సరళమే కానీ...అమలు ఎలా..?

నూతన విద్యా విధానంపై మిశ్రమ స్పందన


 నూతన విద్యా విధానంపై  పలువురు నిపుణులు, విద్యావేత్తల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇవి దీర్ఘకాలిక సంస్కరణలు అని కొందరు అంటే,  ఆచరణలో ఈ విధానం ఎంతవరకు ఫలితాలు సాధిస్తుందనేది వేచి చూడాలని మరికొందరు వ్యాఖ్యానించారు.  మరోవైపు ఉన్నత విద్యారంగ సంస్థలకు నిధులు సమకూర్చే బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంటోందనే విమర్శలు  వస్తున్నాయి. ఇండియాలోని ఉన్నత విద్యా సంస్థల  పాలిట నూతన విద్యా విధానాన్ని  అమెరికాలోని మొరిల్‌ మూవ్‌మెంట్‌తో ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ రావు పోల్చారు. 10+2 విద్యా విధానాన్ని 5+3+3+4కు మా ర్చడం అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని ఐఐఎం సంబల్పూర్‌ డైరెక్టర్‌ మహదేవ్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. విజ్ఞానం, నైపుణ్యాలు పెంచేదిగా ఉన్నప్పటికీ ఇందులో నిర్దేశించుకున్న లక్ష్యాల అమలుకు సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ వీసీ దినేష్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.


కొఠారి ఎడ్యుకేషన్‌ కమిషన్‌

కమిషన్‌ ఏర్పాటు తేదీ: 14.07.1964

కమిషన్‌ చైర్మన్‌: డాక్టర్‌ డీఎస్‌ కొఠారీ

సూచనల స్వీకరణ: అమెరికా, బ్రిటన్‌, రష్యా, యునెస్కో నిపుణులు


తప్పనిసరి విద్య: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, అక్షరాస్యత పెంచేందుకు రాజ్యాంగంలోని 45వ అధికరణ ప్రకారం 6-14 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఉచిత, తప్పనిసరి విద్యను అందించాలి. 


వర్సిటీల్లో మాతృభాషలోనే: పాఠశాల విద్య మాతృభాషలోనే సాగుతున్నందున(అప్పటికే అమల్లో ఉంది) విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంతో సామాన్యులు, మేధావుల మధ్య అంతరం పెరుగుతోంది. దీనిని తగ్గించేందుకు ఉన్నత విద్య కూడా మాతృభాషలో సాగాలి.  


త్రిభాషా సూత్రం: అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని పాటించాలి. ప్రాథమిక పాఠశాలలో మాతృభాష ఉన్నందున.. ఉన్నత విద్య స్థాయిలో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ, ఆంగ్లంతోపాటు మరో భాషను బోధించాలి.


అందరికీ ఒకే విద్య: దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలి. వెనకబడిన, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు సదుపాయాలు కల్పించాలి. 


సైన్స్‌, గణితం, పరిశోధనలకు ప్రాధాన్యత: దేశ విద్యావిధానంలో సైన్స్‌, గణితానికి ప్రాధాన్యమివ్వాలి. పరిశోధనలను పెంచాలి. దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది అత్యవసరం. 


పారిశ్రామిక విద్య: వ్యవసాయం, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు, మానవ వనరుల కొరతను అధిగమించేందుకు ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలి. దేశం మొత్తం ఒకే విద్యావిధానం ఉండాలంటే అన్ని చోట్ల 10+2+3 విద్యావ్యవస్థ అమలవ్వాలి.


విద్యకు 6%: విద్యపై పెట్టుబడి దేశ భవిషత్తుకు కీలకం. దేశ జీడీపీలో విద్యకు 6% కేటాయింపులు జరపాలి. విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల సమన్వయం కీలకం. రెండు వ్యవస్థలు కలిసి పనిచేయాలి.


క్రీడలకూ ప్రాధాన్యత: జాతీయ క్రీడా విధానాన్ని అమలుచేయాలి.

కొఠారీ కమిషన్‌ చేసిన సిఫార్సుల్లోనే అనేక అంశాలను 1986లో నియమించిన నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌పీఈ) కమిటీ కూడా చేసింది. కానీ, ఆ సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement