రోగనిరోధక శక్తి పెరగాలంటే...

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

రోజురోజుకు ‘కొవిడ్‌ 19’ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) అవసరం ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యింది. ఇమ్యూనిటీ పెంచుకునే డైట్‌...

రోగనిరోధక శక్తి పెరగాలంటే...

రోజురోజుకు ‘కొవిడ్‌ 19’ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) అవసరం ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యింది. ఇమ్యూనిటీ పెంచుకునే డైట్‌ ఏదైనా చెప్పండి?

-విజయసేన, హైదరాబాద్‌


అవును ‘కొవిడ్‌ 19’ విషయంలో మనం పీక్‌ స్టేజీకి చేరబోతున్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. రోగనిరోధక శక్తి గురించి ఇంతకుముందు కూడా చెప్పాను. రోగనిరోధక శక్తి అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వతహాగా ఉండేది. రెండోది జబ్బు తగ్గిన తర్వాత మన శరీరంపై ఆ వైరస్‌కి ఇమ్యూనిటీ అభివృద్ధి చేసుకోవడం ద్వారా వచ్చేది. కొవిడ్‌ నుంచి సురక్షితంగా బయటపడాలన్నా, దాని బారిన పడకుండా ఉండాలన్నా స్వతహాగా ఉన్న రోగనిరోధక శక్తిని బలపర్చుకోవాలి. జీర్ణకోశం, ఎముకల మజ్జ, లింఫ్‌ సిస్టమ్‌, చర్మం, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూకోజల్‌ కణాలు... ఇవన్నీ కూడా స్వతహాగా ఉండే రోగనిరోధక శక్తిని బలపర్చేవే. వీటి ఆరోగ్యం మన ఇమ్యూనిటీని సృష్టిస్తుంది. అందువల్ల శరీరం ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోవాలి. దీనికి కావాల్సిన సాధనాలు ఏమిటంటే... సమతుల ఆహారం, సరైన నిద్ర, తగినంత వ్యాయామం, జంక్‌ఫుడ్‌ మానేయడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, తగినంత శుభ్రత... మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ సమస్యలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పెద్ద వయసువారికి ఇమ్యూనిటీ బలహీనంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, అన్ని బ్లడ్‌ వాల్యూస్‌ నార్మల్‌కు దగ్గరగా ఉండేట్టు చూసుకోవాలి.

అందుకోసం ఈ ఆహార ప్రణాళిక పాటించండి. దీన్ని మధుమేహం ఉన్నవారు, బీపీ ఉన్నవారు కూడా పాటించొచ్చు.


ఉదయం (6 గంటలకు): బాదాం 8, నల్ల ఖర్జూరం 2తో పాటు టీ లేదా కాఫీ తీసుకోవాలి.

బ్రేక్‌ఫాస్ట్‌ (8 గంటలకు): పెసలతో చేసిన పెసరట్టు ఒకటి (ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రతో), అల్లం టొమాటో పచ్చడితో తినాలి. ఒక కోడిగుడ్డు, ఒక కప్పు కమలారసం (ట్రాపికానా అయినా సరే) తీసుకోవాలి.

ఉదయం 11 గంటలకు: సూప్‌, టీ, కాఫీ, కొబ్బరినీళ్లు, మజ్జిగ... వీటిలో ఏదైనా ఒకటి తాగొచ్చు.

మధ్యాహ్నభోజనం (1 గంటకు): అరకప్పు బ్రౌన్‌ రైస్‌, ఒక రోటీ, పాలకూర పప్పు, కప్పు పెరుగు, సలాడ్‌ తీసుకోవాలి.

సాయంత్రం (4 గంటలకు): వేగించిన గుమ్మడి, సన్‌ఫ్లవర్‌, వేరుసెనగ గింజలు రెండు గుప్పెళ్ల నిండుగా తిన్న తర్వాత టీ గానీ కాఫీ గానీ తాగొచ్చు.

సాయంత్రం (6 గంటలకు): దానిమ్మ, జామ, బొప్పాయి, కర్బూజా పండ్లు తినాలి.

రాత్రి భోజనం (8 గంటలకు): ఓట్స్‌ లేదా రాగులు ఒక కప్పు, పచ్చి బఠానీలు లేదా బీన్స్‌ కూర. ఆహారంలో అల్లం, పసుపు, మిర్చి, కరివేపాకు, మజ్జిగ ఉండేలా చూసుకోవాలి.


-డాక్టర్ బి.జానకి, న్యూట్రషనిస్ట్

drjanakibadugu@gmail.com



Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST