మానవహక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-01-17T06:23:26+05:30 IST

మానవ హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని మానవహక్కుల కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు.

మానవహక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
యాదాద్రి బాలాలయంలో జస్టిస్‌ చంద్రయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు

హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య

యాదాద్రి, జనవరి16(ఆంధ్రజ్యోతి)/యాదాద్రి టౌన్‌: మానవ హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని మానవహక్కుల కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్టను ఆయన సందర్శించారు. తొలుత బాలాలయంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం స్వాగతం పలికిన అర్చకులు, పూజల అనంతరం మహాదాశ్వీరచనం చేసి స్వామి వారి శేషవస్ర్తాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం హరిత హోటల్‌లో జిల్లా అధికారులతో రెవెన్యూ పోలీస్‌, కాలుష్య నియంత్రణ, సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి ఆరు నివేదికలు అందించాల్సి ఉందని, విచారణ పూర్తి చేసి వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టుకతోనే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు సంక్రమిస్తాయన్నారు. రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వ శాఖల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ, ఆసరా పింఛన్లు, నిత్యావసర సరుకులు, రెవెన్యూ సమస్యలు, ధరణి, ధాన్యం కొనుగోలు తదితర అంశాల్లో పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పారు. జిల్లాలో భూ వివాదాలు, కుటుంబ కలహాలు, అట్రాసిటీ కేసులు, సాంఘిక బహిష్కరణ, మహిళలు, మైనర్ల మిస్సింగ్‌ వంటి కేసులపై సత్వర చర్యలు తీసుకుంటున్నామని భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డితెలిపారు. సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ ప్రకారం వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను డీఏవో మందడి ఉపేందర్‌రెడ్డి కమిషన్‌కు నివేదించారు. సమీక్షా సమావేశంలో పీసీబీఈఈ రాజేందర్‌, ఎంఈవో కృష్ణ, కమిషన్‌ పీఎస్‌ శ్రీనివాస్‌, దేవస్థాన ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:23:26+05:30 IST