మక్కలు అమ్మేదెలా?

ABN , First Publish Date - 2021-10-22T05:14:24+05:30 IST

మొక్కజొన్న రైతులను కష్టాలు.. నష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు అరకొరగా చేతికొచ్చిన పంటను అమ్ముకుందామనుకుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.

మక్కలు అమ్మేదెలా?
కుల్లిపోయిన, మొలకలు వచ్చిన మొక్కజొన్నను చూపుతున్న రైతులు

- మొక్కజొన్న రైతు దిగాలు

- జాడలేని కొనుగోలు కేంద్రాలు

- దళారుల చేతుల్లో మోసపోతున్న అన్నదాతలు

-  దిగుబడి.. ధర లేక ఆందోళన

- ముందుకురాని మార్క్‌ఫెడ్‌

జగిత్యాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న రైతులను కష్టాలు.. నష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు అరకొరగా చేతికొచ్చిన పంటను అమ్ముకుందామనుకుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. మొదట్లో వర్షాలు మురిపించగా ఎన్నో ఆశలతో పంట వేశారు. తదుపరి అధిక వర్షాలతో మొక్కజొన్న దిగుబడి తగ్గింది. దీనికి తోడు అటు మార్కెట్‌లో ధరలు కూడా అంతంతమాత్రంగానే పలుకుతుండడంతో రైతు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా ధరలు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని పెట్టుకున్న ఆశలు ఆడియాసలవుతున్నాయి. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లతో ఉన్న లాభనష్టాలపై తర్జనభర్జనలతో జాప్యం చేస్తుండడం వల్ల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్కల కొనుగోళ్లు చేయకుంటే రైతులు పంటపై పెట్టిన పెట్టుబడి సైతం రాబట్టుకోలేక నష్టాల పాలయ్యే అవకాశాలున్నాయి.

- జగిత్యాల జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం..

జగిత్యాల జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 54,086 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. గత యేడాది 34,745 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో వాస్తవానికి ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున జిల్లాలో మొత్తం 13.52 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు అధికంగా కురవడం కారణంగా మొక్కజొన్న పంట దెబ్బతింది. దీంతో రైతులు ఎకరాకు సుమారు 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడిని పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8.11 లక్షల క్వింటాళ్ల నుంచి 10.81 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొక్కజొన్న కంకిని కోయడం, బూరు తీయడం వంటివి పూర్తి చేసి కల్లాల్లో ఆరబెట్టుకునే పనులను రైతులు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో కంకులు తడిచి మొలకలు వస్తున్నాయి. పండించిన పంట కళ్లెదుటే పనికిరాకుండా పోతుండడం తట్టుకోలేక రైతులు ఏదో ఒక ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

- ప్రభుత్వ కేంద్రాలు తెరవక తిప్పలు..

ప్రస్తుత సీజన్‌లో మొక్కజొన్న క్వింటాలకు రూ. 1,870 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ యేటా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తిని ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాలు మొక్కజొన్న రూ. 2,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం రైతు చేతికి పంట వస్తున్న పరిస్థితుల్లో ధర రూ. 900 నుంచి రూ. 1,000 వరకు పడిపోయింది. ప్రస్తుతం వ్యాపారులు మొక్కజొన్న క్వింటాలుకు రూ. 1,500 నుంచి రూ. 1,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు చెల్లిస్తున్న ధర, మద్దతు ధరతో పోల్చితే భారీగా వ్యత్యాసం ఉంది.  ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. కోళ్ల దాణా, బిస్కట్‌ తయారీ పరిశ్రమల్లో మక్కలను పలు రకాలుగా వినియోగిస్తుంటారు. దీంతో మార్కెట్‌లో మక్కకు డిమాండ్‌ ఉంటుంది. రైతు చేతికి పంట వచ్చే సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తుండడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడం, ప్రైవేటు వ్యాపారులు ఆశించిన ధరలు చెల్లించకపోవడంతో పంట ఉత్పత్తులను రైతులు కల్లాలు, కొట్టంలలో ఆరబెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తుందో...?మద్దతు ధర అందుతుందో...? అని రైతులు ఎదురుచూస్తున్నారు. 


Updated Date - 2021-10-22T05:14:24+05:30 IST