Abn logo
Oct 29 2020 @ 00:28AM

తెలంగాణలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ రూ.320 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెచ్‌ఎస్‌ఐఎల్‌ కంపెనీకి చెందిన గ్లాస్‌ ప్యాకేజింగ్‌ ఉత్పత్తుల విభాగం ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌.. ‘స్పెషాలిటీ గ్లాస్‌’ తయారీ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. భువనగిరిలో రూ.220 కోట్లతో స్పెషాలిటీ గ్లాస్‌ యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌ఎస్‌ ఐఎల్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ 2022, సెప్టెంబరు చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించగలదని చెప్పారు. 15 ఏకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌లో అయిదు తయారీ సదుపాయాలు ఉంటాయి.  ఇప్పటికే ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌నకు సనత్‌నగర్‌, భువనగిరిలో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ రెండు యూనిట్లలో రోజుకు 1600 టన్నుల కంటైనర్‌ గ్లాస్‌ను కంపెనీ తయారు చేయగలదు. 

సంగారెడ్డి ప్లాంట్‌ విస్తరణ : హింద్‌వేర్‌ బ్రాండ్‌తో ఉత్పత్తులను విక్రయిస్తున్న హెచ్‌ఎస్‌ఐఎల్‌ రూ.100 కోట్లతో ప్లాస్టిక్‌ పైపులు, ఫిటింగ్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. సంగారెడ్డి ప్లాంట్‌ సామర్థ్యాన్ని 30 వేల టన్నుల నుంచి 48 వేల టన్నులకు పెంచుతున్నామని, 2022 సెప్టెంబరు చివరికి సామర్థ్య పెంపు పూర్తవుతుందని సందీప్‌ సొమానీ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement