చదువులు సాగేదెలా!

ABN , First Publish Date - 2022-09-14T06:52:21+05:30 IST

తెలంగాణ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల చదువులు నామ మాత్రంగా మారాయి. వర్సిటీలో సమస్యల పేరుతో చాలా మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టి పూర్తిగా చదువులను నిర్లక్ష్యం చేస్తు న్నారు. ఇదే అదునుగా బోధన చేసే అధ్యా పకులు కూడా తరగతులకు మొక్కుబడిగా హాజరవుతున్నారు.

చదువులు సాగేదెలా!

తెలంగాణ యూనివర్సిటీలో విద్యాబోధన అంతంత మాత్రమే!

నిత్యం ఆందోళన బాటలో విద్యార్థులు

వెలవెలబోతున్న తరగతి గదులు

విద్యార్థుల చదువులపై తల్లిదండ్రుల ఆందోళన

పట్టించుకోని తెలంగాణ యునివర్సిటీ అధికారులు

డిచ్‌పల్లి, సెప్టెంబరు 13: తెలంగాణ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల చదువులు నామ మాత్రంగా మారాయి. వర్సిటీలో సమస్యల పేరుతో చాలా మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టి పూర్తిగా చదువులను నిర్లక్ష్యం చేస్తు న్నారు. ఇదే అదునుగా బోధన చేసే అధ్యా పకులు కూడా తరగతులకు మొక్కుబడిగా హాజరవుతున్నారు. రిజిస్ట్రార్‌లో మాత్రం పూర్తి స్థాయిలో హాజరు శాతం ఉండేటట్లు జాగ్రత్తపడుతున్నారు. విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరించాలని ఇటీవల పది రోజుల పాటు విద్యార్థులు.. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తరగతులను సైతం బహిష్కరించారు. దీంతో చదువులు అటకెక్కాయి. ప్రస్తుతం విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళనలను విరమించారు. అయితే విద్యా ర్థులు రెగ్యులర్‌గా తరగతులకు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో తరగతి గదులు వెలవెలబోతున్నాయి. విద్యార్థుల నిరసనలను అలుసుగా తీసుకుని కొందరు అధ్యాపకులు బోధనలకు ఎగనామం పెడుతున్నారు. విద్యార్థులను ప్రోత్సహించి కొందరు అధ్యాపకులు ఆందోళన కార్యకమాల్లోనూ పాల్గొంటున్నారు. దీంతో తరగతిగదులు మూ గబోతున్నాయి. 

తల్లిదండ్రుల ఆందోళన

అనేక కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీకి పంపిస్తే ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నా యని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులు చదువులు మాని ఆందోళనలు, నిరసనలు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మొక్కుబడిగా హాజరు

యునివర్సిటీలో విద్యార్థులు తరగతులు, ల్యాబ్‌, ప్రాక్టికల్‌ పరీక్షలకు నామమాత్రంగా హాజరవుతున్నారని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఉన్నత చదువుల చదివి ఉద్యోగాలు సాధించాల్సిన వర్సిటీ విద్యార్థులు నిరసనలు, ఆందోళన పేరుతో తమ విద్య, జీవితాన్ని వృథా చేసుకుంటున్నారని వాపోతున్నారు. కొన్ని డిపార్టుమెంట్లలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నారని, ఇటీవల కెమిస్ట్రీ విభాగంలో పలు కంపనీలు వర్సిటీలో ఉద్యోగ మేళా నిర్వహించి ప్లేస్‌మెంట్‌ కల్పించిన సందర్భాలు ఉన్నాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. కెమిస్ట్రీ విభాగం విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని అన్ని  విభాగాల విద్యా ర్థులు చదువులో చురుగ్గా ఉండాలని కోరుతు న్నారు. సమస్యలు ఉంటే వీసీ, రిజిస్ట్రార్‌లతో చర్చించి పరిష్కరించుకోవాలని అధ్యాపకులు విద్యార్థులకు సూచిస్తున్నారు.

వీసీ దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వీసీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన గణేశ్‌ నిమజ్జనంలో డ్యాన్స్‌ చేస్తూ వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చిన వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందులో నాయకులు అనిల్‌, భరత్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, అశ్విన్‌, తదితరులు పాల్గొన్నారు. 

భయభ్రాంతులకు గురిచేయడం తగదు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ డ్యాన్స్‌ ఆరోపణలపై ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు బనాయిస్తూ సంఘ నాయకులను భయబ్రాంతులకు గురి చేయడం తగదని పీడీఎస్‌ఎయూ నాయకులు అన్నారు. మంగళవారం పీడీఎస్‌ఎయూ నాయకులు రాజేశ్వర్‌, పీవైఎల్‌ నాయకులు సాయినాథ్‌ విలేకరులతో మాట్లాడారు. యునివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వరుణ్‌, శంకర్‌, శ్రీజ, సిద్దు, సంతోశ్‌, రమ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సంఘాలపై విచారణ కమిటీ

ఫ నెలాఖరు లోపు నివేదిక అందజేయాలని రిజిస్ట్రార్‌కు వీసీ ఆదేశం

యునివర్సిటీలో ఇటీవల గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా కొందరు విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌పై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్‌ మీడియా, మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురించేలా ప్రోత్సహించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ విద్యావర్ధినిని ఆదేశించినట్లు వైస్‌చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంపై నెలాఖరు లోపు సమగ్ర నివేదిక అందించాలని ఆయన రిజిస్ట్రార్‌కు ఆదేశించారు. యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలను దెబ్బతిస్తున్న వారు విద్యార్థి సంఘాల నాయకులైనా.. అధ్యాపకులైనా.. క్షమించేదీ లేదని చట్టపరమైన తీసుకుంటమన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించినట్లు వీసీ తెలిపారు.

Updated Date - 2022-09-14T06:52:21+05:30 IST