ఇవేం బాధ్యతలు?

ABN , First Publish Date - 2021-01-18T08:47:56+05:30 IST

భూవివాదాలన్నింటినీ మీరే పరిష్కరించాలంటూ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు కత్తిమీద సాములా మారనున్నాయి

ఇవేం బాధ్యతలు?

భూవివాదాలను నెలరోజుల్లో తీర్చేదెలా!..కనీసం ఆర్నెల్లయినా అవకాశం ఇవ్వాలి

తహసీల్దార్‌ పనులు మేము చేయాలా!

కొత్త బాధ్యతలపై కలెక్టర్ల పెదవి విరుపు

పలు జిల్లాల్లో తగినంతగా లేని అధికారులు

కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ పోస్టులూ ఖాళీ


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): భూవివాదాలన్నింటినీ మీరే పరిష్కరించాలంటూ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు కత్తిమీద సాములా మారనున్నాయి. ఇప్పటిదాకా తహసీల్దార్లు నిర్వహించిన ఈ బాధ్యతలను తమకు అప్పగించడంతో  ఎలా పరిష్కరించాలో తెలియక వారు మదనపడుతున్నారు. ‘ఇవేం బాధ్యతలు? ఇవన్నీ మాకెందుకు ఇచ్చినట్లు? తహసీల్దార్ల పనులు చేయడానికా మేమున్నది?’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఇక ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపు చేసే పనులను కేవలం వారం, నెల రోజుల్లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు విధించడం కూడా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. రాష్ట్రంలో 16 వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో ఉండగా.. ఇరు వర్గాల వాదనలు వినడం, ఆ తర్వాత తీర్పు ఇవ్వడానికి కనీసం ఆర్నెల్లు పడుతుంది. ప్రభుత్వం మాత్రం నెలరోజుల్లోనే ఈ కేసులను పరిష్కరించాలని పేర్కొంది. ఇక సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం 32 జిల్లాల్లో (హైదరాబాద్‌ కాకుండా) 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన, తిరస్కరణ, ఆమోదం ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తి చే యాలని ప్రభుత్వం పేర్కొంది. పెండింగ్‌ మ్యుటేషన్ల దరఖాస్తును పరిశీలించిన వారం రోజుల్లోపు పూర్తి చేయాలని తెలిపింది. అయితే, 2 లక్షల పెండింగ్‌ మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కలెక్టర్‌ రోజుకు సగటున 892 దాకా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక వివాదాల్లేనప్పటికీ డిజిటల్‌ సంతకాలు చేయని ఖాతాలు 3,33,775 ఉన్నాయి. వీటి పరిశీలనకూ వారం రోజులే ప్రభుత్వం గడువు పెట్టింది. అత్యంత కీలకమైన నిషేధిత జాబితా తయారీకి కూడా నెల రోజులే గడువు విధించింది. ఇంత తక్కువ సమయంలో వీటన్నింటినీ పూర్తిచేయడం అంత సులువు కాదన్న అభిప్రాయంలో కలెక్టర్లు ఉన్నారు. నెల, రెండు నెలలు అంటూ నిర్ణీత సమయాన్ని కేటాయిస్తే ఫలితం రాదని భూచట్టాల న్యాయనిపుణులు చెబుతున్నారు. లోపాల్లేకుండా పని జరగాలంటే కచ్చితంగా అవసరమైన సమయం ఇవ్వాల్సిందేనని, కనీసం ఆర్నెల్ల సమయం ఇస్తేనే ఫలితాలు వస్తాయని అంటున్నారు. 


వనరులు లేకుండానే...

రాష్ట్రంలో పలు జిల్లాల్లో కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, భూపాలపల్లి, మెదక్‌ జిల్లాల్లో కలెక్టర్లు లేరు. భూములతో ముడిపడ్డ కేసులపై అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)కే పట్టు ఉంది. ఇక వరంగల్‌ అర్బన్‌  హైదరాబాద్‌, మెదక్‌, నిర్మల్‌, సూర్యాపేట, నారాయణపేట, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  భూముల కేసుల పరిష్కారంలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) సహకారం తీసుకోవాలని, ఆ పోస్టు ఖాళీగా ఉంటే అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ, పలు జిల్లాల్లో శిక్షణ పూర్తిచేసుకున్న ఐఏఎ్‌సలకు సబ్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉండగా.. అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థ)లుగా నియమించారు. ప్రస్తుతం ధరణి ఆధారంగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యతలన్నీ తహసీల్దార్లు చూస్తున్నారు. వీరు ఇతర విధులు నిర్వర్తించే పరిస్థితి లేకుండా పోయింది.  ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేట్‌ భూమి వంటి వివరాలన్నీ వీఆర్‌వోలకు తెలిసినంతగా ఏ అధికారికీ తెలియదు. కానీ, ఆ వ్యవస్థ రద్దయింది. రికార్డులన్నింటినీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో భద్రపరిచారు. దాంతో గ్రామంలో రికార్డుల్లేకుండా, వ్యవస్థలు లేకుండా ఈ విధులను విజయవంతంగా ఎలా పూర్తి చేయాలన్న డైలమాలో కలెక్టర్లు ఉన్నారు. 


వివిధ అంశాలకు సంబంధించి పరిష్కరించాల్సి ఉన్న కేసులు

అంశం కేసులు ఇచ్చిన సమయం

రెవెన్యూ ట్రైబ్యునల్‌ కేసులు 16,137 నెలరోజులు

పెండింగ్‌ మ్యుటేషన్‌ 2 లక్షలు వారం రోజులు

కంపెనీలు/సంస్థలకు పాస్‌బుక్‌లు 50 వేలు వారం రోజులు

ఆధార్‌ పెండింగ్‌ కేసుల్లో పాస్‌పుస్తకాలు 1,61,952 వారం రోజులు

పాస్‌పుస్తకంలో విస్తీర్ణం తగ్గిన కేసులు 1 లక్షలు వారం రోజులు

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్‌టీఆర్‌ కేసులు 30 వేలు నెలరోజులు

సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలన 9 లక్షలు మూడు నెలలు

Updated Date - 2021-01-18T08:47:56+05:30 IST