ఇంటి పాఠం ఒంటబట్టాలంటే..

ABN , First Publish Date - 2020-06-25T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలు మూతపడి, ఆన్‌లైన్‌ పాఠాలు మొదలయ్యాయి. హాయిగా ఇంటిపట్టునే కూర్చుని, పాఠాలు వినే సౌలభ్యం ఉన్నా... విద్యార్థులు ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి...

ఇంటి పాఠం ఒంటబట్టాలంటే..

లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలు మూతపడి, ఆన్‌లైన్‌ పాఠాలు మొదలయ్యాయి. హాయిగా ఇంటిపట్టునే కూర్చుని, పాఠాలు వినే సౌలభ్యం ఉన్నా... విద్యార్థులు ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ స్థితి నుంచి పిల్లలను తల్లితండ్రులు ఎలా కాపాడుకోవాలి? 

కొత్త విద్యా విధానానికి పిల్లలను ఎలా సిద్ధం చేయాలి? 


క్లాసులో కూర్చుని, బుద్ధిగా, శ్రద్ధగా పాఠాలు వినే రోజులు పోయి, కంప్యూటర్‌ స్ర్కీన్లను చూస్తూ ఆన్‌లైన్‌ పాఠాలు వినే పరిస్థితి మునుపెన్నడూ లేనిది, ఎవరూ ఊహించనిది! విద్యా విధానంలో హఠాత్తుగా చోటుచేసుకున్న ఇంతటి మార్పును విద్యార్థులు జీర్ణించుకుని, అందుకు తగ్గట్టు సర్దుకుపోవడం కొంత కష్టమే! బడులు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో తెలియని అయోమయం ఓ పక్క, ఆన్‌లైన్‌ పాఠాలను ఒంటబట్టించుకోలేని నిస్సహాయత మరోపక్క... పిల్లలను విపరీతమైన ఒత్తిడికి లోను చేస్తున్నాయి. ఫలితంగా అకారణంగా కోపం తెచ్చుకోవడం, చికాకు పడుతూ ఉండడం, విసుక్కోవడం, కుంగిపోవడం లాంటి భావోద్వేగాలను తల్లితండ్రులు పిల్లల్లో గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి కంగారు పడిపోకుండా, ఒత్తిడి లేని ఆన్‌లైన్‌ విద్యా విధానానికి అలవాటు పడేలా పిల్లలకు తోడ్పాటును అందించాలి. ఇందుకోసం... 




  1. ప్రేమగా మెలగండి : అలవాటు లేని ఆన్‌లైన్‌ తరగతులు పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించలేవు. అప్పుడప్పుడూ తలెత్తే సాంకేతిక లోపాలు ఆన్‌లైన్‌ పాఠాలకు అడ్డు తగులుతూ పిల్లలకు చీకాకు తెప్పిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందులను సహృదయంతో అర్థం చేసుకుని, వారితో ప్రేమగా మెలగాలి. విద్యా సంవత్సరం నష్టపోకుండా, అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, అందరు పిల్లలతో సమానంగా ఆన్‌లైన్‌ తరగతులకు అలవాటు పడాలనీ సున్నితంగా నచ్చచెప్పాలి. తరగతుల మధ్య విరామం ఉన్నా, ఏకాగ్రత కోల్పోతారనే భయంతో కంప్యూటర్ల ముందు పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టడం సరి కాదు. విరామ సమయాల్లో వారికి నచ్చిన పనులను చేయనివ్వాలి.
  2. విరామం ఇవ్వండి : బడిలో, కాలేజీలో తరగతులకు ఓ క్రమ పద్ధతీ, వాటి మధ్య విరామం ఉన్నట్టే, ఇంట్లో హాజరయ్యే ఆన్‌లైన్‌ తరగతులకూ ఉండాలి. మరీ ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామంలో లేచి, ఇల్లంతా నడిచి తిరిగేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఇలా ఉన్న చోటి నుంచి కదలడం వల్ల, పిల్లల్లో కొత్త హుషారు చోటు చేసుకుంటుంది. 
  3. వారు చెప్పేది వినండి : పిల్లల్లో చెలరేగే మనోభావాలు మీతో పంచుకొనేలా వారిని ప్రోత్సహించాలి. ఒత్తిడిని పిల్లలు వ్యక్తపరిచే తీరు భిన్నంగా ఉంటుంది. అందుకు తల్లితండ్రులు సిద్ధంగా ఉండాలి. వాళ్లు స్వేచ్ఛగా మనసులోని భావోద్వేగాలను వ్యక్తం చేసే వాతావరణం కల్పించాలి. వారి అభిప్రాయాలను సహృదయంతో అర్థం చేసుకుని, తగిన విధంగా స్పందించాలి. 
  4. బడిని మరిపించవద్దు: ఇంట్లో పాఠాలు వింటున్నంత మాత్రాన, ఇల్లూ బడి లాంటిదే అనే భావన పిల్లలకు కలిగేలా చేయకూడదు. మరీ ముఖ్యంగా ఐదవ తరగతి లోపు చిన్న పిల్లలకు, బడిలో లాగా ఆరు నుంచి ఏడు గంటల పాటు పాఠాలు చెప్పకూడదు. రోజు మొత్తంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే బడి గంటలు కేటాయిస్తే సరిపోతుంది. మిగతా సమయాల్లో పిల్లలతో ఆటల్లో పాలుపంచుకోవాలి. 
  5. స్నేహితులతో మాట్లాడనివ్వండి: బడిలో, కాలేజీలో ఉన్నప్పుడు తోటి స్నేహితులతో కాలక్షేపం చేయడం ద్వారా, చదువు ఒత్తిడి పిల్లల్లో ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌ పాఠాలతో సమానంగా స్నేహితులతో కాలక్షేపం చేసే వీలు ఉండేలా పిల్లలకు వీలు కల్పించాలి. ఇందుకోసం వీడియో ఛాట్‌ ద్వారా వారి స్నేహితులతో కబుర్లు చెప్పుకోనివ్వాలి. సోషల్‌ మీడియా, టెక్స్ట్‌ మెసీజ్‌ల కంటే వీడియో ఛాట్‌లు మేలు. వీటి ద్వారా పిల్లలు స్నేహితులను ప్రత్యక్షంగా కలిసిన అనుభూతికి లోనవుతారు. కాబట్టి వాళ్లను మిస్‌ అవుతున్నామనే భావన పిల్లలకు కలగదు. 
  6. వినోదాలకు సమయం: లాక్‌డౌన్‌తో అందివచ్చిన దీర్ఘకాల సెలవులను పిల్లలతో ఆనందంగా గడపడానికి తల్లితండ్రులు పూనుకోవాలి. అనుబంధాలను బలపరిచే వ్యాపకాల్లో భాగస్వాములను చేయాలి. సాధ్యమైనంత వరకు పిల్లల మనసు తెలుసుకుని మసలుకుంటూ ఉండాలి. వారిలో చెలరేగే భావోద్వేగాలను కనిపెడుతూ, మృదువైన ధోరణితో ఆన్‌లైన్‌ విద్యా విధానానికి అలవాటు పడేలా ప్రోత్సహించాలి.
  7. మానసిక ఆరోగ్యం కోసం: మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే కంటినిండా నిద్ర, పోషకాలు నిండిన ఆహారం, మానసికోల్లాసం సమతులంగా ఉండాలి. కాబట్టి క్రమబద్ధమైన జీవనశైలికి పిల్లలను అలవాటు చేయాలి. వారి ఆన్‌లైన్‌ పాఠాల షెడ్యూల్‌కు తగ్గట్టు, వారి భోజనం, నిద్రవేళల ప్రణాళిక రూపొందించాలి. ఆ ప్రణాళికకు తగ్గట్టు పిల్లలను నడిపించాలి. 

Updated Date - 2020-06-25T05:30:00+05:30 IST