Abn logo
Jun 1 2021 @ 14:07PM

ఊపిరితిత్తుల దారుఢ్యం పెంచుకుందాం!

ఆంధ్రజ్యోతి(01-06-2021)

కొవిడ్‌ నుంచి కోలుకున్నంత మాత్రాన గండం గట్టెక్కినట్టు రిలాక్స్‌ అయిపోకూడదు! వైరస్‌ దాడితో కుదేలైన ఊపిరితిత్తులు బలం పుంజుకునే పనులు సత్వరమే మొదలుపెట్టాలి! అంతకంటే ముఖ్యంగా మరోసారి కొవిడ్‌కు గురి కాకుండా రక్షణ చర్యలు కూడా కొనసాగించాలి! అప్పుడే కొవిడ్‌కు పూర్వం నాటి ఆరోగ్యాన్ని సమకూర్చుకోగలం అంటున్నారు వైద్యులు!

స్వల్ప కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఇంట్లోనే కోలుకున్నా, మధ్యస్తం లేదా తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిపాలై చికిత్సతో కోలుకున్నా ఊపిరితిత్తుల మీద తదనంతర లాంగ్‌ కొవిడ్‌ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. శ్వాసకోశ వ్యవస్థే లక్ష్యంగా కొవిడ్‌ వైరస్‌ దాడి చేయడమే ఇందుకు కారణం. వైరస్‌ సోకినప్పుడు శరీరంలో సైటోకైన్‌ స్టార్మ్‌ చోటుచేసుకుంటుందనే విషయం తెలిసిందే! దాని ప్రభావంతో ఊపిరితిత్తుల్లో తలెత్తే న్యుమోనియా తీవ్రతను బట్టి కొవిడ్‌ చికిత్సను వైద్యులు నిర్ణయిస్తారు. వ్యక్తుల వయసు, ముందు నుంచీ ఉన్న రుగ్మతలు, వైరల్‌ లోడ్‌, చికిత్సలో జరిగే ఆలస్యాలను బట్టి ఇన్‌ఫెక్షన్‌లలో స్వల్పం, మధ్యస్తం, తీవ్రం అనే దశలు ఆధారపడి ఉంటాయి. ఆ దశలను బట్టి అందుకు తగినవిధంగా కొవిడ్‌ చికిత్స కొనసాగుతుంది. 

కొవిడ్‌ తగ్గిన తర్వాత...

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొంతకాలం పాటు నీరసం, నిస్సత్తువలు వేధించడం సహజం. ఒక రోజు హుషారుగా ఉంటే, మరుసటి రోజు బడలికగా అనిపించడమూ సహజమే! కొద్ది దూరాల నడకకు, చిన్న చిన్న పనులకు ఆయాసపడిపోవడం లాంటివీ ఉంటాయి. ఇవన్నీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఊపిరితిత్తులు బలహీనపడ్డాయి అనడానికి సూచనలు. ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఊపిరితిత్తులు బలపడే వ్యాయామాలు, ఆహారశైలి, జీవనశైలి, మనోధైర్యాలను మెరుగుపరుచుకోవాలి.

జీవనశైలి మరింత మెరుగ్గా...

స్వల్ప దూరాలు నడక ఆరోగ్యకరం. కాబట్టి ప్రతి రోజూ నడకను కొనసాగించాలి.

తీవ్రమైన అలసటకు గురిచేసే వ్యాయామాలకు బదులుగా తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి. 

యోగాలో కూడా తేలికగా, సౌకర్యంగా ఉండే ఆసనాలనే ఎంచుకోవాలి.

కంటి నిండా నిద్రతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి నిద్రకు ముందు మనసులో గందరగోళాన్ని సద్దుమణిగేలా చేయడం కోసం శ్రావ్యమైన సంగీతం వినడం, ఆహ్లాదకరమైన కథలు చదవడం చేయాలి.

ఒత్తిడిని పెంచే ఆలోచనలు, జ్ఞాపకాలు నిద్రకు ఉపక్రమించే సమయంలో మనసులోకి చొరబడనీయకూడదు.

పచ్చని ప్రకృతిలో విహరించడం, వీచే గాలిని ఆస్వాదించడం లాంటి మనసును తేలికపరిచే పనులతో వ్యాధినిరోధకశక్తి మెరుగు పడుతుంది.

భోజనవేళలు, నిద్ర వేళలు, వ్యాయామ వేళలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి.

లంగ్‌ ఎక్సర్‌సైజ్‌!

రోజుకు మూడు సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఊపిరితిత్తులను బలపరిచే వ్యాయామాలు చేయాలి. అవేంటంటే...


స్పైరోమీటర్‌: గాలి పీల్చుకునేటప్పుడు స్పైరోమీటర్‌ను నిలువుగా, వదిలేటప్పుడు తలకిందులుగా ఉంచి, దాన్లోని బంతులు వీలైనంత పైకి లేచేవరకూ గాలిని పీల్చి వదలాలి. 

స్ట్రాతో: నీళ్లలో స్ట్రాను ముంచి బుడగలు వచ్చేలా ఊదాలి. 

పిడికిలితో: పిడికిలి బిగించి దాన్లోకి గాలిని బలంగా ఊదాలి. 

పెదవులకు అరచేయి అడ్డుపెట్టి: పెదవులకు అరచేతిని అడ్డుపెట్టి వీలైనంత బలంగా గాలిని ఊదే ప్రయత్నం చేయాలి.

ప్రాణాయామం: గాలిని లోపలకు పీల్చుకుని, కొన్ని క్షణాలు పట్టి ఉంచి, నెమ్మదిగా వదలాలి. ఊపిరి పూర్తిగా వదిలిన తర్వాత కూడా వీలైనంత సేపు గాలి పీల్చుకోకుండా ఉండగలగాలి.

ఈల వేయడం: బలంగా గాలిని పీల్చుకుని, మెల్లగా వీలైనంత ఎక్కువ సేపు ఈల వేయాలి.

బెలూన్‌ ఊదాలి: బెలూన్‌ ఊదడం కూడా వ్యాయామమే! వీలైనన్ని బెలూన్లను ఊదాలి.

ఊపిరి పీల్చి వదలడం: పైన చెప్పిన వ్యాయామాలు చేయలేనివాళ్లు, కేవలం దీర్ఘ శ్వాస పీల్చి వదిలే వ్యాయామం చేసినా ఫర్వాలేదు. 


పోషకాలు కోల్పోని ఆహారం ప్రధానం!

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్నవాళ్లు బలవర్థకమైన ఆహారం తీసుకోవడంతో పాటు, ఇమ్యూనిటీని క్షీణింపజేసే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. ఇందుకోసం...


జంక్‌ ఫుడ్‌, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

తాజా ఆకుకూరలు, కూరగాయలతో తయారైన వంటకాలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

పోషక నష్టం జరగకుండా ఉండడం కోసం కూరగాయ ముక్కలను ఆవిరి మీద ఉడికించాలి.

కూరగాయలను తరిగిన తర్వాత కూడా, తరగక ముందే నీళ్లలో కడుక్కోవాలి.

ఎక్కువ నీళ్లతో కూరగాయలను ఉడికించడం, మూత లేకుండా వంట చేయడం వల్ల పోషక నష్టం జరుగుతుంది. కాబట్టి మూత లేకుండా కూరలు వండకూడదు. నీళ్లు కూడా తగుమాత్రంగానే కలిపి వండుకోవాలి.

కూరగాయలు ఉడికించగా మిగిలిన నీటిని తాగేయాలి.


మనోధైర్యంతో మెరుగైన ఆరోగ్యం!

కొవిడ్‌ సోకినంత మాత్రాన ఆ వ్యాధి గురించి ఆలోచిస్తూ కుంగిపోవడం సరి కాదు. సోకిన ఇన్‌ఫెక్షన్‌ కచ్చితంగా తగ్గి, ఆరోగ్యం మెరుగవుతుందనే బలమైన నమ్మకంతో ముందుకు సాగాలి. ‘నాకే ఎందుకొచ్చింది? తగ్గకుండా మరింత ముదిరిపోతే ఏమవుతుంది?’ లాంటి అర్థం లేని ఆలోచనలు మాని, రోజు రోజుకూ నా ఆరోగ్యం మెరుగవుతోంది అనే పాజిటివ్‌ ఆలోచనలు పెంచుకోవాలి.


కొవిడ్‌ మరణాల గురించిన వార్తలు, సంఘటనలతో భయాందోళనలు పెంచుకోవడం అవివేకం. ఆరోగ్య పరిస్థితీ, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, వ్యాధికి స్పందించే శరీర తత్వాలు ఏ ఇద్దర్లో ఒకేలా ఉండవు. కాబట్టి చింతించడం మాని, వైద్యుల సూచనలు పాటిస్తూ, మెరుగైన చికిత్సను తీసుకోవాలి.

మనసుకు ఆహ్లాదం కలిగించే పనులు చేస్తూ, అలాంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. నచ్చిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సినిమాలు చూడడం, పుస్తకాలు చూడడం, సన్నిహితులతో సరదాగా గడపడం లాంటి పనులు కూడా ఇమ్యూనిటీని పెంచేవే! వాటి మీద దృష్టి పెట్టాలి.


డాక్టర్‌ విష్ణు రావు వీరపనేని

ఛైర్మన్‌, అలర్జీ మరియు ఆస్తమా వైద్య నిపుణులు,

శ్వాస హాస్పిటల్‌, హైదరాబాద్‌.