రోగనిరోధకశక్తి పెరగాలంటే?

ABN , First Publish Date - 2021-06-15T15:45:59+05:30 IST

ఆరోగ్యకరమైన జీవనానికి రోగనిరోధకశక్తి ఎంతో కీలకం. మారుతున్న కాలాలతో పాటు చోటుచేసుకునే వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేకపోవడానికి కారణం రోగనిరోధకశక్తి లోపమే!

రోగనిరోధకశక్తి పెరగాలంటే?

ఆంధ్రజ్యోతి(15-06-2021)

ఆరోగ్యకరమైన జీవనానికి రోగనిరోధకశక్తి ఎంతో కీలకం. మారుతున్న కాలాలతో పాటు చోటుచేసుకునే వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేకపోవడానికి కారణం రోగనిరోధకశక్తి లోపమే! వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి సంప్రదాయ పోషకాహారం తీసుకోవడంతో పాటు కొన్ని మూలికా సంబంధమైన ఔషధాలు తీసుకోవడం అవసరం.


మహా సుదర్శన కాడ/మహా సుదర్శన ఘనవటి: 

ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకోగలిగితే వానాకాలంలో తలెత్తే జలుబు, జ్వరం లాంటి రుగ్మతలతో పాటు వాతావరణ మార్పులతో విజృంభించే వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ మొదలైన సూక్ష్మక్రిములు కలిగించే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అంటువ్యాధులు సోకకుండా ఈ ఔషధం తోడ్పడుతుంది. మహాసుదర్శన కాడను వయసును బట్టి ఉదయం, సాయంత్రం 5 నుంచి 10 మిల్లీలీటర్ల చొప్పున నీళ్లతో కలిపి తీసుకోవాలి. మహా ఘనవటి వయసును ఒకటి లేదా రెండు మాత్రలు ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి.


చ్యవన్‌ప్రాశ్‌: రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు పిల్లల్లో తలెత్తే విటమిన్‌ లోపాలను అరికడుతుంది. పిల్లలకు పుష్ఠిని ఇస్తుంది. ఒక టీస్పూను ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.


అశ్వగంధ లేహ్యం: పిల్లల్లో ఎదుగదల లోపాల నివారణకు, కండరాలు పట్టుకుపోయే సమస్యకు, అలసట, నీరసాలకు ఈ ఔషధం వాడుకోవచ్చు. ఒక టీస్పూను ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.


శ్వాస సమస్యలు

తరచుగా తలెత్తే కన్ను, ముక్కు, గొంతు సమస్యలు, పిల్లలు రాత్రుళ్లు ఏడ్వడం, కండరాల నొప్పులు, చర్మపు అలర్జీ, శ్వాస సమస్యలకు మూలికాసంబంధమైన ఔషధాలు ఉపయోగకరం. 


వాసారిష్ఠ: కఫం ఎక్కువగా ఉండి, తరచూ దగ్గు వేధిస్తుంటే ఉదయం, సాయంత్రం 5 లేదా 10 మి.లీటర్లు నీళ్లతో కలిపి తీసుకోవాలి.


అణు తైలం: జలుబు చేసి, ముక్కులో కఫం పేరుకుపోయి శ్వాస ఇబ్బందిగా మారడం, నిద్రలో నోటితో గాలి పీల్చుకోవడం మొదలైన ఇబ్బందులకు అణు తైలాన్ని వాడుకోవచ్చు. ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు ముక్కులో ఒక చుక్క తైలాన్ని వేసుకోవాలి.


తాళిసాది చూర్ణం: కఫంతో కూడిన దగ్గు ఉన్నవాళ్లు తేనెలో లేదా నీళ్లలో ఒక టీస్పూను ఈ చూర్ణం కలిపి తీసుకోవాలి.


జి. శశిధర్‌,

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల.


Updated Date - 2021-06-15T15:45:59+05:30 IST