ఆరోగ్యంగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2021-05-10T06:22:50+05:30 IST

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలది బిజీ జీవితం. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేందుకు వారికి సమయం దొరకదు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే...

ఆరోగ్యంగా ఉండాలంటే..!

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలది బిజీ జీవితం. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేందుకు వారికి సమయం దొరకదు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. 


కొద్దిగా... ఎక్కువ సార్లు... :  ఆహారం కొద్దిగా తీసుకోవడం, ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది.  

నీళ్లు ఎక్కువగా తాగండి : డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. తగిన బరువును మెయిన్‌టెన్‌ చేయాలంటే సరిపడా నీళ్లు తాగాల్సిందే.

టీ, కాఫీలు వద్దు : కెఫిన్‌ అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలపై ప్రభావం పడుతుంది. కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్‌ బారినపడే అవకాశం ఉంటుంది. టీ లేక కాఫీ రోజూ రెండు కప్పులకు మించి తీసుకోవద్దు. 

సమతుల ఆహారం తీసుకోవాలి : పీచుపదార్థాలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలి. బరువు నియంత్రణలో ఉండటానికి, మలబద్ధకం దరిచేరకుండా ఉండటానికి పీచుపదార్థాలు దోహదం చేస్తాయి. ఓట్స్‌, బ్రౌన్‌రై్‌స, బార్లీ, క్వినోవా, పండ్లు, కూరగాయల్లో ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. రోజూ రెండు సార్లు తాజా పండ్లు తినాలి. హార్మోన్లు, ఎంజైముల ఉత్పత్తికి ప్రోటీన్ల అవసరం ఉంటుంది. పాలు, పెరుగు, చికెన్‌, కోడిగుడ్లు, సముద్రపు ఉత్పత్తులు, బీన్స్‌ ఎక్కువగా తినాలి. బాదం, వాల్‌నట్స్‌, అవిసెలను తీసుకోవాలి. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆకుకూరలు, అంజీర్‌, అప్రికాట్‌, ఖర్జూర వంటివి తినాలి. 

ఉప్పు, పంచదార తగ్గించాలి : ఆస్టియోపోరోసిస్‌, కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై భారం పడుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి ఉప్పు, పంచదార తక్కువగా తీసుకోవాలి.

స్నాక్‌ టైమ్‌ : స్నాక్స్‌ టైమ్‌ను అందరూ ఇష్టపడతారు. కానీ స్నాక్స్‌ ఎంపికలో జాగ్రత్తలు అవసరం. నట్స్‌, ఫ్రూట్స్‌, మల్టీగ్రెయిన్‌ బిస్కెట్లు తీసుకోవచ్చు. 

వ్యాయామం మరువద్దు : బిజీ జీవనం వల్ల వ్యాయామం చేసే సమయం దొరకడం లేదు. అందరూ అనే మాటే ఇది. అయితే రోజూ తప్పకుండా అరగంట సమయం వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్‌, యోగా, మెడిటేషన్‌లాంటివి చేయాలి. టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌...వంటి ఆటలలో మీకిష్టమైన ఆటను ఆడినా వ్యాయామం పూర్తవుతుంది.

తగినంత నిద్ర : రాత్రి తగినంత సమయం నిద్రపోయినప్పుడు మరుసటి రోజంతా హెల్తీగా పని చేసుకోగలుగుతారు. తగినంత సమయం నిద్రపోని రోజున దాని ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. పడుకునే ముందు ఫోన్‌, ఐప్యాడ్‌, ల్యాప్‌టాప్‌ వంటి గ్యాడ్జెట్లను చూడొద్దు. 


Updated Date - 2021-05-10T06:22:50+05:30 IST